Skip to Content

Day 9 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావని యెంచుచున్నాను. (రోమా 8:18).


ఒక సీతాకోకచిలుకకి చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాను. అది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూజా ఆకారంలో ఉంది. దాని మెడ దగ్గర చిన్న రంధ్రం ఉంది. లోపల తయారవుతున్న కీటకం దాన్లోగుండా చీల్చుకొని బయటికి ఎప్పుడో వెళ్లిపోయింది. ఖాళీ ప్యూపాకీ, కీటకం ఇంకా లోపల ఉన్న ప్యూపాకీ ఆకారంలో ఏమీ తేడా లేదు. ఆ రంధ్రం చుట్టూతా ఉన్నా సిల్క్ దారాలు ఏమి తెగిపోయినట్లు గాని, చెదిరినట్టు గాని లేవు. కీటకం సైజుకీ, ఆ రంద్రానికి ఉన్నతేడాని బట్టి చూస్తే అసలు బయటికెలా వచ్చిందా అన్న ఆశ్చర్యం వేస్తుంది. లోపలి కీటకం పడే పాట్లు వర్ణించనలవి కాదు. జీవశాస్త్రజ్ఞులు కనుగొన్నది ఏమిటంటే అంత చిన్న రంధ్రంలో నుండి దూరి బయటికి వస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి ఆ కీటకం శరీరంలోని జీవ ద్రవాలు దాని రెక్కల్లోని నాళాల్లోకి వెళ్తాయట. ఎందుకంటే ఆ జాతికి చెందిన కీటకాల్లో అప్పటిదాకా రెక్కలు సరిగా తయారు కావట. ఆ ద్రవాలు లెక్కల్లోకి ప్రవహించే దాకా ఆ రెక్కలు ఎగరటానికి పనికిరావట.



నా దగ్గర ఉంచుకున్న ఆ ప్యుపాలో నుండి కీటకం చెరలోనుండి బయటపడ్డట్టు బయటికి రావడాన్ని నేను చూశాను. ఓ మధ్యాహ్నం అంతా అప్పుడప్పుడు అటు ఒక కన్నస్తూ దాన్ని గమనించాను. అది ఓపికగా పాటుపడుతూ, పెనుగులాడుతూ బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎంత కష్టపడినా అంగుళమైనా బయటికి పడినట్టు అనిపించెది కాదు. చివరికి నాకు విసుగెత్తింది. బహుశా రంధ్రం చుట్టూ ఉన్న దారాలు పొడిగా ఉండడంచేత సాగడంలేదేమో. నేను ఆ ప్యూపిని చెట్టు మీదే ఉంచినట్టయితే ఆ దారాలకి కాస్త చెమ్మ తగిలి రబ్బరులాగా సాగేవేమో. నేనే దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి దాని సహజమైన సాగే గుణాన్ని చెడగొట్టానేమో అనుకొని ఆ రంధ్రాన్ని వదులు చేద్దామనుకున్నాను. దాని సృష్టికర్తకంటే ఎక్కువ జ్ఞానం, జాలి నాకే ఉన్నట్టు దానికి సహాయం చేద్దామనుకున్నాను. ఒక చిన్న కత్తెర తీసుకొని అది కాస్తంత తేలికగా బయటికి రావడానికి వీలుగా ఆ రంధ్రం అంచును కొద్దిగా కత్తిరించాను. చూస్తుండగానే హాయిగా, తేలికగా ఆ కీటకం తన ఉబ్బిన శరీరాన్ని ఈడ్చుకుంటు బయటికి వచ్చేసింది. దాని రెక్కలు మాత్రం కృశించిపోయి చిన్నచిన్న చింతలాకులంత ఉన్నాయి. ఆ జాతి కీటకాల రెక్కలు వెడల్పుగా ఇంద్రధనస్సు రంగులలో మెరిసిపోతూ ఉంటాయి. ఆ రెక్కలు విచ్చుకుంటాయని, మీరుమిట్లు గొలిపే ఆ రంగులు అలరిస్తాయని నేను ఆ కీటకం వంక ఆతృతగా చాలాసేపు చూశాను.



ఆ రంగులన్నీ ఉన్నాయి గాని కంటికికనిపించని చిన్న చిన్న బొట్లుగా ఉన్నాయి. నేను అనవసరంగా కల్పించుకుని ఆ రంగులన్నీ పూర్తిగా రూపుదిద్దు కోకుండా చేశాను. కీటకాన్ని అలా బయటికి రప్పించడం గర్భస్రావంలాంటిది తప్ప మరేమీ కాదు. అది ఆకాశ వీధుల్లో రెక్కలార్చి ఎగిరిపోవలసింది. దయనీయంగా నా ఎదుట నేలమీద కాసేపు పాకింది, అంతే.


బాధలో, చిరాకులో, దుఃఖంలో, అయోమయంగా తిరుగులాడుతూ ఉండేవాళ్ళని చూస్తూ దీన్నిగురించి నేను చాలాసార్లు ఆలోచించాను. క్రమశిక్షణను కత్తెరతో కత్తిరించేసి పూర్తిబలం తెచ్చుకునే అవకాశాన్ని జారవిడుచుకుంటారు దూరదృష్టి లేని మనుషులు. కాసేపు ఉండి అంతరించిపోయే బాధను మనల్ని ప్రేమించే ముందుచూపు గల జ్ఞానవంతుడైన దేవుడు మనకోసం సిద్ధంచేస్తే, మనం దాని నుండి మొహం చాటేసి అవిటివాళ్ళుగా మిగిలిపోతాము. మన తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడు గనుకనే తన పరిశుద్ధతలో వాళ్లు పాలుపంచుకోవాలని వాళ్లని శిక్షకు గురిచేస్తాడు. ఆయన పథకం ప్రకారం మన అంతం మహిమకరమై ఉంటుంది. అందుకనే వాళ్లు ఏడ్చి గోలపెట్టిన ఆయన చలించడు. మనం శ్రమల మూలంగా మచ్చలేని వాళ్లంగా అవుతాము దేవుని పిల్లలు విధేయత అనే శిక్షణ పొంది, శ్రమలద్వారా మహిమలోకి ప్రవేశిస్తారు.


Share this post