Skip to Content

నీ నడత నిన్నెక్కడికి నడిపిస్తుంది? ...... ప్రవర్తనలో మాదిరి

  • Author: Sis. Vijaya Sammetla
  • Category: Articles
  • Reference: General

నీ ¸యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:12

ప్రవర్తన అంటే? చూపులు, తలంపులు,మాటలు, క్రియలు అన్నింటి సమూహమే ప్రవర్తన.

చూపులలో పరిశుద్ధతను కోల్పోతే? తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాము. తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే? మాటలలోనూ, క్రియలలోనూ పరిశుద్ధతను కోల్పోతాము. తద్వారా మన ప్రవర్తన మలినమై, పాపమునకు మరింత దగ్గరై, దేవునికి దూరమై పోతాము.

తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు చచ్చును. సామెతలు 19:16

ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే? శారీరికముగా బ్రతికియున్నా, ఆత్మీయముగా చచ్చినవారమే. సందేహం లేనేలేదు. దీనికి ప్రత్యక్ష సాక్షి, రాజైన దావీదే. చూపులలో, తలంపులలో, క్రియలలో పరిశుద్ధతను కోల్పోయి వ్యభిచారుల, నరహంతకుల జాబితాలో చేరిపోయాడు.

దేవుని చేత "నా హృదయానుసారుడు" అని సాక్ష్యము పొందినవాడు. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా వుండడం వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది?

  • పుట్టిన బిడ్డ చనిపోయాడు. •పిల్లలు వ్యభిచారులు, హంతకులయ్యారు. •కన్నకొడుకే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు. •కనీసం చెప్పులు లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవలసి వచ్చింది. •కుక్క వంటి "షిమి " ఓ దుర్మార్గుడా, నరహంతకుడా! ఛీ! ఫో ...అంటూ దూషిస్తూ, శపిస్తూ వుంటే, మౌనముగా తల వంచాల్సి వచ్చింది. •దేవుని పక్షంగా యుద్దాలు చెయ్యడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్దాలు చెయ్యొద్దని ప్రమాణం చేయించారు. ఇట్లా... ఎన్నో! ఎన్నెన్నో!

నీ సంగతేమిటి? ఇంటర్ నెట్ లో చూడకూడనివి చూస్తూ, చూపులలో పరిశుద్ధతను కోల్పోయి, తద్వారా హృదయ తలంపులను పాడుచేసుకొని, పాపం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నావా? అయితే ఒక్క విషయం!! "హృదయానుసారుడే" తప్పించుకోలేక పోయాడు. ఇక నీకెట్లా సాధ్యం?

నీ ప్రవర్తన సరిచేయబడాలి అంటే? ఒక్కటే మార్గం. వాక్యమైయున్న దేవునిని నీ హృదయంలో వుంచుకొని, నీ ప్రతీ కదలికలోనూ ఆయనను ముందు పెట్టుకోవాలి.

యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? కీర్తనలు 119:9

అవును! యౌవనుడైన యోసేపును పాపం పట్టుకోవాలని, బంధించాలని ప్రయత్నం చేస్తుంటే? దానికి చిక్కకుండా పారిపోతున్నాడు. ఇంటిలో పాపముందని, యోసేపు ఇంటి బయట ఉంటున్నాడు. అందుకే గదా! బానిసగా బ్రతకాల్సిన వాడు రాజుతో సమానుడయ్యాడు. దేశ ప్రధాని అయ్యాడు.

నీ జీవితం ఎట్లా వుంది? పాపమును పట్టుకోవడానికి దాని వెంటబడి పరుగులు తీస్తున్నావా? దాని చేతిలో బంధీగా మారిపోయావా? అందుకే గదా! రాజులుగా బ్రతకాల్సిన మనము ఇంకా సాతానుకు బానిసలుగానే జీవిస్తున్నాము?

నీ దుష్ట ప్రవర్తన నీకు బాధను తీసుకొస్తుంది. "బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు." కీర్తనలు 107:17

నీ మూర్ఖ ప్రవర్తన నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. "మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును." సామెతలు 28:18

అట్లా కాకుండా! నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి 1 కొరింది 15:34

నీ యథార్థమైన ప్రవర్తన దేవుని ఇంటిలో నీకు ఆతిధ్యాన్నిస్తుంది.

యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కీర్తనలు 15:1,2

నీ ప్రవర్తన దేవునికి యిష్టమైనదైతే? ఆయన నీ శత్రువులనుసహా నీకు మిత్రులుగా చేస్తాడు. సామెతలు 16:7

నీ ప్రవర్తన దేవుని అధికారానికి తలవంచేదిగా వుంటే? "ఆయన నీ త్రోవలను సరాళము చేస్తాడు. సామెతలు 3:6

ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం ఎటువైపు సాగిపోతుందో? దేవుని పిల్లలముగా మన ప్రవర్తన మనలను తృణీకరింపచేసేదిగా ఉందా?

లోకము నుండి ప్రత్యేక పరచబడిన మనమూ, మన ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్


Share this post