Skip to Content

నీ ఇంటిని చక్కబెట్టుకో

18 July 2024 by
Sajeeva Vahini
  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Articles
  • Reference: Jesus Coming Soon Ministries

నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ యిల్లు  చక్కబెట్టుకొనుమని యోహోవా సెలవిచ్చెను. 2 రాజులు 20:1-5

       క్రీస్తునందు ప్రియ ప్రియపాఠకులారా  యేసు నామమున  శుభము కలుగును గాక ! మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రములు కలుగును గాక! ఆమెన్.

          ప్రస్తుతం ఈ లోకంలో జరుగుతున్న హడావిడి ఒకటే. ఇల్లు కట్టడం, ఇల్లు అమ్మడం మనం తరచుగా  చూస్తున్నాం. ఈ పరంపరలో చాలామంది పెండ్లిండ్లు చేసి ఇల్లు అమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇల్లు అమ్మేవారు, సరైన ఆదాయం రావడం లేదని ఇల్లు అమ్ముతారు. కారణం బాడుగకు ఇల్లు ఇచ్చినప్పుడు వారు చెప్పినట్లు వినే వారు ఇచ్చిన డబ్బులతో తృప్తి చెందక, ఖాళీ చేయ్యి, ఖాళి చేయ్యి అని చెప్తూ ఉంటారు. ఈలాంటి ఘోరమైన రోజులలో మనం జీవిస్తున్నాం.

   ఇల్లు రెండు రకాలు

1.మనం నివసించే ఇల్లు

 2.మన కుటుంబం అనే ఇల్లు

 మొదటి ఇల్లు స్థిరమైనది కాదు, ఎన్ని లక్షలు పెట్టి కట్టించుకొన్నా, ఎన్ని కోట్లు పెట్టి కట్టించుకొన్నా ఏదో ఒకరోజు వదిలి పోవాల్సిందే.

     రెండవ ఇంటిని చూస్తే ఈ ఇంటిలో ఉండే కుటుంబము ఐక్యమత్యంతో జీవిస్తే దీర్ఘ కాలం జీవిస్తారు లేకపోతే అది కూడా జరగకపోవచ్చు.

 బైబిల్ గ్రంథంలో 1 రాజులు 20:1- 15 వరకు మనం చదివినట్లయితే అక్కడ హిజ్కియా రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తాం.

 ఈ  హిజ్కియా బాల్య జీవితం ఎంతో గొప్పదైనది. అతని తల్లి హిజ్కియాను దైవభక్తిలో  పెంచింది. తత్ఫలితంగా 25 సంవత్సరాల వయస్సులోనే రాజైనట్లు చూడగలుగుతాము. 1 దినవృత్తాంతములు 29 వ అధ్యాయంలో తన రాజ్యంలో ఆయన చేసిన మంచి పనులు

1 మందిర తలుపులు తెరిచి, బాగు చేయించాడు 29: 3

2.నిషిద్ధ వస్తువులన్నీ బయటికి పారద్రోలినాడు 5వ

3.మందిరమును ప్రతిష్టించినాడు

4. పెందలకడలేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని మందిరమునకు వెళ్లేవాడు20 వ

 ఇంకా ఎన్నెన్నో చేసాను. ఇలాంటి గొప్ప కార్యములు చేసిన వ్యక్తి అనతికాలంలోనే దేవుని దృష్టిలో అనైతికంగా ప్రవర్తించాడు.

అతని బలహీనతలు

1. శత్రువులతో రాజకీయ స్నేహం ప్రారంభించాడు. 2.ఉన్నత  స్థలములలోని బలిపీఠమును పడగొట్టిచెను.

3. మనసున గర్వించెను

4. తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు.

