Skip to Content

ఇరుకు నుండి విశాలం కావాలా?

20 July 2024 by
Sajeeva Vahini
  • Author: Rev Anil Andrewz
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

ఇరుకు నుండి విశాలం కావాలా?

Audio: https://youtu.be/cLIgMBPKcTs

కీర్తన 118:5 ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను

ఇరుకు నుండి విశాలానికి మధ్యలో ఒక అద్భుతం జరిగింది. ఇరుకు - బలహీనత, శ్రమ, బాధ, ఓటమి, ఒంటరితనం, శత్రువు.

బలహీనతలో ఉన్నవాడు ఎప్పుడు జయిస్తాను, శ్రమలో ఉన్నవాడు ఎప్పుడు భయటకువస్తాను, బాధలో ఉన్నవాడు ఎప్పుడు విడుదలపొందుకుంటాను, ఒంటరితనంలో ఉన్నవాడు ఎప్పుడు సంతోషం, విజయం అని ఇరుకులో ఉన్న ప్రతి ఒక్కరము అనుకుంటాము.

విశాలస్థలం - విజయం, సమృద్ధి, సంతోషం. ఇరుకులో ఉన్న వారిని విశాల స్థలమునకు తీసుకెళ్ళేది దేవుడే.

1 సమూ 30:6 దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా...

ఇక్కడ దావీదు ఇరుకులో ఉన్నాడు. ఒక వైపు నుండి సౌలు తరుముకుంటువస్తున్నాడు. మరోవైపు అమాలేకీయులు దండెత్తి వచ్చి వారి భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరపట్టి తీసుకెళ్ళిపోయారు. దావీదునకు తోడుగా వచ్చిన 600 మంది దావీదునే చంపుటకు లేచారు. ఇప్పుడు దావీదు శ్రమ, బాధ, ఓటమి, ఒంటరితనం, శత్రువు ఇలాంటి వాటిలో ఇరుక్కున్నాడు. ఈ పరిస్థితిలో దావీదునకు ఎవ్వరు లేరు, తన భార్యలు కూడ చెరలో ఉన్నారు.

ప్రియ విశ్వాసి! నీవు కూడ ఇదే పరిస్థితిలో ఉన్నావా? ఇరుకులో నుండి భయటకు రాలేక నిరుత్సాహంలో ఉన్నావా? ఇరుకులో నుండి ఎలా భయటకు రావాలని ఆలోచిస్తుంటే; సమాధానం దావీదు దగ్గర ఉన్నది. ఇరుకు పరిస్థితిలో దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెనని వాక్యం సెలవిస్తుంది. ధైర్యము వచ్చుటకు కారణం, ప్రార్ధనే.

(1 సమూ 30:18,19) ఏదైతే అమాలేకీయులు దోచుకొని పోయారో దానంతటిని దానినంతటిని దావీదు తిరిగి తెచ్చుకొన్నాడు. తన యిద్దరు భార్యలను కూడా రక్షించుకున్నాడు. వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించుకున్నాడు

ఇరుకు నుండి విశాలానికి మధ్యలో జరిగిన అద్భుతం ప్రార్థన. ప్రార్థనలో ధైర్యం వచ్చింది. ప్రార్థన శత్రువుపై విజయం ఇచ్చింది. ప్రార్థన కొల్పోయిన సమస్తాన్ని తిరిగి తీసుకొచ్చింది. ప్రార్థన ఇరుకులో విశాలత కలుగజేసింది.

ఈ రోజు నీవు ఇరుకులో ఉన్నావా? దిగులుపడకు, వెనకడుగు వేయకు. ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేయ్యాలి. ప్రార్థన మొదట ధైర్యాన్ని ఇస్తుంది, తరువాత మార్గం చూపిస్తుంది, చివరికి విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన మాని వెనకడుగు వేయకు యేసు నామంలో ముందుకు అడుగువేయి, విజయం, సమృద్ధి, సంతోషం నీ ముందు ఉంటుంది.


Share this post