Skip to Content

ప్రార్ధన

19 July 2024 by
Sajeeva Vahini
  • Author: Anil Andrewz
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Dec - Jan 2010 Vol 1 - Issue 2

ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు జవాబు పొందుకొనలేరు. కొందరు ప్రార్థిస్తారు కాని, జవాబు గురించి ఆలోచించరు. కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూసి, జవాబు రానందుకు వారి స్వంత నిర్ణయాలతో  ముందుకు వెళ్తారు. ఎందుకు జవాబు రాలేదో ఆలోచించరు. కొందరు ప్రార్థన ఎంత  సమయం చేసారో  లెక్కపెట్టుకుంటారు. మరి కొందరు మేము ఆత్మీయతలో సీనియర్స్, మేము పది నిమషములు ప్రార్థన చేస్తే చాలు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అని అనుకుంటారు. ఎడతెగక దేవుని పరిచర్య చేసేవారు పది నిమిషములు కాదు, సమయం లేని సందర్భములో నడుస్తూ ప్రార్థించినా దేవుడు బలమైన కార్యములు చేయగలడు. కాని, దినమంత వ్యర్ధమైన  పనులు చేస్తూ పది నిమిషములు ప్రార్థించి దేవుడు బలమైన కార్యములు చేస్తాడు అనుకోవడం భ్రమ. నేనంటాను క్రీస్తు స్వభావం లేకుండా జీవిత కాలమంతా మోకాళ్ళ పై ఉన్నా వారి జీవితంలో దేవుని కార్యం ఒకటి కూడా చూడలేరు. మరి కొంతమంది ప్రార్థించి జవాబు వచ్చేవరకు విశ్వాసమును విడిచిపెట్టరు.

దావీదు ప్రార్థన జీవితాన్ని చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. కీర్తనలు 18:6 లొ ... నా దేవునికు ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొర  ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దావీదు ప్రార్థన చేసి తన ప్రార్థన దేవుని చెవులలోనికి వెళ్ళడం కూడా చూసాడు. 

దేవుని చేత ప్రేమించబడిన ప్రియ సహొదరి/సహొదరుడా దేవునికి  ఎలాంటి ప్రార్థన ఇష్టం? ప్రార్థన ఎలా చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కొరకు నేను అనేక నెలలు వెదకినప్పుడు. మొట్టమొదట నాకు వచ్చిన సందేహం, నా గురించి నేనెందుకు ప్రార్థన చెయ్యాలి? ఈ సందేహం మా తండ్రి గారిని చూసినప్పుడు కలిగింది. నా చిన్ననాటి నుండి ఏది కొనమని నా తండ్రిని అడగలేదు, నేను లేమి అనేది ఎప్పుడు చూడలేదు, అనుభవించలేదు. నాకు ఏది అవసరమో, ఎలాంటి బట్టలు వేస్తే బాగుంటుందో నన్ను కన్న నా తలిదండ్రులే కొని తెచ్చేవారు. ఇది నాకు లేదు అనే స్థితి నాకు రాలేదు. నా తండ్రే కాదు యే తండ్రైన తమ పిల్లలు సంతోషముగా ఉండాలనే కోరుకుంటారు. ఈ లోకములో నేను కలిగిన తండ్రే ఇలా ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ఎలా ఉండాలి? అబద్దమాడనేరని దేవుడు తనను ప్రేమించే ప్రతి ఒక్కరి అవసరములు తీరుస్తాడు. 

దేవునికి యదార్ధముగా  ప్రార్థించే వారు కావలి, నటించేవారు కాదు.  మత్తయి 6:5 లో...మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె  ఉండవద్దు అని ఉంది. వేషధారి అంటె వంచకుడు, మత వంచకుడు. తనకు తెలియకుండ తననే మోసము చేసుకొనేవాడు. తనకు తెలిసి పరిశుద్ధాత్మను మోసము చేసేవాడు. దేవుని మెప్పును కాకుండా ఇహలోక మెప్పును కొరుకొనే వాడే  వేషధారి. మత్తయి 6:2లో  వేషధారి మనుష్యుల వలన ఘనత పొందాలని ధర్మం చేస్తాడు. మత్తయి6:5లొ వేషధారి మనుషులకు కనబడవలెనని ప్రార్థన చేస్తాడు.యేసు ప్రభువు వేషధారులవలె ప్రార్థన చేయవద్దు అని చెప్పి  మత్తయి 6:9-14 లొ ప్రార్థన ఎలా చేయాలో, దేని గురించి చేయాలో నేర్పిస్తున్నాడు. కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

