Skip to Content

హతసాక్షులు అంటే ఎవరు ?

5 July 2024 by
Sajeeva Vahini
  • Author: Praveen Kumar G
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini Aug - Sep 2011 Vol 1 - Issue 6

ఎవరనగా తన మతమునకై, స్వధర్మ రక్షణకై అనేక హింసలు పొంది, రాళ్ళతో కొట్టబడి, కాల్చబడి తమ శరీరమును ప్రాణమును సహితం లెక్క చేయకుండా ప్రాణము నిచ్చిన వారు. అయితే వీరు మతానికై చావడము, మత ద్వేషమువల్ల అన్యమతస్థులచేత చంపబడడము లేక స్వమతార్థ ప్రాణత్యాగము చేసేవారు. అసలు వీరు ఎలా ఉంటారు ? వీరు ఎక్కడ జన్మిస్తారు? వారి హృదయస్పందన ఎలా వుంటుంది ? ఎందుకు వీరికి అంత భగవత్భక్తి ? వంటి ప్రశ్నలు మనందరికి కలుగవచ్చు వీటికి సమాధానం బైబిలులోనే. బాబోయ్ పులి! బాబోయ్ పులి !మనందరికీ తెలిసిన కథే. ఆ కథ సారాంశం ఇంకా గుర్తుంది కదూ. అసలు అబద్ధం ఆడితే నమ్ముతారో లేదో అని ఎదుటి వారిని పరీక్షించి, చివరకు విసిగిన జనం నిజం చెప్పినా నమ్మలేదు. అయితే ఆ కథలో ఆ పిల్లవాడు ఎందుకు అబద్ధం చెప్పాడు? అతనికి వచ్చిన లాభం ఏంటి ? అని ఒక్కసారి ఆలోచిస్తే నష్టపోయాడు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. నిజంగా ఎవరైనా మనవల్ల విసుగు చెందినప్పుడు మనం నిజం చెప్పినా నమ్మరు. అనేక మంది కొన్ని మంచి కారణాలకు అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు. సరే అబద్ధం మంచి కోసం ఆడతారో లేదో తెలియదు కాని ఎవరు కూడా అబద్ధం కోసం ప్రాణం పోగొట్టుకోరు అది అబద్ధం అని తెలిసినా కూడా. నిజమే కదా! అవును ప్రియ చదువరీ! ఈ లోకంలో అనేకులు అబద్ధం కోసం చనిపోయారు, కాని వారు ఒక సత్యం కొరకు ప్రాణం త్యాగం చేసాము అని తమ్మును తామే మోసం చేసుకున్నారు. వీరు కాదండి హతసాక్షులు. వాస్తవం ఏంటంటే అపోస్తలులు గానీ యేసు ప్రభువు శిష్యులు గానీ హతము చేయబడి, రాళ్ళతో కొట్టబడి, హింసించబడి హతసాక్షులుగా ఎందుకు అయ్యారు అంటే వారు సత్యరూపియైన క్రీస్తు యొక్క సిలువ శ్రమ మరణ పునరుద్ధానం గూర్చిన జ్ఞానం కలిగినవారు.

అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో ఏడుగురు ప్రత్యేకముగా పిలువబడి ఆత్మీయ బోధనలకు ఎన్నుకొనబడకుండా ఆహారము పంచి పెట్టుటకు నియమింపబడిరి. వీరు స్తెఫనుఫిలిప్పుప్రొకొరునీకానోరుతీమోనుపర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడునగు నీకొలాసు అనువారు.ఆహారము పంచి పెట్టుటకువారికి కావలసిన అర్హతలు, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన వారు. అయితే ఆహారము పంచి పెట్టుటకు ఇట్టి అర్హతలు కావలెనా? ఆలాగని కాదు కాని ప్రభువు నిర్ణయించిన పని అది ఏదైనను దానియందు పని చేయుటకు ఇట్టి అర్హతలు అవసరము. యుద్ధమునకు వెళ్ళే సైనికులు ఎంత ప్రాముఖ్యమో సామాను వద్ద కాపలాదారులకు కూడా అంతే ప్రాముఖ్యత. ఇట్టి అర్హతలు గలిగిన వీరిలో ఒకడైన స్తెఫెను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచు ఉండెను. స్తెఫెను మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను చూచిన వారు అతనిని ఎదిరింపలేక అబద్ధసాక్ష్యములు పలికి సమాజములోనికి తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. అతడు గట్టిగా పట్టుకున్న సత్యము కొరకు, తనపై ఉన్నఅబద్ధ సాక్ష్యమునకైనా ప్రాణమును సహితం లెక్కచేయకుండా బైబిలు గ్రంథంలో మొట్టమొదటి హతసాక్షిగా మారాడు. క్రైస్తవ హతసాక్షులు అంటే స్వల్పమైన విషయం కాదు పరిశుద్ధాత్మతోను జ్ఞానముతోను నిండుకొని అబద్ధమునకు తలవంచని వారు. ఏదో కొద్దిపాటి భక్తి గలిగి, కొద్దిపాటి జ్ఞానం గలిగి, కొద్దిపాటి రక్షణ అనుభవం గలిగి నేను క్రీస్తు కోసం ఏదైనా చేస్తాను ? మరణించడానికైనా సిద్ధమే ? అంటూ ఒట్టి తీర్మానాలు తీసుకుంటాము. ప్రియ స్నేహితులారా మనందరము క్రీస్తు కొరకు చనిపోవాలని సృష్టింపబడలేదు కాని క్రీస్తు కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అనే ధృఢ నిశ్చయత కావాలి, పరలోకంలో అట్టివారికే ప్రవేశం. నిజ జీవితంలో ఒకవేళ ఇటువంటి స్థితి మనకూ సంభవిస్తే ? ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందాం.

ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షి “సెయింట్ అల్బాన్”. రోమీయుడైన ఈ వ్యక్తి “వెరులామీమ్” అనే ప్రాంతంలో నివసిస్తూ ఒక క్రైస్తవ బోధకునికి తన గృహంలో నివాసాన్ని ఇచ్చి తరువాత క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించాడు. ఇది తెలుసుకున్న రోమా సామ్రాజ్యంవారు తమ దేవతలను ఆరాధించని ఇతని కను గ్రుడ్డులను తీసి హింసించి హతమార్చారు. అయితే “వెరులామీమ్” అనే పట్టణం అభివృద్ది చెంది ఈరోజు “సెయింట్ అల్బాన్” గా మార్చబడి అనేకులు తమ ప్రాణములను సహితం లెక్కచేయకుండా క్రైస్తవులుగా మార్చబడ్డారు అనే సంగతి చరిత్రలో వాస్తవం.మొదటి శతాబ్ధకాలంలో క్రీస్తు ఆరోహణమైన తరువాత సువార్త నిమిత్తం ఎన్నుకొన్న శిష్యులు సహితం హతమార్చబడ్డారు. వీరు స్తెఫెను, జెబెదయి కుమారుడైన యాకోబుఫిలిప్పుమత్తయి, ఆంద్రేయ, మార్కుపేతురు, అపో. పౌలు, సువార్తికుడైన యూదా, బర్తలోమయి, తోమాలూకాసీమోను మరియు పత్మాసులో యోహాను అను వారు హతసాక్షులైరి. భారతదేశంలో తోమా క్రీస్తు సువార్త విషయమై హతసాక్షి అయ్యాడు. ఈ దినాలలో గ్రహం స్టెయిన్స్ ఇంకా ఎందరో క్రీస్తు సువార్త నిమిత్తం తమ జీవితాలను లెక్కజేయలేదు.

క్రైస్తవ హతసాక్షులకు ప్రత్యేకమైన చోటు పరలోక రాజ్యంలో నిర్ణయించబడింది.దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద కనబడుట ప్రకటన 6:9-11 లో గమనించగలం. ఎంత ధన్యత. 11 లో గమనించినట్లయితే “మరియు--వారివలెనే చంపబడబోవువారి సహదాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ... ” అనగా మనలో ఎవరైనా క్రీస్తు కొరకు హతసాక్షులుగా ఉండువారు మరియు ఇంకా చంపబడబోవువారు ముందుగానే నిర్ణయించబడినట్టు గమనించగలం. పరలోక తండ్రి చిత్తంలేనిదే ఈ లోకం లో మనకు శ్రమ కలుగదు, క్రీస్తును గూర్చిన శ్రమ, సువార్తను గూర్చిన శ్రమ లేదా క్రైస్తవత్వం వలన శ్రమ, ఇట్టి శ్రమలలో ఏదైనా నిజముగా నీకు కలిగినప్పుడు దానిని స్వీకరించడానికి ప్రయత్నిద్దాం. .శ్రమ కలుగుట నాకు మేలాయెను అని అపో. పౌలు చెప్పిన రీతిగా శ్రమను అనుభవించుట వలన విశ్వాసంలో ఇంకా బలపరచబడగలం ఆత్మీయ జీవితంలో పడిపోకుండా సాగగలం. క్రైస్తవులం అని చెప్పుకుంటే సమాజం నవ్వుతుంది, శ్రమరాళ్ళు రువ్వుతుంది, ఉద్యోగాలు రావు, పెళ్ళిళ్ళు కావు అని నీవనుకుంటే యేసు క్రీస్తు ప్రభువును కలిగియున్నాను అని భ్రమ పడుతున్నావు. “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును ... మనుష్యులు మీ సత్ క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి” మత్తయి (5:11,12,6) అని వ్రాయబడిన రీతిగా నిజమైన విశ్వాసిగా, పరిపూర్ణమైన క్రైస్తవునిగా జీవించుటకు ప్రయత్నిద్దాం. అట్టి కృప పభువు మనందరికి దయచేయును గాక. ఆమెన్.


Share this post