Skip to Content

పదిమంది కుష్టురోగుల ప్రార్ధన

18 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sis. Vijaya Sammetla
  • Category: Articles
  • Reference: General

యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరిలూకా 17:13

  • కుష్టు పాపమునకు సాదృశ్యము • కుష్టు సోకిన వారు, పాలెం వెలుపల జీవించాలి. వారినెవరూ తాక కూడదు. • ఒకవేళ వారు బాగుపడితే, యాజకులకు తమ దేహాలను కనుపరచుకొని, మోషే నిర్ణయించిన కానుక సమర్పించి, ఆ తరువాత సమాజములో చేరాలి. • మిర్యాము, గెహాజి వంటి వారు కుష్టుతో మొత్తబడ్డారు.
  • యేసు ప్రభువు వారు యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్తున్నారు. •ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసూ ప్రభువా! మామీద జాలిచూపు అంటూ కేకలు వేస్తున్నారు.

దూరముగా ఎందుకు నిలవాలి? దగ్గరకు రావచ్చుకదా? లేదు. లెవీ కాండము 13: 45,46 ప్రకారము, వారు దగ్గరకు రావడానికి వీల్లేదు. అందుకే దూరముగా నిలిచారు.

*అయితే, యేసు ప్రభువును సహాయము అడిగినప్పుడు ఆయన కాదనిన సందర్భాలుగాని, ఆయన చెంతకు వచ్చినవారిని త్రోసివేసిన సందర్భాలుగాని లేనేలేవు*.

ఆయన వారిని చూచి, మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లు చుండగా, శుద్ధులైరి. లూకా 17:14

అయితే, వారు అడిగిన దానికి సమాధానముగా ఆయన వారిని ముట్టలేదు. స్వస్థ పరచలేదు. యాజకుల దగ్గరకు వెళ్లి, మీ దేహాలను వారికి చూపించుకోండి అని చెప్పారు.

అయితే, వారు ప్రశ్నించాలి కదా? ఇట్లాంటి దేహాలతో యాజకుల దగ్గరకు ఎట్లా వెళ్ళగలమని? వారికి ఎట్లాంటి సందేహం రాలేదు. పూర్తిగా ప్రభువువారి మాటలను విశ్వసించారు. ఏమి మాట్లాడకుండా యాజకుల దగ్గరకు బయలుదేరారు. అంటే? వారికున్న విశ్వాసం స్పష్టం అవుతుంది. వారు ఇంకా యాజకుల దగ్గరకు చేరకముందే, మధ్యలోనే స్వస్థ పరచబడ్డారు.

అందుకే, ప్రభువువారు కూడా, తిరిగి వచ్చిన ఆ సమరయునితో "నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరచింది" అంటున్నారు. మన జీవితాలలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోలేక పోవడానికి కారణం? విశ్వసించలేకపోవడం, తద్వారా ఆయన చెప్పినట్లు చెయ్యలేకపోవడమే.

*పదిమందీ కరుణించమని ప్రార్ధించారు, పదిమందీ విశ్వసించారు. పదిమందీ బయలుదేరి వెళ్ళారు. పదిమందీ స్వస్థపరచ బడ్డారు. కాని, కృతజ్ఞత కలిగి, తిరిగివచ్చి, ఆయనను ఆరాధించిన వాడు ఒక్కడే*.

ఆ తొమ్మిదిమంది ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం కదా? అవును! అయితే, మన సంగతేమిటి? పాపపు కుష్టుచేత నిత్య మరణమునకు తప్ప, దేనికీ యోగ్యతలేని మనలను ఆయన ప్రాణమునే బలిగా అర్పించి, ఆ నిత్య మరణము నుండి తప్పించినందులకు మనమెట్లాంటి కృతజ్ఞత కలిగియున్నాము?

*దేవుని మేలులు అనుభవిస్తూ, కృతజ్ఞతలేని ఆ తొమ్మిదిమందివలే మన జీవితాలున్నాయేమో*? సరిచూచుకుందాం! సరిచేసుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక! *ఆమెన్! ఆమెన్! ఆమెన్*!


Share this post