- Author: Praveen Kumar G
- Category: Messages
- Reference: Sajeeva Vahini Vol 2 Issue 2
యోహాను 1:1-18 “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచునా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె ఆయనను బయలు పరచెను”.
పై చదువబడిన ఈ వాక్యభాగాన్ని భయముతో వణకుతో ఎన్నుకొని ఈ పరిశుద్ధ క్రిస్మస్ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ, రెండు ఉద్దేశాలను తెలియజేయాలని ఆశపడుతున్నాను. మొదటిది, ఈ వాక్యబాగంలో మహా క్రిస్మస్ సారాంశం ఇమిడి ఉంది అనగా క్రీస్తు పుట్టుకను గూర్చిన సంగతి. 14వ లో “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను”. ఇదే క్రిస్మస్ అను మాటకు అర్ధం. దేవుడు ఈ లోకమునకు కన్యక ద్వారా జన్మించి అవతరించాడు అన్న సత్యం మనకు తెలిసినదే. రెండవదిగా, నిజమైన క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు ప్రభువును బాగుగా తెలుసుకొని ఆయనను అంగీకరించి ఆరాధించవలెననియే.
ఇది చాలా ప్రాముఖ్యమైనది; మనం నివసించు ఈ దినాలలో అనేకమైన క్రైస్తవేతరులు క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయనను వెంబడించినవారైరి. ఏ విధంగా వారు తెలుసుకొన్నారు అని పరిశీలిస్తే ఆయన సిలువలో మనకొరకు పొందిన శ్రమలే అని ఒక్క మాటలో చెప్పవచ్చు. మరి కొంతమంది ఆయన కూడా ఒక దేవుడే అని అందరి దేవతలతో పాటు పూజించే వారుకూడా ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేయబడే క్రీస్తు మరియు ఇతర మతస్తులు వివరించే క్రీస్తు, వీటిలో వ్యత్యాసాన్ని క్రైస్తవులమైన మనం ఘనంగా చెప్పగలం. అందుకే ఈ వాక్యభాగాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను.
ఈ వాక్యభాగాలు వ్రాసింది ఎవరో కాదు, బాప్తీస్మమిచ్చు యోహాను. ఈయన క్రీస్తుకంటే ముందుగా వచ్చి ఆయన త్రోవను సారాళము చేసి క్రీస్తు రాకడ సత్యాలను తెలియజేసాడు. అట్టి అయిదు సత్యాలను “వాక్యం శరీరధారిగా” అను మాటను ఉద్దేశిస్తూ వివిధ కోణాల్లో మనం గమనిద్దాం. అంతే కాకుండా ఆయనను కనుగొన్న వారమై, ఆయనను అంగీకరించి, స్వంత రక్షకునిగా స్వీకరిచవలెననియే నా ముఖ్య ఉద్దేశం.
ఆదియందు వాక్యముండెను అనగా, మొదట అది “దేవుని వాక్కు” అయి యున్నది. అనగా “సృష్టికర్తయై యున్నది” (ఆది 1:1). ఆ వాక్యములో జీవముండెను. ఆ జీవమే నరునిలోని జీవాత్మాయెను (ఆది 2:8). ఆ జీవము అనగా జీవముగల ఆ వాక్యము మనుష్యులకు వెలుగై యుండెను (ఆది 1:3). ఆ వాక్యము ఆత్మచేత ఆవరింపబడియుండెను (ఆది 1:2). ఆ యాత్మ కన్యకయైన మరియను కమ్ముకొనియుండెను (లూకా 1:35).
నిరాకారమును, శూన్యమును, చీకటియు, అగాధమును ఇక లేకపోయెను. వాక్యమైయున్న ఆది దేవుడు భూమ్యాకాశములను సృజించెను (ఆది 1:1). శూన్యమును, చీకటియుయై యున్న మరియ గర్భము కుమారుని దాల్చెను. ఆదియందున్న ఆ వాక్యము, దేవుని యోద్దనున్న ఆ వాక్యము, దేవుడై యున్న ఆ వాక్యము; సమస్త సృష్టికి మూలమైయున్న ఆ వాక్యమే శరీరధారి ఆయెను (యోహాను 1:14).
