- Author: Dr G Praveen Kumar
- Category: Messages
- Reference: Sajeeva Vahini - Daily Motivation
విశ్వాస పరిమాణం
Audio: https://youtu.be/naheKpZITzg
ఒక సహోదరుడు, నవమాసాలు పూర్తైన తన భార్యను హాస్పిటల్ కు తీసుకొని వచ్చాడు. మీరు బయటనే వాయిట్ చేయండి మేము ఆపరేషన్ చేసి ఏ విషయమో చెప్తాము అన్నారు డాక్టర్ గారు. అబ్బాయి పుడితే ఎలా ఉంటుంది అమ్మయు పుడితే ఎలా అనే ఆలోచనతో ఒకవైపు కాస్త సంతోషం మరోవైపు కాస్త భయంతో ఆపరేషన్ గది వెలుపట కూర్చుండిపోయాడు. దేవునిపైనే భారం వేసి డాక్టర్ గారి సందేశం కొరకు వేచి చూస్తు అతనికి సిస్టర్ గారు వార్త తీసుకొని వచ్చారు మీకు అబ్బాయి పుట్టాడని. అబ్బాయిని తండ్రి చేతిలో పెడుతూ, క్షమించండి మీకు అబ్బాయి పుట్టాడు కాని, ప్రాణం లేకుండా పుట్టాడు అని చెప్పింది. ఆ వార్త వినగానే కుప్ప కూలిపోయాడు. నా ఊపిరితో నవమాసాలు మోసి, కడుపులో ప్రాణం పోసిన బిడ్డకు ఇప్పుడు ప్రాణం లేదనే వార్త తల్లి గుండెను బ్రద్దలుచేసింది. నా భుజాల పైన ఎత్తుకొని పెంచి పెద్ద చేయాలని కన్న కలలన్నీ ఒక్కసారిగా నీరుగారిపోయి... తండ్రి ఆశలన్నీ ఆడి ఆశలైపోయాయి. ఎంతటి దుర్భరమైన దయనీయమైన పరిస్తితి కదా.
అదే హాస్పిటల్ లో ఎదురుగా కూర్చున్న నేను, నా కళ్ళెదురుగా కడులాడుతున్నా ఈ సందర్భాన్ని వీక్షిస్తున్నప్పుడు బాధతో పాటు ఆశ్చర్యం కలుగజేసింది. మన జీవితంలోని ఇంతకంటే ఎన్నో సందర్భాలు మన ఆశలను విచ్చినం చేస్తూ. వేసే ప్రతి అడుగులో గొప్ప అద్భుతాన్ని చూస్తాను అనేలోపే భయంకరమైన ఉప్పెనవంటి శ్రమతో, బాధతో మనల్ని క్రుంగుదలతో కుదిపేస్తుంది. మనం ప్రేమించే వారిని కోల్పోయినప్పుడు, బంధాలు బంధుత్వాలు మనతో తెగతెంపులు చేసుకున్నప్పుడు, వివాహ సంబంధంలో మీరు మాకు నచ్చలేదు అని చెప్పినప్పుడు.. ఇలా ఎన్నో సందర్భాల్లో విచారం కన్నీళ్లు తప్ప ఇంకా ఏ సంగతులు కూడా గుర్తుకు రావు. ఇలాంటి సమయాల్లో మన విశ్వాస పరిమాణం ఎంతో, దాని కొలత ఎంతో మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను. ఆనందం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని, కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడని, మెలిపెట్టే బాధ కలిగినప్పుడు దేవుని దూషించేవారు ఎందరో ఉన్నారు. జీవన్మరణాలపై మానవునికి ఎటువంటి ఆధిపత్యం లేదనే విషయం తెలిసినప్పటికీ మన ఆశ బ్రదికితే బాగుండు అనే కదా. యోబు భక్తుని గూర్చి ఎంత చదివినా తెలుసుకున్నా, నిజ జీవితంలో "యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను" అని చెప్పాలంటే హృదయంలో ఇంకా సందేహం ఉండదా బాధ కలుగదా. ఎటువంటి సందర్భంలో నైనా "దేవునికే మహిమ కలుగును గాక" అని చెప్పడం అత్యంత కష్టం. లాజరు చనిపొయాడనే వార్త యేసు క్రీస్తును కూడా బాధపెట్టింది. "యేసు కనీళ్ళు విడిచెను" అనే మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి యుంచారంటే ఆ మాటను బట్టి ఆలోచిస్తే దేవుడు మన యెడల తన ప్రేమను ఏ విధంగా కనుపరుస్తున్నాడో అర్ధం అవుతుంది.