జీవిత కాలమంతా ఈ ఒక్క ప్రార్థననే చేయుమని కాదు దేవుని ఉద్దేశం. ఇందులో ప్రార్థించేవారికి కావలసిన లక్షణాలు ఉన్నవి.పరలోకమందున్న మా తండ్రి : పరలోకమందున్న తండ్రి వినాలని ప్రార్థన చేయాలికాని,ఇహలోకమందున్న మనుష్యులు వినాలని ప్రార్థన చేయవద్దు. పరలోకమందున్న తండ్రి ప్రార్థన వింటే, తన చేతులతో నీకు ప్రతిఫలమిస్తాడు. ఇహలోక మనుష్యులు వింటే తమ చేతులతో చప్పట్లు మాత్రమే కొట్టగలరు. అనేకులు మనుష్యులు మెప్పు కోరుకోని మంచి పదాలతో ప్రార్థన చేస్తున్నారు. వారు దేవుని దగ్గర నుండి ప్రతిఫలము కోరుకొనరు. అలాంటి ప్రార్థనను దేవుడు వ్యర్ధమైన మాటలు అని చెప్పుచున్నాడు(మత్తయి 6:7)

నీ నామము పరిశుద్ధపరచబడును గాక: ఎలా దేవుని పరిశుద్ధ నామమును మనము పరిశుద్దపరచగలము? సంఖ్య 20:12 లో అపుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కోనకపోతిరి. ద్వితి 32:15…ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధ పరచక నా మీద తిరుగుబాటు చేసితిరి. ప్రియ చదువరీ! మనము నివసిస్తున్న ప్రజల మధ్య మన క్రియల ద్వారా దేవుని మహిమ పరచుటయే ఆయన నామమును పరిశుద్ధ పరచుట లేక సన్మానించుట. దేవునికి మహిమ కరంగా జీవించకుండా చేసే ప్రార్థన వ్యర్ధము.

నీ రాజ్యము వచ్చుగాక: ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అనేక మంది ఈ లోకంలోనే శాశ్వతంగా ఉండిపోవాలి అనుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. జీవన శైలిలో మార్పులు, పోటి కనిపిస్తుంది. ఈ లోకంలో మనం జీవించే ఈ జీవితం పరలోకానికి సిద్ధపాటు అని మరచి, ఈ లోకంలో ఉన్నత స్థితికి చేరుకోవడమే జీవిత లక్ష్యంగా మారిపోతుంది. 1 పేతురు 2:11 లో “మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి” అని వ్రాయబడి ఉంది. దేవుని రాజ్యమును మరచి, ఈ లోకమును ప్రేమిస్తూ చేసే ప్రార్థన దేవునికి అంగీకారము కాదు.

నీ చిత్తము పరలోకమందు నేరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక: పరలోకంలో దేవుని చిత్తం ఏది? యోహాను14:3 లో “నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును”. మనము ఆయనతో యుగయుగాలు ఉండాలని దేవుడు తన చిత్త ప్రకారం పరలోకంలో నెరవేరుస్తున్నాడు. భూమియందు దేవుని చిత్తం ఏది?మత్తయి 28:19 లో “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి”. ప్రతి ఒక్కరు దేవుని శిష్యులుగా మార్చబడాలి? ప్రతి క్రైస్తవుడు సువార్త పని చెయ్యాలి, లేక సువార్త పని చేసేవారికి సహాయమైన చేయగలగాలి. అలా చేయకుండా చేసే ప్రార్థన వ్యర్ధం. అది స్వార్ధపూరితమైన ప్రార్థన.

మా అనుదినాహారం నేడు మాకు దయచేయుము: క్రైస్తవుడు ఈ దినము గురించి ఆలోచన కలిగి ఉండాలి కాని, రేపటి దినము గురించి కాదు. మత్తయి 6:26 లో “ఆకాశపక్షులను చూడుడి; .. మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?” అనేకులు రేపటి కలలు కలిగి ఉన్నారు. ఈ రాత్రి ఆఖరి దినమై, రేపటి ఆలోచనలు ఎవరూ నెరవేరుస్తారు. మత్తయి 6:34 లో రేపటి గూర్చి చింతింపకుడి... అని ఉంది.మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము: మత్తయి 5:23-24 లో “ కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల. అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము”. అర్పణము కంటే ముందు దేవుడు సమాధానముకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇందులో నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అను ఆజ్ఞ ఇమిడి ఉంది. తోటివారితో సమాధానము లేకుండా, తోటివారిని ప్రేమించకుండ చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాదు.

మమ్మును శోధనలోనికి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము: ఇక్కడ పాపముపైన అసహ్యత, పరిశుద్ధత పైన కోరిక కలిగి ఉండాలని నేర్పిస్తుంది. చేసిన పాపం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు కాని ఆ ఒప్పుకున్న పాపమును విడిచిపెట్టేవారు కావలి దేవునికి. 1థెస్సలో 4:3 లో “మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము”. పరిశుద్ధత లేకుండా చేసే ప్రార్థనను దేవుడు లక్ష్యపెట్టడు.