       దీనికంతటికీ కారణం తన ఐశ్వర్యమే. తన ఐశ్వర్యం అనే గ్రుడ్డి తనము తో దేవుని మరచి నందుకు  దేవుడే మరణకరమైన రోగమును పంపాడు. రోగాలు ఎన్నెన్నో చూస్తుంటాము,కొన్ని రోగాలు మనిషి ప్రాణాలు తీస్తాయి, కొన్ని తీయవు ,అయితే బైబిల్ వాటి గురించి స్పష్టంగా చెబుతుంది. 1 యోహాను 5: 18 ,19 వచనాలు చూస్తే భక్తుడైన యోహాను రెండు విషయాలను  జ్ఞాపకం చేస్తున్నాడు.

1. మరణంకరము కానీ పాపము చేయగా అతడు రోగియై పరుండినప్పుడు తన సహోదరుడు అతని గురించి దేవుని వేడుకుంటే దేవుడతనిని మరణం నుండి కాపాడుతాడు.

2. మరణకరమైన పాపము చేయగా అట్టి వానిని గురించి వేడుకొనవలెనని నేను చెప్పటలేదు అంటున్నాడు. దాని అర్థం అది ఎంత విషమైనదో  మనం గమనించగలం.

 కాబట్టి మానవుడు చేసిన పాపములకు కొన్నిసార్లుఈ మరణం ,కొన్నిసార్లు జీవం అనుగ్రహించును.

హిజ్కియా  అహంకార దృష్టితోనున్న  వ్యక్తి. అయితే అతనిలో అహంకారం, గర్వం తొలగించడానికి దేవుడు యెషయా ప్రవక్తను అతని దగ్గరకు పంపించాడు. యెషయా అతనియొద్దకు వచ్చి నీవు మరణమగచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇది తీపి కబురు కానేకాదు. హృదయవిదారకంగా, దుఃఖవదనంతో నిండిపోయిన క్షణాలు. ఇక రెండు విషయాలు మనం గమనిస్తాం.

1 .మరణమగుచున్నావు: 2019లో ఈ ప్రశ్నతో దేవుడు మనలను సందిస్తున్నాడు. 2018లోనె చనిపోయేవారము. ప్రభువు తన కృప  చూపించి మనలను కాపాడాడు. ఆయన రెక్కల క్రింద భద్రపరచబడినాము. అయినా మనలోని పాపం వలన, ఆ పాపం మరణకరమైనది అయినప్పుడు నష్టాన్ని చేతులారా కొనితెచ్చుకుంటాం.పాపం వలన వచ్చు  జీతం మరణం జాగ్రత్త .పాపం జోలికి పోవద్దు, పాపంలో బ్రతుకవద్దు, పాపం లో జీవించ వద్దు. చేతులారా  నీ అంతట నీవే పాపం చేయకుండా నిన్ను నీవు పవిత్ర పరచుకుని జీవించుము.

