Skip to Content

క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకోవడమే క్రైస్తవ జీవిత గమ్యం

  • Author: Praveen Kumar G
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini

మనుష్యులు సాధారణంగా చేసే పొరపాటు ఏంటంటే “తాను ఏది సాధించాలి అని అనుకున్తున్నాడో దానిని మరచిపోవడం”. ఇది నిజం. ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాసంలో మనం గమనించ వచ్చు. ఇలా మరచి పోవడం మనకు మామూలే. ఎప్పుడు మనం మన జీవిత గమ్యం ఉద్దేశం ఏంటో, దాని కోసం ఎప్పుడు ప్రయాసపడుతూ ఉండాలి.

క్రైస్తవ గమ్యం ఏంటి? ఓ క్రైస్తవుని లక్ష్యం ఏంటి? ఓ క్రైస్తవుని గురి ఎప్పుడు క్రీస్తు వలె జీవించడం లేదా క్రీస్తును పోలి నడుచుకోవడమే. ప్రత్యేకంగా క్రైస్తవ్యం ఒక మతము కాదు గాని, ఒక అద్భుతమైన సంబంధం, అంటే అవధులు లేని ప్రేమా మూర్తి, సర్వశక్తిమంతుడు, పునరుర్దానునుడైన అ దేవాది దేవుడు యేసు క్రీస్తుతో సత్ సంబంధమే నిజమైన క్రైస్తవ్యం. మన గురి ఆ యేసు వలె జీవించడం మరియు యేసు తో జీవించడం.

పరిశుద్ధ గ్రంధంలో యోహాను సువార్త 17:3 ప్రకారం “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.” క్రైస్తవత్వం ప్రత్యేకంగా దేవునితో ఉన్న సంబంధం గురించి వివరిస్తుంది.

ఒక వ్యక్తిని మొదట కలిసినప్పుడే పరస్పర సంబంధం ఏర్పడి ఒకరినొకరు తెలిసుకోనగలుగుతారు. ఆ వ్యక్తితో పరిచయం చేసుకున్నప్పుడు ఇరువురు ఎవరు అన్న సంభాషణతో వ్యక్తిగతంగా తెలుసుకొనగలుగుతారు. కానీ అపో. పౌలు జీవింతంలో దేవునితో పరిచయం ప్రత్యేకంగా జరిగింది. పౌలు క్రైస్తవుడుగా మారాలి అని ఎప్పుడు ఉద్దేశించలేదు లేదా కనీసం క్రస్తావునిగా ఎలా జీవించాలో ఎవరిని అడిగి కూడా తెలుసుకోలేదు. వీటికి బిన్నంగా “సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించు టయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకుని యొద్దకు వెళ్లి యీ మార్గ మందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేము నకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతని చుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించు చున్న యేసును; లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.” (అపో 9:1-6). ఈ విధంగా పౌలు క్రీస్తును కలిసినట్లు గమనించగలం.

మన చుట్టూ ఉన్న దంపతులను కలిసి, మీరు ఏ విధంగా కలిసారు అంటే ఒక్కొక్కరు ఒక సంగతి చెప్పగలరు. కొంతమంది యుక్త వయసులో కలిసామనో, కొంతమంది యవనస్తులుగా ఉన్నప్పుడు కలిసామనో చెప్పగలరు. ఏది ఏమైనా ఒక నూతనమైన వ్యక్తిని మనం పరిచయం చేసుకున్నప్పుడు మన జీవితం ఒక ప్రత్యేకమైన దిశలో ప్రయాణం చేస్తుంది. అదే విధంగా క్రీస్తుతో పరిచయం కూడా మన జీవితంలో ఎన్నో నూతన మార్పులు చూడగలం. దేవునితో పరిచయం పౌలు వలె మన జీవితంలో లేనప్పటికీ. చిన్నప్పుడు దేవుని గురించి తెలుసుకోవడమూ, లేక దేవుని సంఘంలో తెలుసుకోవడమూ, లేక ఎవరి ద్వారానైన తెలుసుసుకున్నప్పుడో, లేదా కొన్ని అనుకోని కష్ట పరిస్థితుల్లో ఆ దేవుని వలన కనికరం పొందినప్పుడో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక విషయం మాత్రం మనం అర్ధం చేసుకోవచ్చు. ఆనాటి నుండి ఆ దేవునితో సంబంధం ఎలా ఉందో. ఒక వ్యక్తిని కలుసుకోకుండానే ఆ వ్యక్తీ గూర్చి తెలుసుకోవచ్చు, కాని ఆ వ్యక్తీతో కలిసి జీవించి సంపూర్ణంగా తెలుసుకుంటే, నిజమైన ప్రేమ మరియు గుణ గణాలు తెలుసుకొనగలం.

