- Author: Dr G Praveen Kumar
- Category: Articles
- Reference: Sajeeva Vahini - Daily Inspiration
Pray for India.
స్వతంత్ర పోరాటాల మధ్య నలిగిపోయిన ఎందరో సమరయోధుల ప్రాణాలు, తమ దేశపు మట్టితో కలిసిపోయిన త్యాగాలే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వతంత్ర భారతదేశం. ఎందరో గొప్ప నాయకులు! మన దేశ భవిష్యత్తు కోసం వారు కన్న కలలు, మాతృ భూమి పై మక్కువతో వారు రాల్చిన స్వేదరక్త బిందువులే ఈనాడు ప్రపంచ పటంలో ఒక ఆధునిక దేశంగా ఎదిగాము. మన దేశ, సామాజిక మరియు ఆర్ధిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ పద్ధతులను గట్టిగా పట్టుకున్న మన సంకల్పమే ఈ గణతంత్ర మంత్రం.
స్వతంత్ర సమన్వయంలో, రాజ్యాంగాన్ని క్రోడీకరించుకుంటున్న సందర్భాల మధ్య, ఆనాటి నిరంతర శ్రామికుల కష్టమంతా - సమానత్వం మరియు న్యాయం కోసం వారి తపనే. వారి విజయమే ఈనాడు, మనం నిర్మించుకున్న రాజ్యాంగ పునాదుల మీద రెప రెప లాడుతూ ఎగిరిన మువ్వన్నెల జెండా సమానత్వాన్ని సౌభాతృత్వాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ – స్వతంత్ర భారతావనికి సంపూర్ణ స్వేచ్చను ప్రకటించి పునర్నిర్మాణంలో అనేక అడ్డంకులను చేధించగలమనే గొప్ప నమ్మకాన్ని కలుగజేసింది మన భారత దేశ గణతంత్త్రం.
నవ సమాజంలో మహమ్మారి ప్రవేశించి ఎన్ని కృత్రిమ విభజనాలు సృష్టించినా జీవన విధానాల్లో ఎన్నో మార్పులు కలిగినా, సామాజిక దూరమనే కొత్త నిర్వచనం మన ఐక్యమత్యాన్ని చేధించలేక పోయింది. భారత దేశపు ప్రజాస్వామ్య విలువలు ఇకమత్యంలో మనల్ని మించిన వారు లేరని గర్వంగా చెప్పుకునేలా నిరూపించింది. మనల్ని మరింత దగ్గర చేస్తూ, సమానత్వం లో మనమంతా ఒక్కటే అని జ్ఞాపకం చేసింది. మనిషి నిర్మించుకుంటున్న పరిధుల్ని ఉల్లంఘించేలా సరికొత్త రూపావళి మార్పు కోసం నవ భారత దేశం నూతన మార్గాలను తెరుచుకోడానికి ముందడుగు వేస్తూనే ఉంది.
సామాజిక జీవన విధానంలో ఎన్ని స్వాతంత్రాలు వచ్చినా గణతంత్రాలు వచ్చినా మనిషిని భయం అనేది ఎప్పుడూ పట్టిపీడిస్తూనే వుంది. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము! ఎందుకంటే, యెహోవా గొప్పకార్యములు చేస్తాడనే (యోవేలు 2:21) వాగ్దానం మనకుంది. ఈనాడు మనం విశ్వసిస్తేనే రాబోయే తరానికి నూతన అధ్యాయాన్ని నేర్పించే వారమవుతాము. మనందరి మంచి భవిష్యత్తు కోసం మన ప్రవర్తనలో ఈ అనుభవాన్ని మరింత బలపరుద్దాం… గణతంత్ర దినోత్సవ ఆనందాన్ని అనుభవిద్దాం. మన దేశంకోసం ప్రార్ధన చేద్దాం.
Pray for India. Happy Republic Day.