Skip to Content

ఈ జీవితానికి 4 ప్రశ్నలు

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Praveen Kumar G
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini Volume 2 Issue 3 Feb-Mar 2012

ఈ లోకంలో జీవము కలిగినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాడు మానవుడే. ఈ జ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందింది. అనాది కాలం నుండి ఈ 21వ శతాబ్దపు మానవుని జీవనా విధానంలొ ఆధునికతకు అవధులు లేని ఎన్నో మార్పులు. సామాజిక సామాన్య తత్వ శాస్త్రాలలొ మానవుని జ్ఞానం అంతా ఇంతా కాదు. ఈ విజ్ఞాన తత్వశాస్త్రం బాగా తెలిసి తనను ఎవరు సృష్టించారో కూడా తెలుసుకోలేనంత స్థితి. మానవుడు ఓ రసాయనిక చర్య అని, సూక్ష్మ కణం నుండి ఉద్భవించాడు అని ఎన్నో వాదనలు. లేదండి, మానవుడు దేవుని స్వరూపంలో, పోలికలో మంటితో చేయబడ్డాడు; వాని నాసికారంద్రములొ జీవ వాయువు ఊదగా నరుడు జీవాత్మాయెను అని పరిశుద్ధ గ్రంధమైన బైబిల్ చెబుతుంది అంటే, కాదు అసలు దేవుడే లేడు అని వాదించే నాస్తికులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని అలా పక్కన పెడితే అందరు నమ్మేది మాత్రం జీవము అనేది ఉంది అని మాత్రం చెప్పగలం.

ఈ లోకములో జీవము అనే మాటకు నాలుగు ప్రశ్నలు కలవు. దాని మూలము అర్ధం నైతికత గమ్యం ఏంటి ?. జీవము అనేది ఉంది అని నమ్ముతే ఈ నాలుగు ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఉండ వలసినదే. మన జీవితం ఎక్కడనుండి ఆరంభమైనది, ఎందుకు మనము జీవిస్తున్నాము అంటే అర్ధవంతమైన జీవితము జీవిస్తున్నామా మన జీవిన నైతిక విలువలు ఏంటి మరియు ఈ జీవితానికి అంతం ఏంటి అనే ఈ నాలుగు ప్రశ్నలను మనము వ్యక్తిగతంగా వేసుకోవాలి. వీటన్నింటికీ సమాధానం మీ వద్ద ఉంటే దేవుడు ఉన్నాడు అని మీరు విశ్వసించినట్లే. ఓ సూక్ష్మకణం నుండి ఆవిర్భవించినది ఈ జీవితము అని మీ సమాధానం అయితే ఆ అణువు యొక్క మూలము కూడా చెప్పాలి మరి. ఏ వాదనయైనా తార్కికంగా నిలకడగా ఉండాలి, తగినంత అర్ధవంతంగా ఉండాలి, ఉన్నది అని ఉనికి చాటాలి. అట్టి నాస్తిక వాదన ఈ జీవితానికి మూలం మరియు అంతం ఏంటో రుజువు చేయలేకపోయింది. వీటన్నిటికి కర్త ఎవరైనా ఉంటే అతడు ఆది అంతము లేని వాడై, ఈ జీవము పై సార్వభౌమాధికారము కలిగి యుండాలి. అట్టి ఉద్దేశమునకు అర్ధమిచ్చునది “దేవుడు” అను పదమే. యుగయుగములు జీవించువాడైన దేవునికి మరము పై విజయము కూడా కలదు అనుట సరియైనదే.

ఇట్టి నమ్మకము లేదా విశ్వాసము అర్ధవంతమైన నైతిక జీవితానికి నాంది. వీటిలో క్రైస్తవ విశ్వాసం గొప్పది. ఎందుకంటే ఓ మానవాతీతమైన మూలకం ఆవిర్భవించబోతుంది, ఆయన యేసు క్రీస్తుగా జన్మించి, మరణించి, పునరుర్ధానమావుతాడు అని కొన్ని శతాబ్దాల కాలం నుండి ప్రవచించబడింది. మరణపు ముల్లును విరువ గలిగిన శక్తిమంతుడైన క్రీస్తు పై విశ్వాసమే నిత్యమూ జీవిస్తాము అనే దృఢ నిశ్చయత కలుగ జేస్తుంది. ఒక వేళ క్రీస్తు శరీరము ఆ సమాధిలో ఇంకా ఉంటే క్రైస్తవ్యత్వం ఎప్పుడో కనుమరుగై పోయేది. నిజంగా క్రీస్తు మరణించి, మర్త్యమైన శరీరం అమర్త్యతలోనికి రూపాంతరము పొంది పరలోకానికి ఎత్తబడ్డాడు కాబట్టే మన విశ్వాసం సత్యమైనది బహుగా బలపడింది.

దాదాపు 1500 ఏండ్లు బైబిల్ వ్రాయబడింది. ఈ గ్రంధంలొ రుజువు చేయబడనివి కలవు అని రెండు వేల సంవత్సరాలు చేసిన పరిశోధనా విఫలమైంది. ఎందుకంటే ప్రాచీన దినములలో నిజముగా జరిగిన వాటినే సమకూర్చి లిఖితము చేసారు కాబట్టే ఎట్టి వాదనలైన ఈ చరిత్ర ముందు నిలబడలేకపోయాయి.