నిజమైన క్రైస్తవుని లక్షణం క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకొనడమే. ఆయన ఎవరు, ఎందుకు మానవతారిగా ఈ లోకానికి రావలిసి వచ్చింది? ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని బోధనలు ఉన్నాయి? ఎందుకు ఆయన కలువరి సిలువపై మరణించి పునరుర్దానుడయినాడు? ఇట్టి ప్రశ్నలకు క్షుణ్ణంగా సమాధానం తెలిసినప్పుడే సంపూర్ణంగా తెలుసుకున్నవారం గా ఉంటాం. మన పాపములను మనము ఒప్పుకున్నప్పుడే క్రీస్తుతో మొట్టమొదటి పరిచయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ పాపమే మనలను ఆ క్రీస్తునుండి దూరస్తులుగా చేసి, అదే ఒప్పుకోలు ఇప్పుడు ఆయనకు దగ్గర చేస్తుంది. పుణ్య కార్యాల ద్వారానో లేక కొన్ని మంచి పనులు చేస్తే దేవునికి దగ్గర అవ్వచ్చు అని మనం అనుకున్నప్పటికీ మన వ్యక్తిగత పాపములను మన నోటితో ఒప్పుకున్నప్పుడే దేవునితో సత్ సంబంధం ఏర్పడుతుంది. అంతేకాకుండా క్రీస్తు నా కొరకు, అనగా నా పాపములకోరకు చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మినప్పుడే ఆయనతో పరిచయం ఇంకా బలపడుతుంది.

ఒకే సారి అయిన పరిచయం పరస్పరంగా బలపడాలి అంటే అనుదినం కాస్త సమయమైన వెచ్చించాలి. మనకు బాగా నచ్చిన వ్యక్తితో ఎలా ఉంటామో అలానే క్రీస్తుతో కూడా ఉన్నప్పుడే ఒక వినూత్నమైన అనుభూతిని పొందగలుగుతాము. మన బిజీ ప్రపంచలో కాస్త సమయం దేవునితో ప్రార్ధనలో, బైబిలుని చదివే సమయం వెచ్చించి నప్పుడు నిజమైన క్రైస్తవ జీవితాన్ని పొందగలుగుతాము.

క్రీస్తును గూర్చి ఇతరుల ద్వారా తెలుసుకోవడం కన్నా వ్యక్తిగత అనుభవం చాల ప్రత్యేకమైనది. మన పాపములను మనము ఒప్పుకొనినప్పుడే, మన జీవితం పరిశుద్ధంగా మారుతుంది. అలా మన హృదయం మరియు జీవితం సరిగా ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు తనకు తాను బయలు పరచుకుంటాడు. ఇదే మనలో ఆయన యెడల కలిగే విశ్వాసం. దేవుని వాక్యం ద్వారా అట్టి విశ్వాసం మరింత బలపరచబడుతుంది. “పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములు గాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను”. (హెబ్రీ 11:13)

పరిశుద్ద గ్రంథంలో ని పాత నిబంధన భాగాలు క్రీస్తు యొక్క మొదటి రాకడను బయలు పరుస్తుంది, నూతన నిబంధన భాగాలు ఆయన జీవితాన్ని, మరణ పునరుర్ధారణములను, పరలోక రాజ్యమును గూర్చి మరియు రెండవ రాకడను గూర్చి తెలియజేస్తుంది. ఇట్టి దేవుని వాక్యాన్ని బహుగా ధ్యానించినప్పుడే మనలో విశ్వాసం బలపడుతుంది. కేవలం దేవుని వాక్యాన్ని చదవడమే కాకుండా అట్టి వాక్యాన్ని అనుసరణలో ఉంచినపుడే జీవితం ఒక అర్థవంతమైనది అని చెప్పగలం. “నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.” యోహాను 14:21. యేసు క్రీస్తు అంటే ఎవరో తెలుసు అనే వారు ఈ ప్రపంచంలో అనేకులు ఉన్నారు. కాని అ క్రీస్తు ఎవరో నాకు తెలుసు అనే మాట కంటే అతనితో సహవాసం కలిగిన అనుభవం ప్రత్యేకమైనది. అట్టి సహవాసం కలిగి దేవునితో నడిచిన అభువం మనమందరం పొందవలెనని నా అభిలాష. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.


Share this post