Skip to Content

ఓ అనామకురాలు

  • Author: Mercy Ratna Bai Shadrach
  • Category: Women
  • Reference: Bible Women

ఊజు దేశస్తుడైన యోబు యథార్ధవంతుడు, న్యాయవంతుడు దైవభక్తిగలవాడు. చెడుతనమును విసర్జించినవాడైయుండి భూమి మీద అతనివంటి వాడు లేడని దేవునితో మెప్పుపొందిన వ్యక్తి. ఇతని సతీమణి పేరు గ్రంథం లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు కేవలం యోబు భార్య గానే పిలువబడింది. వీరికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఏడువేల గొర్రెలు, మూడువేల ఒంటెలు, అయిదువందల జతల ఎడ్లు (అనగా వెయ్యి ఎడ్లు ) అయిదువందల ఆడ గాడిదలూ యింకా అనేకమంది దాసదాసీజనం కలిగి తూర్పు దేశంలో అందరికంటె ఘనంగా ఎంచబడినాడు.

యోబు దేవుని అధికంగా ప్రేమించాడు. అతని ఆధ్యాత్మిక జీవితాన్నిబట్టి అతని కుటుంబ సభ్యులు ఇంత ఇక్యమత్యంగా జీవించగలిగారు. యోబు యొక్క సత్ప్రవర్తనవల్లనే సమస్తమునూ పొందగలుగుచున్నాడని ఇరుగు పోరుగునున్నవారు గ్రహించారు. తన భర్త కుటుంబ భోగభాగ్యాలకు యోబు భార్య ఎంతగానో మురిసిపోతువుండేది.

ఈ కుటుంబ సంపద, ఐక్యత సాతానుకు నచ్చలేదు. చెరుపు చేయడమే వాని నిత్యకృత్యం. దేవుని నుండి ఉత్తర్వులు పొందిన సాతాను దెబ్బపై దెబ్బ కొడుతూ యోబు సంపదను ఆపై అతని సంతతిని నాశనపరచింది. ఇల్లు, భార్య, నలుగురు పనివారు మాత్రమే అతనికి మిగిలియుండిన, ఆస్తిపాస్తులు. సర్వాన్ని కోల్పోయినా దేవుని మాత్రం విడువలేదు. దైవధ్యానం మరువలేదు. ప్రాణం తప్ప సమస్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్న సాతాను యోబు భక్తుణ్ణి ఓ భయంకరమైన చర్మవ్యాధి తో మొత్తింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు, బొబ్బలు కలిగాయి. పట్టుపరుపులపై కూర్చునే అతను పెంటకుప్పలలో కూర్చుండే పరిస్థితి ఏర్పడింది. ఇది కడు దయనీయ స్థితి అందుకే కొందరు క్రైస్తవులు తమకు కష్టాలు కలిగినప్పుడు యోబు భక్తుని గుర్తుచేసుకుంటారు. దేవునియందు భక్తి విశ్వాసములులేని యోబు దుస్థితిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంకా నీవు యథార్ధతను విడిచి పెట్టావా అని గద్దించి అడిగింది. దేవుని దూషించి మరణము కమ్మని ఉచిత సలహాలెన్నో ఇచ్చింది. కష్ట సమయంలో తోడునీడగా ఉండవలసిన అర్థాంగి, వాడి అయిన మాటలతో అతని కించపరచింది.

అయినా యోబు చలించలేదు. దేవునిపై అతనికున్న భక్తి అచంచలమైనది. అవిశ్వాసి అయిన అతని భార్య జరిగిన నష్టాలను భరించలేకపోయింది. స్త్రీ సహజ గుణాలయిన ప్రేమ, కరుణ, క్షమాగుణాలను మంటగలిపింది. అందుకే పౌలు భక్తుడు తన గ్రంథములో ఇలా సెలవిచ్చాడు “క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగసంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డి తనము కలుగజేసింది” ( IIకోరింతీ 4:4) చీకటివెంట వెలుగులా దేవుడు యోబును తిరిగి దీవించాడు. యథావిధిగా ఏడుగురు కుమారులను, కుమార్తెలను అనుగ్రహించాడు. మునుపటికంటే రెట్టింపు పశుసంపదను ఇచ్చి దీవించాడు. తాత్కాలికంగా సాతాను పెట్టే బాధలు పడడాన్ని తట్టుకోలేని యోబు భార్య తన భర్తను తూలనాడింది దైవ దూషణ చేయడానికికూడా వెనుకాడలేదు. దేవుడు కొన్నిసార్లు తన బిడ్డలమీదికి బాధలు, కష్టాలు పంపినా అవి కేవలము బాధకోసము మాత్రమే కాక మంచి ఫలాలను ఫలించాలనే ఆయన ఉద్దేశమైయున్నది. కాని యోబు భార్య ఈ సత్యాన్ని గ్రహించాలేకపోయింది. మనము బాధలు పరంపరగా వచినప్పుడు ఓర్చుకోలేని స్థితిలో దైవదూషణ చేస్తూఉంటాము. అది మంచిది కాదని ప్రతివారు గ్రహించాలి.


Share this post