2.నీ ఇల్లుచక్కబెట్టుకో:- 2018 సంవత్సరంలో నీ ఇల్లు ఎలాగుందో? నీ కుటుంబం ఎలాగుందో ?నీవు ఎలాగున్నావో?  అని ఎవరైనా అడిగితే ! నీవిచ్చే జవాబు ఏంటి? ఇల్లు చక్క పెట్టుకో అంటే దానర్థం ఏమనగా హృదయమనే యిల్లు చక్కపరచుకొని మరణాన్ని తప్పించుకొనుమని విలువైన సలహా మనం దేవుని ద్వారా వింటున్నాం. ఈ వార్త విని హిజ్కియా రాజు బెంబేలెత్తిపోయాడు, భయపడ్డాడు, నేనిక బ్రతకనమో  అని  అనుకున్నాడు.  ఎలాగు మరి అని ఆలోచించాడు.    చాలామంది వారి యిండ్లనే “హృదయమును” పట్టించుకోరు. అనేకమంది ఇంట్లో బాగుండవు,  ఒల్లు అసలే బాగుండదు. ఇంట్లో అపవిత్రత , ఒంట్లో అపవిత్రతను చూస్తాం. ఉదాహరణకు ఒక కుటుంబ యజమాని ఉదయం ఆఫీసుకు వెళుతూ అద్దం దగ్గరకు వెళ్లి దువ్వెన కొరకు వెతికితే ఎంత వెతికినా దొరకలేదు. సరేలే దొరకలేదని బాధతో వరండాకొచ్ఛి బూటువేసుకొనపోతుండగా ఆ బూటులో తన దువ్వెన దొరికింది. ఎంత బాధాకరం ఇతని ఇల్లు  ఎంత చక్కగా ఉందో చూశారా! మరి మన ఇల్లు ఎలాగుందో! నీ ఇల్లు బాగుండాలి, నీ హృదయం బాగుండాలి. కొందరిలో ఇండ్లకు వెళ్లినప్పుడు వారి ఇంటి నిండా వాక్యాలే ఉంటాయిగాని వారిలో యేసు ఉండడు. వాడి ఒంటిలో యేసు ఉండకపోతే వారి జీవితం  పాపం యొక్క  నిలయంమైయున్నది. ఎంత ఘోరం ఇంట్లో, ఒంట్లో  యేసు ఉంటే ఎంత బాగుగాఉండును. అందుకే నయమానుతో నీ ఒళ్ళు బాగై మరలా శుద్దుడవగుటకు  ఏడు మారులు యోర్దాను నదిలో మునగమని చెప్పగా విని చివరికి అంగీకరించి మునిగి స్వస్థత పొందెను. అలాగే మన జీవితంలో మీ శరీరంను శుద్ధి చేసుకోవాలి. ఆ తరువాత నీ ఇంటిని శుద్ధి చేసుకోవాలి.

మార్పు తెచ్చిన ప్రార్థన:- నీవు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త చెప్పిన వెంటనే మరొక ఆలోచన తనలో లేకుండా గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొని నేనిక ఎవరి వైపు చూడని దేవునికి మోరపెట్టెను.ఇతని ప్రార్ధనలో మారుమనస్సు, ఏడుపు , పశ్చాతాపం  చూస్తున్నాం .ఈ మూడు అను నిత్యం మన ప్రార్థనలో చూస్తున్నం. ఇంత భక్తిపరుడైనను తనలో పాపం ఉందని ఒప్పుకుంటున్నాడు. ప్రార్ధనలో తాను చేసిన ఘోరమైన పాపమును బయటికి తీస్తున్నాడు.చావు దగ్గరగా ఉండగా ఇంతకుముందు జీవించినట్లు ఇప్పుడు జీవించలేదు అంటున్నాడు. కావున ఎప్పుడైనా ,ఎక్కడైనా విశ్వాసిగా జీవించే నీవు నీ పాపమును  దాచి పెట్టుకోవద్దు ఒప్పుకోడానికి ప్రయత్నించు. యొబు 33: 12  ,సామెతలు 28: 12 .  హిజ్కియా దాచిపెట్టిన పాపం ఒప్పుకొని నిజాన్ని వెళ్ళవచ్చుండగా గత సంవత్సరాలలో ఏ రకమైన పాపం నీవు చేసి ఉంటే మార్పు చెందుము. పశ్చాత్తాపంతో ఏడుపుతో ప్రభువును క్షమాపణ కోరుదాం. హిజ్కియాను ఏ విధంగా క్షమించాడో అలాగే నిన్ను క్షమిస్తాడు. మన జీవితంలో మార్పు చెందడం అవసరం. గుర్తించావా? ఇంకా గుర్తించలేద! గుర్తించినట్లు నీవు గుర్తించి మార్పు చెందితే మంచిదే. సమయం ఉండగా నీ ఇంటిని చక్క పెట్టుకో. హిజ్కియాను  స్వస్థపరచి ఆయుష్షును పెంచిన దేవుడు నిన్ను కూడా దీవించగలడు.. అయితే దేవునికి అననుకూలంగా ప్రవర్తించక అనుకూలంగా ప్రవర్తించి అనుకూలమైన వాతావరణం నీవు కల్పించినప్పుడే దేవుని కార్యాలను అనుభవించగలవు. దేవుడు మిమ్మును దీవించును గాక.


Share this post