- Author: Bro. Samuel Kamal Kumar
- Category: Messages
- Reference: Jesus Coming Soon Ministries
ఒకరు విడువబడుదురు ఒకరు ఎత్తబడుదురు “ఆ కాలమున ఇద్దరు పొలములో వుందురు ఒకడు తీసుకొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును, ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు ఒకతె తీసుకునిపోబడును ఒకతె విడిచిపెట్టబడును. మత్తయి 24:40, 41 క్రీస్తు నందు ప్రియపాఠకులారా! మన రక్షకుడును, మన విమోచకుడును, జీవాధిపతియైనా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ మాసములో మరొకసారి దేవుని సందేశమును మీతో పంచుకొనుటకు దేవుడు నాకిచ్చిన అవకాశమునుబట్టి దేవునికి స్తోత్రములు. మన జీవితములో ఎప్పుడైనా విడువబడుట, ఎత్తబడుట అనే పదములు విన్నామా? వినివుంటే ఎక్కడ వినివుంటాము? ఎప్పుడెప్పుడు వినివుంటాము? ఈ విషయాన్ని ఎంత దీర్ఘంగా ఆలోచించినా మనకు అర్థంకాదు ఒకవేళ దీర్ఘంగా, లోతుగా ఆలోచిస్తే ఈ రెండు మాటలు సహజముగా మనము వినేది కేవలం ఒకేఒక చోట ఆచోటెక్కడనగా భూమిపైనుండి ఆకాశంలోనికి ప్రయాణం చేసే విమానం, హెలికాప్టర్. ఈ రెండింటిలో ఇలాంటి పరిస్థితులు తరచుగా తలెత్తడం మనమెప్పుడు వింటుంటాము, చూస్తుంటాము. ఎప్పుడైనా ఎవరైనా సముద్రములో తుఫాను చెలరేగినప్పుడు ప్రయాణికులెవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని రక్షించడానికి, కాపాడడానికి విమానంనుండో, హెలికాప్టర్ నుండో పారాషూట్ ద్వారా దిగి ఆ భయంకరమైన ప్రమాదంలో నీళ్లలో కొట్టుకొనిపోయేవారిని కాపాడి రక్షిస్తారు. అయితే పైన పేర్కొనబడిన పై రెండు మాటలు చాలా ప్రత్యేకమైనవి. ఈ మాటలు భూసంబంధమైనవి కావు ఇవి పరలోకమునకు చెందినవి. బాగా ఆలోచిస్తే ఈ రెండు మాటలు రెండవ రాకడలో యేసుప్రభువులవారి ఆగమనం సందర్భంగా ఈ రెండు సంఘటనలు తప్పకుండా జరుగును. మత్తయి 24:40, 41 *మొదటి సంఘటన – ఒకరు తీసుకొని పో బడుదురు :-* ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఒకరు తీసుకొనిపోబడుదురు. ఎక్కడికి? దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరములేదు. మరెక్కడికో కాదు సరాసరి పరలోకానికి. ఈ ధన్యత ఎలా సంపాదించుకోవాలి? ఆశ్చర్యకరమైన ఈ సంఘటన యేసుక్రీస్తు ప్రభువులవారి రెండవ రాకడ సందర్భములో చూస్తాము. ఈ గొప్ప అనుభూతిని పొందాలనుకుంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసముంచుతారో వారికే దొరుకుతుంది. మరి నీకు ఆశ వుంటే ఆయనయందు విశ్వాసముంచు. ఆయన రాజ్యాన్ని సంపాదించుకుంటావు. పౌలు భక్తుడు థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము నుండి 18వరకు ఇలా వ్రాశాడు. “ఆర్భాటము తోను ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుము. కాగా మనము సదాకాలము ప్రభుతోకూడా ఉందుము”. ఈ వాక్యభాగములో తీసుకొనిపోబడుచున్నది ఎవరంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ఆయన బిడ్డలందరు. ఈ ధన్యత బ్రతికినను, మరణించినను ఆయనను నమ్మిన వారికందరికి దొరుకుతుంది. రెండవదిగా క్రీస్తునందుండి మృతినొందినవారు మొదట లేచెదరు. ఆ తరువాత బ్రతికియున్న మనమంతా వారితోపాటు యేసుక్రీస్తు ప్రభువులవారితో కొనిపోబడుదుము. వీరంతా వెళ్ళేది పరలోకానికే. *రెండవ సంఘటన – ఒకరు విడువబడుట :-* యేసుక్రీస్తునందు విశ్వాసముంచినవారు, ఆయనను అంగీకరించనివారు విడువబడుదురు. వీరు భూలోకములో దేవుని వాక్యమును వినివుంటారు, నామకార్ధ క్రైస్తవులుగా జీవించివుంటారు కాని క్రీస్తును నమ్మివుండరు. ఇలాంటివారు జీవితకాలం మందిరమునకు హాజరైన రక్షణ మారుమనస్సు అనుభవంలేనివారే. ఇలాంటి వారంతా భూమి మీద ఏడేండ్ల శ్రమలకాలం ఎదుర్కొనవలసినదే. వారి జీవితమంత వర్ణనాతీతమైన బాధలు, శ్రమలు, వేదనలు అనుభవించవలసివుంటుంది. *ఏడేండ్ల శ్రమల కాలం :-* ఈ కాలం మొదలైనవేళ భూమి మీద నుండి ప్రభువు రాకడలో ఎత్తబడిన విశ్వాసులు ఈ శ్రమలలో పాలుపొందరు. అయితే విడువబడినవారు మాత్రమే వీటిని ఎదుర్కొనవలెను. ఈ పరిస్థితులు తప్పించుకోవాలంటే రక్షించబడటం అవసరం. కావున మన జీవితములో తీక్షణంగా ఆలోచించవలసింది ప్రభువు రాకడను గురించి తప్ప ఈ లోకములో సుఖభోగముల గురించికాదు. ప్రభు రాకడలో నీవేతబడితే నీ గమ్యస్థానం పరలోకమేకదా. విలువబడితే ఏడేండ్ల శ్రమకాలం ఎదుర్కోవాలి ఆ తర్వాత నరకం దీన్ని తప్పించుకోలేవు? తప్పించుకోవాలని ఆశ నీకుంటే ఈ సందేశాన్ని చదువుట ద్వారా మార్పుచెంది, రక్షించబడి, ప్రభువును నమ్మి ఆయన బిడ్డగా జీవించి సమస్త కల్మషము నీకంటకుండా పరిశుద్ధముగా జీవిస్తే సంఘమెత్తబడే గుంపులో నీవుంటావు. దేవుడు మిమ్మును దీవించునుగాక!