Skip to Content

Day 90 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

గాలి యెదురైనందున . . . (మత్తయి 14:24).


పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి. మన జీవితాల్లో వచ్చే తుపానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలులకంటే భయంకరమైనవి కావా? కాని నిజంగా ఇలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సంధ్యాసమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండలోయల్లోనూ ఉండడం కంటే, వర్షాలు కురిసి వరదలు వచ్చేచోట్ల నివసించడం మేలుకదా. శోధనల కారుమేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు. కానీ ఆత్మతీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి అవేకదా, ఇంకా ఆత్రుతతో మనకియ్యబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా.


ఎడబాటులనే తుపానులు హృదయ విదారకమైనవి. అయితే తనవైపుకి మనల్ని మళ్ళించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి. అలలకీ పెనుగాలుల తాకిడికీ నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది.


తుపానులు మనపై విరుచుకుపడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభువు. ఆ తుపానులో మనకి అండగా నిలిచేవాడు. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదాయన. కాని గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది.


పరలోక పవనాలొస్తున్నాయి తెరచాప ఎత్తండి

పెనుగాలులు వీచినా ఆటంకాలొచ్చినా

పొగమంచు పట్టినా గాలివాన కొట్టినా

పయనం దూరమైనా గమ్యం కానరానిదైనా

ఉప్పునీళ్ళ తుంపరలో, సాగరం కక్కే నురగల్లో

సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో


Share this post