Skip to Content

కొరత సమృద్ధిగా మారాలంటే?

20 July 2024 by
Sajeeva Vahini
  • Author: Rev Anil Andrewz
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

కొరత సమృద్ధిగా మారాలంటే...?

Audio: https://youtu.be/Ag9l4mTt0gM

ప్రస్తుత దినములలో ఎక్కువగ వినిపించే మాట కొరత. కర్చులెక్కువ జీతం తక్కువ. సగం నెల అయ్యెసరికి ఎమి చెయ్యాలో తెలియని పరిస్థితి. చేతి నిండా డబ్బులున్నవారికి ఆరోగ్యం లేదు. డబ్బు ఆరోగ్యం ఉన్నవారికి , అందరితో ఆనందముగా గడపలేక బాధ. ఏ ఇంటిలో చూసిన ఏదోక కొరత ఉంది. ఏమి పర్వాలేదని బ్రతుకలేని పరిస్థితి. ఏ కొరతయైన అది ఆర్ధిక కొరత కావచ్చు , ఆరోగ్యం , కుటుంబం , సంఘం ఇలా దేనిలో కొరత ఉన్నా అది మానసికంగా కృంగదీస్తుంది. ఈ రోజులలో మానసిక కృంగుదలలన్ని ఏదోక కొరతవలననే కలుగుతుంటాయి.

అనేక సమయాలలో శిష్యులను అల్పవిశ్వాసులారా అని యేసు ప్రభువు గద్దించాడు. ఇక్కడ శిష్యులకు విశ్వాసము లేదని కాదు విశ్వాసం ఉంది కాని అందులో కొరత ఉంది. ప్రకటన గ్రంథములో కూడా 7 సంఘములతో దేవుడు మాట్లాడుతు వాటిలోని కొరతను చూపిస్తాడు. క్రైస్తవ జీవితములో కొరత మంచిదే , అది ఎప్పుడు మంచిదంటే ; ఆ కొరతలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడే కొరత అనేది మంచిది. ఎందుకంటే యేసు ప్రభువొక్కడే కొరతను సమృద్ధితో నింపగలడు. కాని , కొంతమంది కొరతలో దేవుని విడిచి వెళ్ళిపోతుంటారు.

ఈ రోజు ఒకవేళ నీవు ఏదైన కొరతలో ఉన్నావా ? ఆ కొరత నిన్ను బాధపెడుతుందా ? సంపాదన సరిపోక , విశ్వాస జీవితములో స్థిరముగ నిలబడలేక , ఏమి చెయ్యాలో తెలియక లోలోపల ఏడుస్తుంటే ; నిన్ను బలపరిచే అద్భుతమైన లేఖన భాగం పరిశుద్ధ గ్రంథములో ఉంది.

కీర్తనలు 126:5-6 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.  పడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.

ఈ భాగంలో ఉన్న వ్యక్తికి కన్నీళ్లు ఎందుకొస్తున్నాయో తెలుసా ? చేతిలో పిడికెడు విత్తనములు మాత్రమే ఉన్నాయి. పిడికెడు విత్తనాలతో నా కుటుంబమును ఎలా పొషించుకోవాలి , ఈ పిడికెడు విత్తనాలతో నేనేమి చెయగలనని కన్నీరు కారుస్తన్నాడు కాని , గొప్ప విషయమేమనగా వెనకడుగు వెయ్యలేదు. కన్నీటితోనే పిడికెడు విత్తనములు విత్తి దేవుని వైపు చూసాడు కాబట్టే పనలు మోయగలిగాడు.

ఈ రోజు నీచేతిలో కొంచమే ఉందా ? చేతిలో చిన్నపనులే ఉన్నాయా ? ఎవరు తోడులేక ఒక్కడివే ఉన్నావా ? ఈ కొంచమేమి చేసుకోవాలనుకుంటున్నావా ? పరిస్థితి ఎలా ఉన్నా , నీవెక్కడ ఉన్న నీ చేతిలో ఉన్న కొంచము విత్తుట నేర్చుకో రేపు సమృద్ధితో నింపబడతావు. ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోతున్నానని , వాక్యం చదవలేకపోతున్నానని దిగులుపడక కొంచముతోనే మొదలపెట్టు. చిన్న సేవ , చిన్న పని , చిన్న ఉద్యోగమని కృంగిపోక చిన్నదాంట్లో నమ్మకముగ ఉండు , తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఒంటరిగా ఉన్నానని ఎవరులేరని కలత చెందకు , దేవుడు రేపు ఒక్కడిని వెయ్యిమందిని చేయగలడు.

సమృద్ధి కొరకు ఎదురు చూసే నీవు ఈ రోజు కొంచములో నమ్మకముగా ఉండు రేపు సంతోషగానములతో పనలు మోసుకొస్తావు.


Share this post