Skip to Content

Day 94 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన (చేసెను) (2 రాజులు 6:17).


"ప్రభువా, మేము చూసేందుకుగాను కళ్ళు తెరువు." ఇదే మన గురించీ, ఇతరుల గురించీ మనం చెయ్యవలసిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకి లాగానే మనచుట్టూ ఉన్న ప్రపంచంకూడా దేవుని అశ్వాలతోను, రథాలతోను నిండి ఉంది. మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించడానికి ఎదురుచూస్తున్నాయి. ఇవన్నీ . . . కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైనా, లేనివైనా మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం.


మనకి సంభవించేదేదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకువెళ్ళే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథమవుతుంది. అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలుకూడా మనల్ని భూమిలోకి అణగదొక్కే రథచక్రాలవుతాయి.


వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మనమీదే ఆధారపడి ఉంది. ఆ సంఘటనలు ఏవి అన్నదానిమీద కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాము అన్నదాని మీదే అంతా ఆధారపడి ఉంది. మనం క్రింద పడిపోయి వాటి క్రిందికి వెళ్తే మనమీదుగా వెళ్ళిపోయి మనల్ని అట్టడుగుకి తొక్కేస్తాయి. అలాకాక విజయ వాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకి, పై పైకి తీసుకెళ్ళిపోతాయి. అవే దేవుని రథాలౌతాయి.


చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మకోసం దేవుడు ఏమీ చెయ్యలేడు. అందుకే శత్రువుచేసే మొదటిపని ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లోగానీ, మన సంఘాల్లోగాని నిరాశ నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు. ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళుతూ తప్పకుండా ఓడిపోతామనుకుంటూనే వెళ్తారు.


ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంది. కేవలం ఆవిడ ఆత్మ క్రుంగిపోవడం వల్లనే ఆవిడ ఆస్పత్రిలో చేరవలసి వచ్చింది. ఆవిడ ఆత్మతోబాటు శరీరంకూడా నీరసించి పోయిందట. ఈ విధంగా మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను నేర్చుకుని ఉండాలి. మనమున్న స్థితినుండి శత్రువు మనల్ని క్రిందికి ఈడ్చగలిగితే ఇక మనల్ని క్రమంగా అరగదియ్యడానికి ప్రయత్నిస్తాడు (దానియేలు 7:25). ముట్టడివేసి మెల్లమెల్లగా నీరసింపజేస్తాడు. చివరికి అలిసిపోయి ఓడిపోతాము.


Share this post