Skip to Content

యేసుని శిష్యుడను

  • Author: Harsha Samrat
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Aug - Sep 2011 Vol 1 - Issue 6

ఈ లోకములో పుట్టిన ప్రతి మనుషుడికి జ్ఞానము కలిగి వివేకముతో తెలివితో జీవించాలని ఉంటుంది, మరి జ్ఞానము ఎక్కడ నుంచి లభిస్తుంది?

మనము చిన్నపటి నుంచి జ్ఞానము సంపాదించటానికి ఒక గురువు/బోధకుడిని ఎంచుకొని అతని దగ్గర శిష్యునిగా చేరి అతని దగ్గర ఉన్న జ్ఞానమును నేర్చుకుంటాము. మరి ఆ బోధకునికి తన దగ్గరగల జ్ఞానము ఎక్కడ నుంచి లభించింది? అది సంపూర్ణ జ్ఞానమా? ఆ బోధకుని శిష్యునిగా మనము నేర్చుకున్నది ఏమిటి, దాని వలన మనకు కలిగిన వివేకము ఎటువంటిది?

యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును (సామెతలు 2:6). పరిశుద్ధ గ్రంధములో చెప్పిన ప్రకారము అబ్రహాము దేవుడుఇస్సాకు దేవుడుయాకోబు దేవుడైన యెహోవాయే జ్ఞానమునకు మూలము. కేవలము తన మాట చొప్పున సమస్తమును చేసిన ఆ దేవుని యందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము (సామెతలు 9:10). జ్ఞానమును నేను (సామెతలు 8:12) అని పలికిన యెహోవా దేవుడు మాత్రమే ఈ భూమి మీద మనకు కలిగిన ఒకే ఒక బోధకుడు, క్రీస్తు ఒక్కడే మన గురువు (మత్తయి 23:8-11).

వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి, జ్ఞానము ముత్యములుకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు (సామెతలు 8:10-11). పరిశుద్ధ దేవుని గ్రంధములో చెప్పిన విధముగా కేవలము జ్ఞానము కొరకు నీవు దేవుని ఉపదేశములను, ఆజ్ఞలను గైకొని జీవించినట్లయితే తను సృష్టించిన సమస్తము దేవుడు నీకు అనుగ్రహించును. యెహోవా స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై – నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దానినడుగమని దేవుడు అతనితో సెలవియ్యగా సొలొమోను నాకు వివేకముగల హృదయము దయచేయుము అని అడిగెను. యెహోవా జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేకముగల మనస్సుతో పాటుగా ఐశ్వర్యమును ఘనతను ఇచ్చెను (I రాజులు 3:5,9,13 4:29).

అటువంటి అద్వితీయమైన దేవుడు తన కుమారుడను మన పాపములనుండి మనలను రక్షించుటకు ఈ భూమి మీదకు యేసు క్రీస్తునిగ పంపెను. బాప్తిస్మమిచ్చు యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చి ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్షమిచ్చితిని అని ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి పలికెను. యేసు దేవుని సువార్త ప్రకటించుట నారంభించి జనులందరికి దేవుని రాజ్యము సమీపించియున్నది మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు ఆ జనులలో కొందరిని తన వెంబడి రమ్మని చెప్పెను, వారు యేసు పిలిచిన వెంటనే ఆయనను వెంబడించెను. అయన పిలిచిన తన పండ్రెండు మంది శిష్యుల పేరులు ఏవనగ పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు అంద్రేయ, జెబెదయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తోలొమయు, తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబుతద్దయియను మారు పేరుగల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ( ప్రియ చదువరి ప్రత్యకముగ యేసు ఎంచుకున్న శిష్యులను జ్ఞాపకము చేసినది ఎందుకనగా మనము తరువాత సంచికల్లో వీరు యేసుని శిష్యునిగా తెలుసుకొనిన సంగతులు, జ్ఞానము, ఆ జ్ఞాన వివేకముతో వారి జీవితంలో చేసిన కార్యములు గురించి తెలుసుకుందాం)

యేసు తన శిష్యులతో కలిసి ఎన్నో ప్రాంతములలో అధికారము గలవానివలె జనులకు వాక్యమును బోధించెను. యేసు ఎన్నో సంగతులను ఉపమాన రీతిగ వారికి బోధించెను, ఎన్నో అధ్బుతకార్యములు జరిగించెను (పరిశుద్ధ గ్రంధములోని సువార్తలలో వివరముగ లిఖించబడినవి).

యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము శ్రమలనుభవించి సిలువ వేయబడెను మరియు తాను పలికిన విధముగా మూడవ దినమున మృతులలోనుండి లేచి తన పదనొకండు మంది శిష్యులతో గలిలయ కొండ దగ్గర వారితో పలికినదేమనగ – పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్ననని వారితో చెప్పెను. యేసు స్వయముగా మనలను తన శిష్యులనుగా ఎంచుకొనెను, తాను చెప్పిన సంగతులను గైకొని తన మార్గములో వెంబడింప ఆజ్ఞాపించెను. యేసు – ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని చెప్పెను (మత్తయి 16:24). అటువంటి గొప్ప మహోన్నతమైన దేవుని కలిగిన మనము ఆయనకు శిష్యులుగా ఉన్నామా? ఆయన చెప్పిన సంగతులు తెలుసుకొని వాటి ప్రకారము జీవిస్తున్నామా?

నేను యేసుని శిష్యుడను అని నీవు ఇతరులతో ఎప్పుడు చెప్పగలవు, యేసు నీ శిష్యుడను అని యేసుక్రీస్తుతో ఎప్పుడు పలుకగలవు. యేసు చెప్పిన సంగతులు గైకొని ఆ ప్రకారము నీవు జీవిస్తున్నట్లయితే నీవు దేవుని శిష్యునిగా ఎంచబడతావు అతని శిష్యునిగా సంపూర్ణ జ్ఞానముతో వివేకము కలిగి ఐశ్వర్యము ఘనతతో జీవిస్తావు.


Share this post