మొదట శాసనమై యుండెను, తదుపరి ధర్మశాస్త్రమై యుండెను తదుపరి ప్రవచనమైయుండెను. అయితే శరీరధారియైన ఆ వాక్యము కృపకు సత్యమునకు పరిపూర్ణతయాయెను.
వాక్యం శరీరధారిగా... ఈయన పేరు యేసు క్రీస్తు ప్రభువు.
17వలో గమనిస్తే “ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.” “యేసు” అను పేరు ముందుగా యోసేపునకు దేవుని దూత ద్వారా పుట్టబోయే శిశువును గూర్చి తెలియజేయబడెను. “యేసు” అను మాటకు “రక్షకుడు” అని అర్ధం. మత్తయి 1:21-23 లో “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును..” అను సంగతి వ్రాయబడియుంది. “క్రీస్తు” అను మాట యూదులు ఎదురుచూస్తున్న రాజుకు, ఆయన ద్వారా వారు పొందబోవు విజయమును మరియు తన భుజములమీద రాజ్య భారమును గూర్చి సంభోదిస్తుంది.
ఈయనే పరిశుద్ధ గ్రంథంలో “యేసు క్రీస్తు” గా తెలుపబడింది. ప్రతీ పేరులో ఒక వినూత్నమైన అర్ధం తెలియజేస్తూ రక్షకుడుగా ప్రభువుగా పిలువబడ్డాడు.
2. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను..
ఈ వాక్యభాగంలో రెండు సంగతులును మనము గ్రహించాలి. మొదటిది వాక్యము దేవుని యొద్ద మరియు రెండవది వాక్యము దేవుడై. శారీరికంగా మాట్లాడితే ఈ రెండు సంగతులు వెవ్వేరు అర్ధమిచ్చునవి. అయితే ఆయన దేవుడై యుండాలి లేదా దేవుని యొద్ద ఉండాలి. ఈ రెండు అర్ధాలను సంభాషిస్తే మనకు ఎన్నో సందేహాలుండవచ్చు, కాని యోహాను నిజముగా చూచిన ఆ దర్శనమును మనకు కనుబరచి; శరీరధారి కాకమునుపు ఆయన యేసు క్రీస్తుగా మరియు తండ్రి యొద్ద ఉన్న వాడుగా మనం పరిగణించాలి. అయితే వారు ఇద్దరు వ్యక్తులై ఏక దేవునిగా అనగా త్రియేక దేవుడుగా మనమెరుదుదుము. అందుకే ఈ క్రీస్తును మనము ఆరాధించవలెనని గ్రంహించాలి. 3. ఆయన శరీరధారి కాకమునుపు వాక్యమై యున్న దేవుడు.
యోహాను క్రీస్తును గూర్చి వాక్యముగా సంభోధిస్తున్నాడు. ఆయన దేనితోను అనగా ఒక శక్తితోనో గాని, లేదా ఒక స్పర్శతోనో గానో, లేక ఆలోచనతోనో గాని సంభోదించలేదు గాని, ఉన్నవాడు అనువాడుగా సమస్తాన్ని తన మాటతో సృష్టించినవాడుగా గమనించాలి. అనగా వాక్యము సృష్టింపబడలేదను సంగతి మనకు అర్ధమవుతుంది.
4. సమస్తాన్ని ఆయన వాక్యము ద్వారా సృస్టించలేదు..
1:3 వ వచనంలో “సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.” ఇక్కడ రెండు ఉద్దేశాలను యోహాను తెలియజేస్తున్నాడు. మొదటిది దేవుడు సృష్టికర్తగా రెండవది ఆయన లేకుండా ఏదియు కలుగలేదని. అనగా సమస్త సృష్టికి ఆయనే కారకుడు గాని ఆయన సృష్టింపబడలేదు అను సంగతిలో ఎట్టి సందేహం లేదు.