ఈ పరలోకపు ప్రార్థనలో ముఖ్యముగా ఐక్యత కనిపిస్తుంది. ఇందులో యేసు ప్రభువు “నా“ అని సంభోదించక “ మా” అని సంభోదిస్తున్నాడు. కీర్తన 133 లో సహోదరులు ఐక్యత కలిగి నివసించు చోట ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండును.ప్రియ చదువరీ!, ప్రార్థన లో ఎంత సమయం గడిపావనేది ముఖ్యం కాదు, క్రీస్తు స్వభావంతో చేయడం ముఖ్యం. మోకాళ్ళు నల్లబడటం ముఖ్యం కాదు, హృదయంలోని నలుపు పోవడం ముఖ్యం. చక్కగా ప్రార్థన చేస్తాడు అని మెప్పు రావడం ముఖ్యం కాదు, నీ ప్రార్థన తో దేవుని మనసును కదిలించడం ముఖ్యం. ఆదిలో ఆత్మ నీళ్ళ పై అల్లాడినప్పుడు సృష్టిలో భయంకరమైన అద్భుతములు జలిగినవి. నీ ప్రార్థన సృష్టికర్తయైన దేవుని కదిలించినప్పుడు నీ జీవితంలో అద్భుతములు చూడగలవు. ప్రార్థన రెండు హృదయాల కలయిక. అవును ప్రియ చదువరి! మనకు ఇష్టమైన పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ జీవితంలోనికి వచ్చాము. యేసు ప్రభువు తన కిష్టమైన పరలోకం విడిచి మన కోసం ఈ లోకమునకు వచ్చాడు. ఇదే రెండు హృదయాల కలయిక. మోకాళ్ళు నేలను తాకినప్పుడు, నోటిలోనుండి వచ్చే స్వరం చెవులకు వినిపించినపుడు, ఆహా! అది ఓ వర్ణించలేని అనుభూతి. హృదయం లోకంపై విజయ గర్వంతో నింపబడుతుంది. ప్రార్థన ఒక ఉప్పెన. సాతాను తంత్రములు పోట్టువలె కనిపిస్తుంటాయి ప్రార్థన ఒక శక్తివంతమైన విస్పోటనము. ఆది అపోస్తలుల లోకమును తలక్రిందులు చేయుటకు కారణం వారి పరిశుద్ధ, యదార్ధమైన హృదయంలో నుండి వచ్చిన ఆ ప్రార్థన వలననే సాతాను స్థావరములను ధ్వంసము చేసి సాతాను శక్తులను నిర్జీవపరచారు, అందుకే లోకం తలక్రిందులైంది.

ప్రార్థన లేని జీవితం చచ్చిన శవంతో సమానం. శవమునకు విజయానందం ఉండదు. లూకా 17:37 లో పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవును... అనగా, సాతాను శక్తులు, అబద్ద ప్రవక్తలు పోగవుతారు. సత్యమునుండి తొలగించి క్రీస్తునకు విరోధులుగా చేయుటకు.

పరమగీతము 2:10-17 లో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. (వ11)ఈ సంవత్సరమునుండి పాపము విడిచి పెడతాను, రేపటినుండి ప్రార్థన చేస్తాను. ఆ పని ఈ పని అని ప్రార్థన వాయిదా వేయకు, దేశమంతా సువార్త ప్రకటించబడుచున్నది. క్రీస్తును దేవునిగా అంగీకరించుటకు అనేకులు ఆయన యొద్దకు తరలి వస్తున్నారు. బలమైన కార్యములు చేయుటకు దేవుని హస్తము చాపబడి యున్నది. ఇంకా చాలా సమయమున్నది అని ఎంత కాలం భ్రమపడతావు, లెమ్ము రమ్ము అని దేవుడు పిలుస్తున్నాడు. (వ 13,14) నా రక్తంలో కడగబడిన నీవు సుందరవతివి/సుందరుడవు; నా సన్నిధిలోనికి వచ్చి, నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము. ఎందుకంటే (వ 15) సంఘాలను,కుటుంబాలను చెరుపుచున్న గుంట నక్కలను పట్టుకొని దేవునికి సహాయము చేయుటకు. ప్రస్తుత దినాలలో అపవాది కుటుంబ వ్యవస్తని పాడుచేస్తున్నాడు. కుటుంబాలు విచ్చిన్నమై పోవుచున్నాయి. కుటుంబములో ఒకరితో ఒకరికి సమాధానం లేకుండా ఉన్నారు. కారణం కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ సహవాసం లేకపోవుటయే.

దేవుని చేత ప్రేమింపబడుచున్న ప్రియచదువరి! సాకులు చెప్పకుండా ప్రార్థనను రేపటికి వాయిదా వేయకుండా, పైన తెలిపిన ఏడు లక్షణాలను కలిగి, పరిశుద్ధమైన ప్రార్థన కలిగియుండుటకు దేవుడు మీకు సహాయము చేయును గాక...!


Share this post