Skip to Content

యెహోవా యొద్ద మాత్రమే దొరుకు అంశములు

5 July 2024 by
Sajeeva Vahini

(క్షమాపణ – కృప – విమోచన)

కీర్తన 130:4 యెహోవా...... యొద్ద క్షమాపణ దొరుకును

కీర్తన 130:7 యెహోవా యొద్ద కృప దొరుకును.

కీర్తన 130:7 యెహోవా యొద్ద విమోచన దొరుకును.

ఇవి మూడు యెహోవా యొద్దనే దొరుకును. కనుక మనము చేయవలసినది ఏమిటంటే

యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.

కృప ->విమోచన =క్షమాపణ

ఎఫెసీ 1:7 దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది .

(1) క్షమాపణ: క్షమించుట అనునది దేవుని లక్షణము

కీర్తన 86:5 ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు. మన పాపముల నుండి మనకు క్షమాపణ కలగాలి అంటే రక్తము చిందింపబడాలి (హెబ్రీ 9:22).కాబట్టి పాపము లేని రక్తము చిందించిన యేసు ప్రభువు వలన మాత్రమే మనకు క్షమాపణ దొరుకును. యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. (1యోహాను 1:7) కనుక క్షమాపణ పొందాలంటే మనము చేయవలసినది ? మన పాపములను మనము ఒప్పుకోవాలి 1యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్ణీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

ఉదా : లూక 7:37,38,48 పాపాత్మురాలైన స్త్రీ తన పాపములను కన్నీటితో యేసు పాదముల వద్ద ఒప్పుకొనినది కనుక ఆమె పాపములు క్షమించబడినవి.

ఆయనయందు విశ్వాసముంచాలి

అపో 10:43 ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామముమూలముగా పాపక్షమాపణ పొందును ... ఉదా: మార్కు 2:1-10 పక్షవాయువుగలవాని యొక్క విశ్వాసమును బట్టి, మోసుకొని వచ్చిన వారి విశ్వాసము చూచి యేసు ఆ వ్యక్తితో “నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పెను.”

(2) కృప: కృప అనునది ఉచితమైన దేవుని ప్రేమ. మన దేవుడు - కృపాసమృద్ధిగలవాడు (కీర్తన 103:8), సర్వకృపానిధి(1పేతురు 5:10),కృపాతిశయము గలవాడు(కీర్తన 86:5), తనకు ప్రార్ధన చేయు వారందరి యెడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైయున్నాడు(రోమ 10:12) కృప ద్వారా మనము పొందిన ఆశీర్వాదములు: రక్షింపబడ్డాము - ఎఫెసీ 2:8 కృపచేత రక్షింపబడియున్నారు.

బలవంతులము - 2తిమోతి 2:1 కృపచేత బలవంతుడవు కమ్ము.

నిత్యజీవము - రోమ 6:23 కృపావరముగా నిత్యజీవము పొందాము.

ఉదా: 2కొరిం 12:8 పౌలు గారి బలహీన సమయములో దేవుని చాలిన కృప చేత శక్తి పరిపూర్ణమైనది.

(3) విమోచన: విమోచన అనునది దేవుని కార్యము

మనము విమోచించబడిన విధానము: యేసు క్రీస్తు దేవునికిని నరులకును మధ్యవర్తియై తన నిర్దోషమైన రక్తమును మన కొరకు విమోచన క్రయధనముగా సమర్పించి మనలను విమోచించి నీతిమంతులుగా తీర్చెను

(1 తిమోతి 2:5,6,1పేతురు 1:18,19, రోమ 3:24 ) ఉదా: యోబు యొక్క దుస్థితి నుండి దేవుడు సంపూర్ణముగా విమోచించి యోబును రెండంతలుగా ఆశీర్వదించెను అందుకే యోబు 19:25లో నా విమోచకుడు సజీవుడని సాక్ష్యమిచ్చెను. ఈ క్షమాపణ – కృప – విమోచన గనుక మనకు లేకపోతే:

కీర్తన 130:3 యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? ఇంత గొప్ప దీవెన పొందిన మనము చేయవలసినది: కీర్తన 135:20 యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహోవాను సన్నుతించుడి.


Share this post