మరియు 10వ వచనంలో ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు అను సంగతి మానవులలో ఉన్న గ్రుడ్డితనమును కనుబరుస్తుంది. ఎందుకనగా లోకములో ఉన్న చీకటి లొకేషను కనుగొనలేకపోయారు. అయినప్పటికీ మనకు కలిగిన ఆ శరీరంలోనికి ఆయన వచ్చుటకు ఇష్టపడ్డాడు.
మనం చూసిన వాక్యమే శరీరధారియై అను ఈ సంగతులలో 1) ఆయన క్రీస్తుగా రక్షకుడుగా కనుగొన్నాము, 2) ఆయన దేవుడుగా, త్రిత్వంలో రెండవ వానిగా గమనించాం. 3) ఆయన వాక్యంగా తన్ను తాను సంభోదించుకోవడం గమనించాం. మరియు 4) ఆయన సృష్టింపబడకుండా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తగా తెలుసుకున్నాము.
ఆ వాక్యము శరీరధారియైయుండి; ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. యోహాను 1:4 సమస్త ప్రాణికోటిని తన మాట ద్వారా సృష్టించాడు, అనగా ఆయన మాటలో జీవమున్నది. అనగా ఆ వాక్యములో జీవమున్నది, ఆయనలో జీవమున్నది మరియు ఆ వాక్యముద్వారానే జీవము కలిగినది. అయితే ఈ జీవము మనుష్యులకు వెలుగైయుండెను, అనగా ఆత్మీయ జీవితమునకు కేంద్రీకరిస్తుంది. ఆత్మీయ జీవితంలో బ్రదికియున్నవారు లేదా చచ్చియున్నవారు మరియు ఆత్మీయ గ్రుడ్డితనమ కలిగినవారు. ఈ అంశమును జాగ్రత్తగా గమనిస్తే యోహాను 11:43 ప్రకారం చనిపోయి సమాధి చేయబడిన లాజరుతో “లాజరూ, బయటకు రమ్ము,,” అని పలికాడు. ఆయన మాటలో ఉన్న జీవమునకు ఒక ఉదాహరణ ఇదే. కాని ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను అనగా; చీకటిలో మరణచ్చాయాలో యున్నవారికి ఈ జీవము వెలుగై యున్నది. యోహాను 3:3 లో “అందుకు యేసు.. నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” ఈ నిజమైన వెలుగును మరియు ప్రకాశమానమైన పరలోక పట్టణమును చూచే ధన్యత కేవలం ఆ నిజమైన ఆత్మీయ జీవము కలిగినవారికే అది తగును. అందుకే యేసు క్రీస్తు మనందరికీ మొదట జీవమును తరువాత వెలుగును దయచేయువాడు అని గ్రహించగలం. మరియు ఈ జీవమైయున్న వెలుగును మనుష్యులు చూడలేరు గాని మనమున్న జీవించుచున్న ఆత్మీయ చీకటినుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను నడిపింపజేస్తాడు.
ప్రియ చదువరీ, ఆయన ఈ లోకమును దాని సమస్తమును సృజించినవాడైయుండి మన కొరకు తన్ను తానుగా చీకటిలో ఉన్న మనకొరకు మరణచ్చాయలో ఉన్న మన జీవితములను వెలిగించడానికి వెలుగుగా అవతరిచి శరీరధారియై మన మధ్య నివసించడానికి వచ్చాడు, కాని ఆయనను మనము కనుగొనలేకపోయాము అని పరిశుద్ధ గ్రంథంలో లిఖితము చేయబడియున్నది. అయితే క్రీస్తును కలిగియున్నమనము తన వెలుగు కలిగి ఆయన గుణాతిశయమును పొంది, తనతో నిత్యత్వంలో ఉండే ధన్యత ఆయన మనకొరకు శరీరధారిగా అవతరించెనని తెలుసుకొనుటయే నిజమైన క్రీస్తు పుట్టుక. ఆయన రాకడ వేగిరమై, అందరము సిద్ధపడి నిత్యత్వంలో తనతో ఎల్లప్పుడూ ఉండే కృప ప్రభవు మనందరికీ దయచేయును గాక!.