Skip to Content

Day 99 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవి (ఆది 42:36).


దేవుని ప్రేమించువారికి ... మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము (రోమా8:28).


చాలామంది శక్తిహీనులుగా ఉంటారు. అయితే శక్తి ఎలా వస్తుంది. ఒకరోజు మేము పెద్ద ఫ్యాక్టరీ మీదుగా వెళ్తూ పెద్ద ట్రాలీ ఇంజన్లు విద్యుచ్ఛక్తి ద్వారా పనిచెయ్యడం చూసాము. లోపల ఎక్కడ నుంచో ఎన్నెనో చక్రాలు తిరుగుతూ బ్రహ్మాండమైన రోద చేస్తున్నాయి. మాతో ఉన్న మిత్రుణ్ణి మేము అడిగాము.


"శక్తి ఎలా పుడుతుంది?"


"ఏముంది, ఆ చక్రాలు తిరిగి వాటి రాపిడివల్లనే, అంటే అవి అలా ఒకదానికొకటి రాసుకుంటూ తిరుగుతుంటే విద్యుచ్ఛక్తి పుడుతుంది" అతను జవాబిచ్చాడు.


అలాగే దేవుడు మన జీవితాల్లో ఎక్కువ శక్తి నిండాలని కోరితే ఎక్కువ ఒత్తిడి కలుగజేస్తాడు. రాపిడి ద్వారా మనలో ఆత్మ సంబంధమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంటాడు. కొందరికిది ఇష్టం లేక, ఇలాటి వత్తిడులనుండి పారిపోతుంటారు. ఈ వత్తిడులనాధారం చేసుకుని తమలో పుట్టే శక్తి మూలంగా ఆ శ్రమను జయించాలన్న తలంపు ఉండదు.


వ్యవహారాలు సమతూకంగా జరగాలంటే వ్యతిరేక శక్తులు తప్పనిసరిగా ఉండాలి. ఒక వస్తువు ఒక కేంద్రం చుట్టూ వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం వైపుకి ఆ వస్తువుని ఆకర్షించే శక్తి, కేంద్రం నుంచి దూరంగా నెట్టేసే శక్తి, ఈ రెండు శక్తులూ సమానమైతేనే ఆ వస్తువు అదే దూరంలో అలా తిరుగుతూ ఉంటుంది. ఒక శక్తి ఆకర్షిస్తున్నది, మరొకటి వికర్షిస్తున్నది. ఒకటి చర్య, మరోటి ప్రతిచర్య. ఈ కారణం పల్లనే సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి అనంత శూన్యంలోకి గమ్యంలేని ప్రయాణంలోకి వెళ్ళిపోకుండా తన కక్ష్యలో సవ్యంగా తాను తిరుగుతున్నది.


ఇలానే దేవుడు మన జీవితాలు నడిపిస్తుంటాడు. ఆకర్షించే శక్తి ఎంత అవసరమో వికర్షణ శక్తి కూడా అంతే అవసరం. అందుకే దేవుడు మనల్ని కొన్నిసార్లు దూరంగా ఉంచి శోధన, శ్రమల వత్తిడులలో జీవిత సమస్యలతో పరీక్షిస్తుంటాడు. మనకి వ్యతిరేకంగా కనిపించే సంఘటనలను మన పైకి తెస్తుంటాడు. కాని నిజానికవి మన ఉనికినీ, గమనాన్నీ స్థిరపరచే శక్తులే.


ఈ రెండు రకాల శక్తుల కోసమూ దేవుణ్ణి స్తుతీద్దాము. ఆయన మనకిచ్చిన రెక్కల్నీ, మనపై పెట్టిన బరువుల్నీ కూడా స్వీకరిద్దాము. ఈ విధంగా అదుపులో ఉండి విశ్వాసంతోను, ఓపికతోను పరలోకపు పిలుపుకనుగుణంగా సాగిపోదాము.


కర్మాగారంలో చక్రాలూ యంత్రాలూ తిరుగుతున్నై

కప్పీలు, పట్టీలు ఒకదానితో ఒకటి ఒకదానివెంట ఒకటి

కొన్నిమౌనంగా రంగులరాట్నంలా తిరుగుతున్నై

కొన్ని ముందుకి తన్నుతూ వెనక్కిలాగుతూ గోల పెడుతున్నై

కొన్ని మృదువుగా, కొన్ని మొద్దుగా శబ్దాలు చేస్తున్నై

గొడవచేస్తూ, మూలుగుతూ, గర్జిస్తూ కదులుతూ, కదిలిస్తూ.


దేనిదారిన అది అర్థం కాకుండా, సంబంధం లేనట్టు

ఊగుతూ లాగుతూ, తూగుతూ రేగుతూ

బ్రహ్మాండమైన చక్రంనుండి చిట్టిమేకుదాకా దేని పనిలో అది

అన్నీ కలిపి సాధించే పని ఒకటే, ప్రయోజనం ఒక్కటే.

కదలికలనూ పనులనూ నిర్దేశించే తెలివి ఒక్కటే

యంత్రబలాన్ని క్రమపరిచే హస్తం ఒక్కటే.


దైవకుమారులకి పనులన్నీ సమకూడి జరుగుతున్నై

కొన్ని పనులు బాధిస్తాయి. కొన్ని కష్టపెడతాయి

కొన్ని అడ్డగిస్తాయి కొన్ని వెనక్కి లాగినట్టు కనిపిస్తాయి

కాని అన్నీ మంచి కోసమే కలిసి పనిచేస్తున్నై

తీరని కోరికలూ, చెదరిన ఆశలూ, అర్థంకాని పరిశోధనలూ, శాపాలూ

వీటన్నింటినీ ముందుకీ వెనక్కీ మెల్లిగా వేగంగా

నడిపిస్తూ ప్రయోగిస్తూ చక్రం తిప్పుతూన్న మీట నొక్కుతూ

ఉన్నది మన తండ్రి దేవుడే


Share this post