Skip to Content

Day 97 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఊరకుండుటయే వారి బలము (యెషయా 30:7) (స్వేచ్ఛానువాదం, ఇంగ్లీషు బైబిలు).


దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండడం అత్యవసరం. నేను దీన్ని మొదటిసారి నేర్చుకున్న సందర్భం నాకు గుర్తుంది. ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది. నాలోని అణువణువు ఆందోళనతో కంపించసాగింది. అత్యవసరంగా శక్తి సామర్థ్యాలన్నీ వెచ్చించి ఏదో ఒకటి చెయ్యవలసిన పరిస్థితుల్లో కనీసం కాలు కదపడానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయింది. పరిష్కరించవలసిన వ్యక్తేమో మెదలకుండా ఊరుకున్నాడు.


ఇక నాలో రేగే బడబాగ్నికి నేను ఆహుతి అయిపోతానేమో అన్నంత ప్రమాదం రాగా, నా ఆత్మలోతుల్లో ఒక మెల్లని స్వరం ఇలా పలికింది. "నేను దేవుడినని తెలుసుకుని ఊరికినే ఉండు." ఆ మాటల్లో ఎంతో శక్తి ఉంది. నేను లోబడ్డాను. నా శరీరాన్ని నా ఆత్మను సముదాయించి నిశ్చలంగా స్థిరంగా పైకి చూస్తూ కని పెట్టాను. అప్పుడు నాకు అర్థమయింది అంత అత్యవసర పరిస్థితిలో నా నిస్సహాయతలో దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినది నా దేవుడే అని. ఆయనలో సేదదీరాను. ఎన్ని భాగ్యాలనైనా ఆ అనుభవం కోసం వదిలెయ్యడానికి నేను సిద్ధమే. ఆ నిశ్చలతలో నుండి అత్యవసర స్థితిని కడతేర్చేందుకు ఓ వింత శక్తి పుట్టుకొచ్చింది. అదంతా విజయవంతంగా పరిష్కారమైంది. నా బలం ఊరికినే ఉండడంలోనే ఉందని నేర్చుకున్నాను.


ఇలా నిశ్చలంగా ఉండడమూ, సోమరితనమూ ఒకటి కాదు. ఇది దేవుని పైగల సమ్మకంలోనుంచి పుట్టిన నిశ్చలత. నిశ్శబ్దంగా ఆందోళన చెందడం నమ్మకం కిందికి రాదు. అది కేవలం మూత బిగించిన ఆందోళనే.


విలయతాండవమాడే గాలివానలో కాదు

నాలుకలు చాపే అగ్నిలో, భూకంపంలో కాదు

భయాలు తొలగేది నా నిశ్శబ్దంలోనే

చల్లని మెల్లని స్వరం వినవచ్చేది మౌనంలోనే


దేవునికొండపై ఓ హృదయమా మౌనంగా ఉండుమా

భయాలు మెండుగా, అవసరాలు దండిగా ఉండగా

వాంఛలు, విన్నపాలు వెలుగు నోచుకోక ఉండగా

అండయైన దేవుని నిండు మాటలు ఆలకించుమా


దొరికేను విశ్రాంతి ఆత్మ నిశ్శబ్దంలో

ప్రార్థన, స్తుతి మాటలు ప్రక్కనుబెట్టి

గ్రహించు ప్రేమకి సంపూర్ణ నిర్వచనం

దేవుని చెప్పుచేతలో నీ ఆత్మని పెట్టి


బహుమతి కోసం పాటుబడే ఆటగాడిలా కాక

చిత్తశక్తితో స్వర్గంలోకి చొచ్చుకు వెళ్ళక

పసివానిలా తండ్రి ఒడిలో పవళించు

ఊరకుండడంలోని ఉత్తమత్వం పరికించు


Share this post