Skip to Content

ఔదార్యము

5 July 2024 by
Sajeeva Vahini
    • Author: Praveen Kumar G
    • Category: Articles
    • Reference: Sajeeva Vahini Feb - Mar 2011 Vol 1 - Issue 3

    మనకనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి. రోమా 12:6-10

    మనలో ప్రతీ ఒక్కరికి ఇతరులకు సహాయం చేసే గుణం తప్పకుండా ఉంటుంది. కష్టాల్లో ఉన్నవారికి సహాయం, దాతృత్వం సహాయపడడం, సహోదరుని పట్ల జాలి, పరిచర్యలో మనవంతు కృషి. అయితే మన పిల్లలతో, భార్యతో, తలిదండ్రులతో నిష్కపటంగా మన సమయాన్ని వెచ్చిస్తుంటాము. అయినా ఇతరులకు సహాయం చేయాలి అనే విషయంలో ఒక వృత్తివలే ఎంచుకుని నమ్మకత్వం చూపిస్తాం. అయితే ఎంత మనం ఇతరులకు సహాయం చేస్తామో అంత మనం కోల్పోతూ ఉంటాం, కాని, దాని వ్యతిరేకతే సత్యం. అవును! ధనము, సంపద, శక్తి, పరపతి లో లేనిది ఇతరులకు సహాయం చేయడంలో మన జీవితంలో అర్ధవంతంగా సాధించాము అనే తృప్తిని కలుగజేస్తుంది.

    యేసు ప్రభువు లూకా 6:38లో ఈ విధంగా అన్నారు “క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును” అని చెప్పెను. ఆపదలో లేదా కష్టాలలో ఉన్నవారికి సహాయం చేయడం బైబిలు గ్రంధంలో మరియు యేసు క్రీస్తు తాను చేసిన పరిచర్య లో ప్రాముఖ్యంగా తెలుపబడిన విషయం. అయితే పదమూడవ శతాబ్ద కాలం నాటి హెబ్రీ న్యాయశాస్త్రంలో కూడా పేదల పట్ల అనుకూలత గురించి లేవీ 19:9-10లో ఈ విధంగా వ్రాయబడింది “మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చు-కొనకూడదు; నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను”.

    పరిచర్య ద్వారా, ఇతరుల లోటును తీర్చ గలుగుతాం, అప్పుడే మన జీవితం పరిపూర్ణంగా అర్ధవంతంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు మనం గమనించవచ్చు: తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు. సామెతలు 14:21.

    ఆశించినదానిని ఆకలిగొనినవాని-కిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు యెష 58:10-11. ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతని యెడల ఎంత మాత్రమును కనికరము చూపనివాని యందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? (1 యోహాను 3:17)

    ఈ విధంగా బైబిల్ లో అనేక విషయాల్లో ఔదార్యం కలిగి యుండాలి అనే తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఔదార్యత్వాన్ని కలిగి ఇతరులతో పంచుకుంటామో అప్పుడే మంచి కార్యములు మన యెడల కూడా జరుగుతుంటాయి. బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును (సామెతలు 28:27). ఎప్పుడూ ఏదో ఒక గొప్ప పరోపకారి లేదా పెద్ద సంఘ సేవకుడు కావలసిన అవసరం లేదు కాని మనకు ఉన్నంతలో, మనము చేయగలిగినంతలో చేస్తే అది లాభదాయకం. ఇలాంటి ఔదార్య జీవితం కలిగి జీవించడానికి అందరం ప్రయత్నిద్దాం.


Share this post