Skip to Content

చిలుక పాట

  • Author: Sreekanth Kola
  • Category: Articles
  • Reference: Best of Collections

ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలక వుంది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలోపడతాయేమోనని భయపడి, ఒకరోజు రెపరేపా రెక్కలుకొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి పిల్లలారా.., రండి మీకొక మంచి పాట నేర్పిస్తాను. అంది. సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు, వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! గింజలు విసురుతాడు జాగ్రత్త..! వలవేస్తాడు జాగ్రత్త..! పట్టుకుంటాడు జాగ్రత్త..! మెడ విరుస్తాడు జాగ్రత్త.. ! అనే పాటనేర్పింది.

అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్యా..! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు. అనుకొని వేటకొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక.

ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టుచాటున నక్కి పోనీ గింజలు విసిరిచూద్దాం.. అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త..! అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడవిరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు...స్తా......డు........ అంటూనే చచ్చిపోయాయి.

అయ్యో... ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని గ్రహించుకోలేదు. నేడు మనలో అనేకులు చక్కని క్రైస్తవపాటలు పాడుతున్నాము. దేవుని వాక్యం నేర్చుకుని చక్కని ప్రసంగాలు చేస్తున్నామే కాని, క్రీస్తుకి నిజంగా మన హృదయాల్లో చోటును ఇచ్చి ఆయన మాటల్లోని సత్యాన్ని గ్రహించి, దానిని మన జీవితాలకు అన్వయించుకుని జీవించుటలేదు.

అందుకే ప్రభువు అంటున్నారు. మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. - (Amos ఆమోసు 5:23)

అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. - (John యోహాను 4 :23,24)

మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. - (Galatians గలతియులకు 5:25)


Share this post