- Author: Rev. K. John Babu
- Category: Messages
- Reference: Sajeeva Vahini Oct - Nov 2011 Vol 2 - Issue 1
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన క్రీస్తు యేసు ఘనమైన నామమున మీకు శుభములు. “ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.” కీర్త 46:4. ఈ నది మరియు కాలువలను గూర్చి కొన్ని వేల సంవత్సరముల క్రితమే ప్రవచింపబడియున్నది. ఈ ప్రవచనము ప్రకారము నది క్రీస్తు యేసును కాలువలు విశ్వాసులను సంతోష పరచుట అనగా విశ్వాసులు యేసు ప్రభువునకు సాక్ష్యులుగా జీవించుటను సూచించుచున్నది.
“అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను.” యోహాను 5:14,15 క్రీస్తు యేసు యొక్క అద్భుత వాక్ శక్తి ద్వారా స్వస్థత నొందిన ఈ వ్యక్తి దేవాలయమునకు వచ్చి తనను స్వస్థపరచినవాడు యేసు అని సాక్ష్యం చెప్పాడు, అనగా సజీవ వాహిని యేసు (నది) ప్రవహించి మోడువారిన అతని జీవితాన్ని చిగురింపజేసినదని అతనుకూడా కాలువయై ప్రవహించుకుంటూ వచ్చి దేవుని దేవాలయముతో తన సాక్ష్యం ద్వారా దేవుని సంతోష పరచుచున్నాడు.
పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం లోని మొదటి తొమ్మిది వచనాలు చదివినట్లయిన అక్కడ ఐదు మంటపములుగల బేతెస్థ అను కోనేరును చూచుచున్నాము. అక్కడ రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడియున్నారు. వారిలో ఒకడు అనగా దేవాలయములో సాక్ష్యం చెప్పిన వాడు ఈ కోనేటి ఒడ్డున 38సం|| నుండి స్వస్థత కొరకు పడియుండెను. ఆ కోనేటి చరిత్రను బట్టి చూడగా ఒక దేవుని దూత అప్పుడప్పుడు పరలోకం నుండి దిగి వచ్చి ఆ కోనేటినీటిలో దిగి ఆ నీటిని కదిలించేది. అలా కదిలించినపుడు దేవుని యొక్క శక్తివలన ఆ నీటికి స్వస్థపరచు గుణం కలిగేది. కదిలింపబడిన జలాలలో ఎవరు ముందుగా దిగుతారో వారు మాత్రమే స్వస్థత నొందేవాడు. మిగిలినవారు మరొక అవకాశం కొరకు ఎదురుచూచేవారు.
పైన సాక్ష్యం చెప్పిన వ్యక్తి 38 సంవత్సరాలుగా ఈ కోనేటి ఒడ్డున స్వస్థత కొరకు పడియున్నాడు. యేసు ప్రభువు ఈలోకంలో ఇంకా 5సంవత్సరాలకు జన్మిస్తాడనగా అక్కడ చేరాడు. దీనికి బట్టి పేదలు, రోగులు, అనాధలతో ఉండే నిస్సహాయిత మానవులలో ఉండే స్వార్ధబుద్ది ఇక్కడ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ప్రతివాడు తానే అందరికన్నా ముందుగా కోనేటిలో దిగి స్వస్థత పొందాలని చూచుచున్నాడే గాని నిస్సహాయులైన ఇతరులను గూర్చి ఆలోచించే వాడే కరవయ్యాడు. సహోదరప్రేమను చూపించేవారే లేక పోవడం ఆశ్చర్యమే. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో కరుణించి, ఆదరించి సహాయం చేయుట కొరకే క్రీస్తు యేసు సజీవ వాహినియై ఈ కొలను దగ్గరకు ప్రవహించుకుంటూ వచ్చాడు. ఆయన రాకతో బేతెస్థ అనుకొలను కనికర గృహముగా మారిపోయింది. “నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రిలేనివారికి నీవే సహాయుడవై యున్నావు” కీర్త 10:14. “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.”యెషయా 40:29.
అతనిని చూచిన ప్రభువు దయగల చక్కటి ప్రశ్నవేశాడు ... స్వస్థపడగోరుచున్నావా? అని (యోహా 5:6-9) నిరాశ నిస్పృహలతో నిండియున్న అతనిలో ఒక్కసారిగా కొండంత ఆశరేకెత్తింది. “అయ్యా, నీళ్లు కదలింపబడి నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను”. యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా – వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
స్వస్థత దేవుని నుండి కలిగినదే గాని దేవుని దూత చేతులలోనో, కోనేటి నీళ్ళలోనో లేదు. దేవుడు ఆనాడే చెప్పాడు “మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.” నిర్గమ 15:26
అంతేకాకుండా దేవుడు ఈ లోకంలో నరావతారిగా జన్మించింది ఆయా నదీజలాలను, ఆయాకొండలను ఆయా నక్షత్రాలను రక్షణ మరియు స్వస్థత స్థానాలుగా చేయడానికి కాదు. ఒకవేళ ఆయా పుణ్యక్షేత్రాలు స్వస్థత శక్తి, రక్షణ శక్తి ఉంటె ఆయన ఈ లోకంలో అవతరించుట వృధాయే కదా!
