- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతివలన ఇది మీకు
కలుగుచున్నది. మీరు వేదనగలవారై పండుకొనెదరు (యెషయా 50:11).
చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక! అగ్నిని రాజబెట్టి కొరువులని తమచుట్టూ పెట్టుకున్నట్టుగా వీళ్ళ గురించి వర్ణించబడింది. దీని అర్థం ఏమిటి?
తమచుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెదుకులాడుతున్నారనే గదా దీని భావం. దేవుడి సహాయాన్ని తోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవడమే ఈ వాక్యంలోని అర్థం. ప్రకృతి సంబంధమైన కాంతిని వెదుకుతాము. స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాము. మన తర్కజ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకొంటాము. ఇబ్బందులనుండి తప్పించుకోవడానికి ఏ దారీ కన్పిస్తే ఆ దారిలో పరుగెడదామని చూస్తుంటాము. అది దేవుడికిష్టమైన మార్గమా కాదా అని చూడము.
ఇవన్నీ మనం స్వంతంగా రాజబెట్టుకున్న అగ్ని జ్వాలలు. మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు. ఈ కోరువుల వెలుగు సాయంతో నడవదలచు కుంటే దేవుడేమీ అడ్డు పెట్టడు. అయితే దాని ఫలితం దుఃఖమే.
ప్రియులారా, దేవుడు నిర్దేశించిన సమయంలో, నిర్దేశించిన విధానంలో తప్ప చీకటిలోనుడి బయటపడడానికి పెనుగులాడవద్దు. కష్టకాలాలకు ఓ ప్రయోజనం ఉంది. మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి.
కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మనపట్ల సిద్దం చేసిన కృపాపథకాలు వీగిపోయే ప్రమాదం ఉంది. మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవడమే. ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంతకాలం చీకటిలోనే నిలిచి ఉండడానికి మనకి అభ్యంతరం ఎందుకుండాలి? గుర్తుంచుకోండి. ప్రభువు లేకుండా వెలుగులో నడవడంకంటే ప్రభువుతో చీకట్లో ఉండడమే మేలు.
దేవుని అంచనాలతోను ఆయన చిత్తంతోను చెలగాటాలాడవద్దు. ఆయన చేస్తున్న పనిలో మనం వ్రేలు పెడితే ఆ పని అంతా పాడైపోతుంది. గడియారం ముల్లును మన ఇష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చు. కాని కాలం మాత్రం తిరగదు కదా. దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలనుబడుతుంది. గులాబి మొగ్గను చేతులతో తెరువవచ్చు. కాని పువ్వు వికసించదు, సరికదా వాడిపోతుంది. అంతా దేవునికి వదలండి. చేతులు ముడుచుకుని కూర్చోండి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నాదేమీ లేదు.
అయన మార్గం
చల్లని నీడలు పరుచుకున్నాయి
ఆగి విశ్రమిద్దామంటే ప్రభువు సాగమన్నాడు
ముందుకి సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూసాను
గండ శిల దొర్లి పడింది ఆగాలనుకున్న చోట
ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు
జాగులేక సమ్మతించి ఆగిపోయాను
సాగవలసిన బాటలో పడుకుని ఉంది
పగబట్టి బుసలు కొడుతున్న కోడెత్రాచు
దైవాజ్ఞకి కారణాలడగనిక
నా దారి, నా గమ్యం నావి కావిక
క్షేమపు దారుల్లో నడిపించే
మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమి లెక్క?