నేనంటాను, మనసులో బాధ మరియు క్రుంగుదల కన్నీరులా ఏరులై ప్రవాహిస్తేనే ఆ బాధ నుండి విడుదల పొందగలం. దేవుని పైన విశ్వాస పరిమాణం మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నష్టపోయినప్పుడు, ఎడబాటు కలిగినప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు తగ్గిపోయిందంటే, మన విశ్వాసానికి మనమే ప్రశ్న వేసుకోవాలి. అందుకే కీర్తనా కారుడు అంటాడు "నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? .......దేవునియందు నిరీక్షణ యుంచుము". ఈ మాట కేవలం విశ్వాస పరిమాణంలో అత్యంత స్థాయికి చేరుకున్న విశ్వాసి మాత్రమె చెప్పగలడు.
విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయి ఏమిటి? ఈ ప్రపంచంలో నేను, దేవుడు ఇద్దరం మాత్రమే ఉన్నాము. ఇంకెవ్వరులేరు అనుకున్నప్పుడు, అంటే పూర్తిగా ఆయనపైనే ఆధారపడే స్టితి. అందుకే కీర్తనాకారుడు ఇలా చెప్పగలుగుతున్నాడు. తన బాధలు చెప్పుకోవడానికి ఇంకెవ్వరూ కనిపించలేదు. అందుకే తనే తన ప్రాణంతో చెప్పుకొంటున్నాడు.
ఒంటరితనమా? సమస్యల సుడిగుండమా? చెలరేగే తుఫానా? ఆప్తులంతా దూరమైనపరిస్థితా? ఆధ్యాత్మిక, ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ, మానసిక సమస్యలా? శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములా? సమాధానం లేదనుకొంటున్న ప్రశ్నలా? పరిష్కారం లేదనుకొంటున్న సమస్యలా? గమ్యం తెలియని పయనమా? అయితే, నీ ప్రతీ పరిస్టితికి పరిష్కారం నిరేక్షణతో కూడిన మన విశ్వాసంలోనే ఉంది. బస్సులో ప్రయాణం చేస్తున్న నీవు ప్రమాదం ముందుందని నీలో నీవు కంగారుపడితే ఏమి ప్రయోజనం? ఆ బస్సు నడిపేది నీవు కాదుకదా? బస్సు....డ్రైవర్ చేతిలో వుంది. అలానే, నీ సమస్యల్లో నీవు కంగారు పడినా ఏమి ప్రయోజనం? నీ జీవితం యేసయ్య చేతిలో వున్నప్పుడు. ఆయనే ప్రతీ పరిస్టితి గుండా నడిపిస్తూ గమ్యం చేరుస్తాడు. సమస్య కలిగిందా? ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసావేమో? ఇక ఇది నా జీవితంలో సాధ్యం కాదని తీర్మానిన్చుకున్నావేమో. నీకు సాధ్యం కాకపోవచ్చు. కాని, నీవు విశ్వసించే యేసయ్యకు సమస్తము సాధ్యమే.
అబ్రహాము "నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను." రోమా 4:18 ( ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు.) నీవును నిరీక్షించగలిగితే ఆ విశ్వాసం నిన్ను కూడా సిగ్గుపరచదు
దేవునిపై నిరీక్షణ కలిగిన జీవితాల్లో.... ఆయనపై విశ్వాస పరిమాణం రోజు రోజుకు పెరగాలే కాని తక్కకుండా చూసుకున్నప్పుడే ఊహించలేని ఆశీర్వాదాలు చూడగలం. దేవుని ప్రేమ మనలను ఎన్నడు ఎడబాయదని గ్రహించినప్పుడే జీవితం క్రొత్త మలుపులు తిరిగుతుంది. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు బాధ కలిగిన ప్రతీ సారి మోకరించి ఆయన సన్నిధిలో గుండెలు బ్రద్దలు కొట్టుకొని ఆయన కౌగిలిలో కన్నీరు కారుస్తేనే పరిష్కారం దొరుకుతుంది. బాధల్లో శ్రమల్లో ఒంటరైనప్పుడే దేవునికి అత్యంత దాగ్గరవుతావు అనే సంగతి మరచిపోవద్దు.
ప్రయత్నించి చూడు! ఆమెన్