ఈనాడు బెతెస్థ అను కొలను యేసుతో సజీవ వాహినియై మన దగ్గరకు ప్రవహించుకొంటూ వస్తూ ఉంది. తమ తమ హృదయ క్షేత్రాలలోకి ఈ ప్రవాహాన్ని చేర్చుకొన్నవారే ధన్యులు. ఆత్మ ఫలమును పండించుటలో వారికి వారే సాటి.
సమరయస్త్రీతో : (యోహా 4:4-10) ఒకరోజు సమరయ దగ్గరలోనున్న యాకోబు బావి దగ్గరకు క్రీస్తుయేసు అను సజీవ వాహిని ప్రవహించు కొంటూ సమరయ స్త్రీ దగ్గరకు వచ్చింది. ఆమెకు అనేక పారమార్ధిక సత్యాలను బోధించాడు. ఆ మాటలు వినిన ఈమె ఎంత పాపియో తెలుసుకుంది. తనతో మాట్లాడు ఆయన రాబోవు మెస్సీయ అని తెలుసుకుంది. తానూ చేస్తున్న పాపాన్నిదాచుకోకుండా ఆ ప్రభువుకు తెలియజెప్పుట వలన దైవ పుత్రికగా అంగీకరింపబడిన ఆమె ప్రకంపనకు గురియై కృపను మోసుకుపోవు కాలువగా మారి సుఖారను గ్రామంలో బీడు వారిన జనుల హృదయ క్షేత్రాలలో ప్రవహించి వారిని రక్షకుని వైపు మరలించింది. వారు నేరుగా ప్రభువు పాదాల దగ్గర చేరి జీవముగల ఆయన మాటలను విని ఈయనే లోక రక్షకుడని తెలుసుకొని సాక్ష్యం చెప్పారు. కాలువలైన వీరి సాక్ష్యం వలన దేవుని పట్టణం లేక పరలోక పట్టణం ఎంత సంతోషపడినదో కదా!
దమస్కుమార్గంలో: కర్కష హృదయంలో ద్వేషమనే పంట కోస్తున్న సౌలు హృదయంలోకి సజీవ వాహినియైన క్రీస్తు ప్రవహించి పౌలుగా మార్చుట వలన అతడెంత జీవముగల సాక్ష్యం చెబుతున్నాడో చూద్దాం. II కోరింథీ 4:10-11 “యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించు కొనిపోవుచున్నాము. ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము”. క్రీస్తు ప్రజలను మరణానికి అప్పగించు ఇతనిని క్రీస్తు తాకినపుడు క్రీస్తు కొరకు మరణిస్తున్నాడు. గనుక యేసు అను నదిని తన హృదయంలో నింపుకొనిన ఎవరైన ఈ విధంగానే పాపి హృదయాన్ని వాక్యపు జలములతో నింపి రక్షణ మార్గం వైపు తీసుకు పోయే ఈ కాలువ ప్రవాహమునకు ప్రభువు సన్నిధి ఎంత సంతోషించి ఉంటుందో కదా! సుంకపు మెట్టు దగ్గరకో, ఎడారిలో పయనించు రధం మీదకో, లేక గలిలయ సముద్ర తీరానికో ఈ సజీవ వాహిని ప్రవహించుకొంటు వస్తూనే ఉంటుంది. సిలువలో వ్రేలాడు దొంగ అతని చూచి ఈ సజీవ వాహిని తన హృదయంలో చేర్చుకొని పరలోకాన్ని సంపాదించుకొన్నాడు. మేడి చెట్టు దిగి వచ్చిన జక్కయ్య “ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.” లూకా 19:8
గోల్గొతా కొండపై క్రీస్తు కార్చిన పవిత్ర రక్తపు నదిలో పాపములను కడుగుకొన్న నీవు రక్షణవార్తను ప్రవహింప జేయు కాలువయై సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరుస్తావని సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తావని కనిపెట్టుచు వున్నాడు. ఈ క్రీస్తు అను సజీవవాహినిని నీవు అయినా నీ హృదయంలో చేర్చుకోకపోతే నేడే చేర్చుకో ఇదే మంచి సమయం.దేవుడు మిమ్మును దీవించును గాక.