నిజంగా దేవుడున్నాడా? ఉంటే నాకు ఎందుకు కనబడుటలేదు? అంటూ మనకు మనమే ఓ ప్రశ్న వేసుకొని మనకు తగిన రీతిలో ఈ పని జరగాలి, దేవుడు నాకు ఇక్కడ ఇప్పుడే కనబడాలి అని ఉద్దేశాలు మనకు ఎన్నో. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి, పై తెలుపబడిన ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం మీ వద్ద ఉంటే క్రీస్తును గూర్చి క్షుణ్ణంగా తెలుసుకొనుటకు ప్రయత్నించండి. పరిశుద్ధ గ్రంధంలో ఉన్న సువార్తలే వాటికి ఆధారం. విశ్వాసంతో, తెరువబడిన హృదయంతో చదివి గ్రహించినట్లయితే అట్టి నమ్మకం వృధాకానేరదు. అట్టి అర్ధవంతమైన జీవితం జీవించడానికి సహాయపడుతుంది.

ఎవరైనా తప్పు చెస్తే తగిన ఫలితం పొందుతారు అని నమ్ముతాము. యెట్టి మతమైన బోధించేది ఇదే. ఒకవేళ ఒకడు దొంగతనం చేస్తే అతడు కూడా ఏదో ఒక రోజు దోచుకొనబడుతాడు అని, అన్యాయం చెస్తే ఆ అన్యాయము అతనికి కూడా ఏదో ఓ రోజు వెంటాడుతుంది అని నమ్ముతాము. కాని కలువారి సిలువలో క్రీస్తుపై వేసిన సర్వలోక పాపము మాత్రం తిరిగి రాలేకపోయింది. అట్టి క్రీస్తు ప్రేమ “వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” బదులు చెప్పిన ప్రేమయే. అట్టి ప్రేమను రుచి చూడకుండా ఉండగలమా? అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించునప్పుడు, అతని విశ్వాసాన్ని ఆశీర్వదించి కుమారునికి మారుగా దేవుడు గొఱ్ఱెపిల్లను ఇచ్చాడు. పాప పంకిలమైన మనము ప్రాయశ్చిత్తముగా మన కుమారులను కుమార్తెలను అనుగ్రహించకుండా మనకు బదులుగా మన పరలోకపు తండ్రి తన కుమారుని మనకు అనుగ్రహించాడు. అతడు మరణమును తప్పించి నిత్యమూ తనతో ఉంటాము అనే కృప ద్వారా నిశ్చయత మరియు ఉచితముగా రక్షణానుభవమును మనకు అనుగ్రహించాడు. ఇట్టి నైతిక విలువలు కలిగి జీవించుటకు ఈ ఉదాహరణను గమనిచండి.

ఓ ఎడారిలో ఓ వ్యక్తి ప్రయాణం చేస్తూ, అతని సీసాలో కలిగిన నీళ్ళు అయిపోయినపుడు, నీళ్ళు ఎక్కడైనా దొరుకునేమో అని వెతకడం ప్రారంభించాడు. కొద్ది సేపటికి ఓ నీటి పంపు కనబడింది. పరుగెత్తి ఆ నీటి పంపు చేతి పిడిని పైకి క్రిందకు ఆడించడం ప్రారంభించాడు. ఎంతసేపటికీ నీళ్ళు రాకపోయేసరికి అక్కడ వ్రాసియున్న కొన్ని సూచనలను గమనించాడు. అవేవనగా ఈ నీటి పంపు క్రింద ఓ పెద్ద నీళ్ళ సీసా ఉంది ఆ నీళ్ళను ఈ పంపులో పోసి మరలా ఆడిస్తే త్రాగినన్ని నీళ్ళు ఇస్తుంది చివరిగా వెళ్లేముందు మరలా ఆ సీసాను నింపి అక్కడ పెట్టి వెళ్ళండి ఈ మార్గంలో వెళ్ళే వారికి కూడా ఉపయోగపడుతుంది అని వ్రాసియుంది. నిజంగా బహు దాహంగా ఉన్న అతడు ఈ నీళ్ళు అందులో పోసినట్లయితే మరలా నీళ్ళు రాకపోతే అనే సందేహం ఉన్నట్లయితే కేవలం అతడు మాత్రమే దప్పికను తీర్చుకున్న వాడవుతాడు. కాని సూచనల ప్రకారం చేసినట్లయితే ఇతరులకు కూడా దప్పిక తీర్చుటకు కారకుడవుతాడు. క్రీస్తే ఈ నీటి బుగ్గ, సజీవమైన నీళ్ళు. మనము మన తరువాత వారు కూడా ఇట్టి ధన్యత పొందాలి అంటే ముందు మనలను మనము ఖాళీ చేసుకొని తన చేతుల్లోకి సమర్పించువాలి. అప్పుడే జీవితం ఓ నైతికమైనదై యుంటుంది మరియు మనము ప్రయాణించే ఈ జీవితము కూడా అర్ధవంతమైనదై తరువాత వారికి మార్గదర్శిణిగా యుంటుంది.

అట్టి నిదర్శనమైన జీవితాన్ని జీవించే కృప ప్రభువు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.


Share this post