- Author: Dr G Praveen Kumar
- Category: Articles
- Reference: Sajeeva Vahini - End of Days
ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి?
సంఘము ఎత్తబడడం అనేది ఈ సృష్టిలోనే అత్యంత అద్భుత ఘట్టం, సృష్టి వినాశనానికి తొలిమెట్టు కూడా అదే. ఎందుకంటే, అప్పటి నుండే ఏడేండ్ల శ్రమల కాలము ప్రారంభము అవుతుంది అని బైబిలు ప్రవచనాలు చెబుతున్నాయి. మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసే ఈ ప్రవచనాత్మక అంశము యొక్క ప్రాముఖ్యతను, మన వ్యక్తిత్వంపై దాని ప్రభావమునూ మరియు ఆచరణాత్మకతను గూర్చిన సంగతులను క్లుప్తంగా అధ్యయనం చేద్దాం.
ఒకానొక దినమున మనము మధ్యాకాశమునకు ఎత్తబడతాము అంటే అది ఆశ్చర్యమే కదూ!!. అయితే ఎత్తబడే ప్రక్రియ ఎలా సంభవిస్తుందనే మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అపో. పౌలు ద్వారా కొరింథీ మరియు థెస్సలోనికయ సంఘాల పత్రికలలో వివరిస్తూ, మనలను సిద్దపాటు కలిగియుండమని హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే క్రీస్తుయేసు నందుండి మరణిస్తారో వారు కడబూర మ్రోగగానే సమాధులు తెరవబడి అక్షయులుగా లేపబడతారు, ఆమీదట సజీవులుగా వున్నవారమైతే మార్పుపొంది మహిమ శరీరులముగా మార్చబడతారు. ఆమీదట మధ్యాకాశములో మేఘారూడుడైన ప్రభువును ఎదుర్కొంటాము. ఇదంతా రెప్పపాటులోనే జరిగిపోతుంది. ఇదే సంఘము ఎత్తబడుట.
సంఘము ఎత్తబడినది అంటే సంఘము ఇక భూమి మీద వుండదు అని గ్రహించాలి. వాక్యముతో వుదకస్నానముచేత పరిశుద్ధ పరచబడిన నిష్కళంకమైనట్టిదియూ నిర్దోషమైనట్టిదియూనైన సార్వత్రిక సంఘము ఆ రీతిగా భూలోకమునుండి ఎత్తబడిన తరువాత, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను విప్పుతారు. విడువబడిన వారికి మూడున్నర యేండ్లు శ్రమల కాలము మరియు మూడున్నర యేండ్లు మహాశ్రమల కాలము వుంటాయి. ఏడేండ్ల శ్రమలకాలము ముగియగానే తన స్వరక్తమిచ్చి కొనబడిన పరిశుద్ధుల పరివారముతో క్రీస్తు దిగివస్తాడు. ఇదే రెండవ రాకడ. ఈ లోక రాజ్యములన్నియూ ఒక రాజ్యమై, మన ప్రభువు రాజ్యమై, క్రీస్తు రాజ్యమై రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా తన రాజ్యాన్ని ఈ భూమిమీద స్థాపించి, వెయ్యియేండ్లు పరిపాలిస్తారు.
క్రీస్తు మరణ భూస్థాపన, పునరుత్థానములను, విశ్వసించి, ఎత్తబడిన పరిశుద్దులకు అలాగే ఆయన నామము నిమిత్తము హతసాక్ష్యులైన వారికందరికీ అర్హతలను బట్టి ప్రత్యేక స్థలములలో వుంచబడతారు. వారు మహిమ కిరీటములు పొందుతారు. ఈ లోకంలో ఎంతకాలము జీవించినా ఒకనాడు మరణించాల్సిందే. శరీరము మరణించి శిధిలమై పోతుంది కాని ఆత్మకు మరణం లేదు. మనిషికి మరణం ఒక రూపాంతర ప్రక్రియ మాత్రమే. అంతిమ తీర్పు అనంతరము నిత్యత్వములోనికి వెళ్లిపోతాము, అప్పుడు దృశ్యమైన ప్రతిదీ లయమై పోతుంది, ఆత్మలు పరిశుద్దాత్మునిలో అంతర్లీనమై అంతములేని, ఆకలి దప్పులు లేని ఆ అమరత్వములో మహిమాన్వితునితో విలీనమౌతాయి. ప్రియ క్రైస్తవ నేస్తం, ఎత్తబడుటకు నీవు ఆయత్తమా ? లేని యెడల విడువబడతావు. ఎత్తబదుట మహిమాన్వితం, విడువబడుట బహు ఘోరం.