- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను (2 కొరింథీ 12:10).
ఈ వచనాన్ని ఉన్నదున్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గగుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది. దీని వెనక ఉన్న భావనాశక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు. దీని అర్థం ఏమిటంటే "నాకు బలం లేకపోతే, నన్నెవరన్నా చీటికిమాటికి కించపరుస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే మూలమూలకి తరిమికొడుతూ ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తుకోసం నేననుభవించేటప్పుడు నేను అగ్గిపిడుగుని."
దేవుడు మన పక్షాన ఉంటే మరే కొదువా లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే. మనతోను, మనమున్న పరిస్థితులతోను మనకిక పనిలేదు. ఇలాటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసనిబట్టి, దాద్ర్యాన్నిబట్టి మనుషుల సానుభూతిని కోరము. ఎందుకంటే సాక్షాత్తూ ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకర్థమవు తుంది. ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకి తిరిగి ఇవి మనకి సంభవించినాయి గనుక ఆయన మనకి ప్రతిగా చెయ్యవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురుచూస్తాము.
స్కాట్లాండ్ దేశంలో ఈమధ్య తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్తికుడు జార్జి మాథిసన్ ఓసారి ఇలా అన్నారు, "ప్రభూ నాలో నీవుంచిన ముల్లు విషయం నీకెన్నడూ కృతజ్ఞతనర్పించలేదు. నాకిచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నిన్ను స్తుతించాను. గాని, ముల్లుకోసం ఒకసారి కూడా స్తుతించలేదు. నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురుచూసాను గాని, ఇప్పుడు మోస్తున్న శిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన దీవెన అని గ్రహించలేక పోయాను."
"నీ సిలువ మహాత్మ్యాన్ని నాకు తెలియజేయ్య. నా ముల్లులోని విలువను నాకు తెలియజెప్పు. నా శ్రమల మార్గంలోగుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరుచు. నా కన్నీళ్ళలో వెలిసిన ఇంద్రధనుస్సులను నాకు చూపించు."
ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో
చుక్క తళుక్కుమన్నది
చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది