Skip to Content

సరిచేసుకొనుట - దిద్దుకొనుట

18 July 2024 by
Sajeeva Vahini
  • Author: Unknown
  • Category: Articles
  • Reference: General

పితృపారంపర్యమైన మీ ప్రవర్తనను విడచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింప బడలేదు గాని, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్ర్రీస్తురక్తముచేత విమోచింపబడితిరి (1 పేతురు 1:18,19)

మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవి జరిగించుటకు గతించిన కాలమే చాలును (1పేతురు 4:3). దయచేసి ఈ పాపములన్నీ మానివేసి ప్రభువువైపు తిరుగమని బ్రతిమాలుతున్నాను. నీ జారత్వము, వ్యభిచారం నుండి పారిపో, మోహపుచూపును వెలిచూపును వదిలెయ్! దేవునికి కోపం పుట్టించే పోములు/ రక్షరేకులు/ తావీదులు తీసిపారెయ్! త్రాగుడు, ధూమపానం విసర్జించు! మన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి సమర్ధుడు! నీ అబద్ధాలు అబద్ద ప్రమాణాలు మానెయ్! వాస్తు చూడటం లాంటి అన్యాచారాలు విసర్జించు! ఎందుకంటే ఇవన్నీ దేవుని నీతిని నెరవేర్చవు. మనం పరిశుధ్ధులగుట అనగా జారత్వం నుండి పారిపోవుట & తన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము! (1 థెస్స 4:3,4). లంచాలు పుచ్చుకొనేవారు కొందరు. లంచం పుచ్చుకోకూడదు అని బైబిల్ సెలవిస్తుంది (నిర్గమ 23:8). అన్యాయస్తులు దేవుని రాజ్యం చేరరు అని గ్రంథం సెలవిస్తుండగా మరి ఎందుకు నీ సహోదరుని/ స్నేహితుని/ పొరుగువారిని/ తెలిసినవారిని/ తెలియని వారిని మోసం చేస్తావు? నిన్ను ఎవరూ దోచుకొనక పోయిననూ,మోసం చేయకపోయినా మోసం చేసే నీకు శ్రమ! నీవు దోచుకొనుట, మోసగించుట ముగించిన తర్వాత మోసగింపబడతావు అని బైబిల్ సెలవిస్తుంది.(యెషయా 33:1) మరికొందరు ఆదివారంనాడు ముఖ్యమైన క్రికెట్ మాచ్ ఉంటే చర్చికి రారు. కొంతమంది పాటగాల్లు వచ్చినా పాటలు అయిపోయిన వెంటనే మాచ్ చూడటానికి పారిపోతారు. దేవుని కన్నా మీకు క్రికెట్ మ్యాచ్ ఎక్కువై పోయిందా మీకు? క్రికెట్ నీకు విగ్రహం గా మారిపోలేదా నీకు? మరికొంతమంది (స్త్రీలు ముఖ్యంగా) TV serials ఉంటే రాత్రిపూట సంఘంలో జరిగే ఆరాధనలకుగాని, ఉపవాస కూటాలకి గాని, గృహకూటములకి గాని రారు. లేదా సీరియల్స్ అయిపోయిన తరువాత వస్తారు. ఇదేనా నీ భక్తి? దేవునికిచ్చే స్థానం ఇదేనా? దేవునికన్నా దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహమే! ఒకవేళ దేవుడు రెండో రాకడలో వచ్చి పిలిస్తే మ్యాచ్ అయిపోయాక వస్తాను, సీరియల్ అయ్యాక వస్తాను అని చెబుతావా? బుద్ధిలేని కన్యకలవలే విడచిపెట్టబడతావ్ జాగ్రత్త! ఒకవేళ మరణదూత వచ్చి పిలిస్తే అవి చూసి వస్తాను అని చెప్పడం కుదురుతుందా? బలవంతంగా నీ ప్రాణాన్ని గుంజి, ఈడ్చుకొంటూ తీసుకొని పోతాడు. నేటికాలంలో సినిమాలు చూడటం, సీరియల్స్ చూడటం తప్పని బోధించడం మానేసారు. సినిమా అబధ్ధమని, దానిలో మంచికన్నా చెడే ఎక్కువని తెలుసు, వాటిలో జారత్వం కాముకత్వం పెంచే సన్నివేశాలు ఎక్కువని తెలుసు. అయినా చూస్తావు. తప్పించుకొంటావా? వ్యభిచారుణులారా! ఈ లోకస్నేహం దేవునితో వైరమని తెలియదా? అని గ్రంథం సెలవిస్తుంది.(యాకోబు 4:4). పైకి భక్తి గలవాని వలె నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారిలా ఉంటున్నావు (2పేతురు 3:5). నీవు ప్రశస్తమైన దేవుని అమూల్యమైన రక్తంలో కడుగబడిన వాడవని మర్చిపోతున్నావు.

మరి ఇప్పుడు ఏం చెయ్యాలి?

ఇప్పడైననూ మీరు ఉపవాసముండి కన్నీరు విడచుచూ, దుఃఖించుచూ, మనఃపూర్వకముగా (మనస్పూర్తిగా) తిరిగి నాయొద్దకు రండి! ఇదే యెహోవా వాక్కు! (యోవేలు 2:12). ఇశ్రాయేలు! నీవు తిరిగి రానుధ్ధేశించిన యెడల నా దగ్గరకే రావలయును అంటున్నారు తండ్రి! మిమ్మల్ని విమర్శించాలని గాని, కించపరచాలని గాని, మీమీద కోపం తో గాని ఈ విషయాలు వ్రాయలేదు గానీ నేటి యువతను, సంఘాలను, అన్యాచారాలను చూసి హృదయభారంతో కన్నీటితో, పరిశుధ్ధాత్ముని ప్రేరేపణతో వ్రాయడం జరిగింది.

మిమ్మల్ని నొప్పించియుంటే క్షమించండి గాని మీరంతా పరలోకం చేరాలని నా ఆశ.

దేవుడు మిమ్మల్ని దీవించును గాక!


Share this post