Skip to Content

క్రీస్తు కొరకు చేసే పని

24 July 2024 by
Sajeeva Vahini
  • Author: Dr G Praveen Kumar
  • Category: Bible Quiz
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

క్రీస్తు కొరకు చేసే పని.

నూతన నాయకత్వాన్ని నియమించడానికి ఎన్నుకోబడిన ఒక దైవ సేవకుడు తన పరిచర్యలో జత పనివారైన వారిని, వారి వారి సేవక-నాయకత్వ పాత్రలను గుర్తు చేయడానికి ఒక పని చేశాడు. ఆ సంఘంలోని నాయకులందరికీ గుర్తుండిపోయేలా వారి పాదాలను కడిగే కార్యక్రమంలో పాల్గొన్నారు. పాస్టర్ గారు మరియు నాయకులలో ప్రతి ఒక్కరు సంఘమంతా చూస్తూ ఉండగా ఒకరి పాదాలను మరొకరు కడిగారు. నేడు, ఆధునిక క్రైస్తవ సంఘాలలో ఇది లోపిస్తూ కనుమరుగైన కార్యక్రమాలు.

యోహాను సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడినట్టు వారు ఆ రోజున చేసింది, మనకొరకు యేసు క్రీస్తు ఒక మాదిరిగా చేసి చూపించారు. ప్రభురాత్రి భోజనంగా పిలువబడిన ఆ సంఘటనలో, యేసు క్రీస్తు “భోజనపంక్తిలోనుండి లేచి ... పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని యున్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను” (యోహాను 13:4-5) అని వ్రాయబడియున్నది. ఆ తరువాత తానెందుకు అలా చేశాడో యేసు తన శిష్యులకు వివరిస్తూ “ దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని“(యోహాను 13:16)... “నేను మీ మధ్య పరిచర్య చేయు వానివలె ఉన్నాను”. (లూకా 22:27) అని అన్నారు.

దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు, శిష్యుల పాదాలు కడగడమంత తక్కువ పని చెయ్యటం ఆయన ప్రతిష్టకు తక్కువైనది కాకపొతే, మనం ఇతరులకు సేవ చెయ్యటంలో తక్కువ పని కాదు అని గ్రహించాలి. వాస్తవంగా, మనందరి యెదుట ఎంత అద్భుతమైన మాదిరిని ఉంచాడాయన. నిజముగా ఆయన, “... పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు...” (మార్కు 10:45) వచ్చాడు. ఒకనాయకుడిగా మరియు ఒక దాసునిగా ఉండడం అంటే ఏమిటో మాదిరిగా చూపించాడాయన. ఎవరైతే ఇట్టి మాదిరిని అనుసరిస్తారో వారే ఆయన సేవకులు. ఒక్క విషయం జ్ఞాపకముంచుకుందాం “క్రీస్తు కొరకు చేసిన ఏపనైనా అది చిన్నది కాదు”. ఆమెన్.


Share this post