Skip to Content

Day 84 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము

దయచేయువాడనియు నమ్మవలెను గదా (హెబ్రీ 11:6). ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం! నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడినాయి. చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే. దాన్లోని కీర్తనల్లో భావం ఇదే. ప్రమాదాలు ఇలాటి రోజుల గురించే. ఎన్నో సత్యాలు వెలికిరావడానికి కారణాలు ఇలాటి సమయాలే.


ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది. మనిషికి జ్ఞానబోధ చెయ్య డానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది. 107వ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇశ్రాయేలీయులు చేసిన ఉత్సాహగానం రాయ బడింది. ఆపదలో చిక్కుకుని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరాళమయ్యేది. ఎక్కడ చూసినా ఇవే కథలు. ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలు పెట్టింది. జవసత్వా లుడిగిపోయి మృతతుల్యులైన ముసలి జంటకి ఎలాటి వాగ్దానమో చూడండి. నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగానూ, సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువుల్లాగానూ అవుతుంది! ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయుల రక్షణ, యొర్దాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తరువాత, నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి. కష్టాలతో క్రుంగిపోయి, ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఆసాయెహోషాపాతుహిజ్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి. నెహెమ్యాదానియేలుహబక్కూకు, హో షేయల చరిత్ర నెమరువెయ్యండి. గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి. అరిమతయి యోసేపుకి చెందిన తోటలోని ఆ సమాధిచెంత కాసేపు నిలుచోండి. ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి. వాళ్ళ కష్టకాలాల గురించి అపోస్తలుల్ని అడగండి.


నిరాశతో చతికిలబడడం కంటే తెగింపు, గుండెనిబ్బరం ఉత్తమం. విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు. నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని..


బబులోనుకి చెరపట్టబడిన ముగ్గురు యూదా కుర్రవాళ్ళు ఇలాటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కన్పిస్తున్నారు. అది ఎటూ తోచని పరిస్థితి. అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకి జవాబిచ్చారు. "మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్ని గుండంనుండి మమ్ములని కాపాడగల సమర్థుడు. నీ చేతిలోనుండి మమ్మల్ని తప్పిస్తాడు.


ఒకవేళ ఆయన అలా చెయ్యకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో నీ దేవతలకిగాని, నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకిగాని మేము సాష్టాంగపడము"


"ఒకవేళ ఆయన అలా చెయ్యకపోయినా..."అనడం ఎంత బావుంది! ఈ భాగం నాకు ఎంతో నచ్చింది.


గెత్సెమనే గురించి కాస్త ధ్యానిద్దాము. "అయినను, నీ చిత్తమే సిద్దించును గాక" అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి. "సాధ్యమైతే... అయినను" మన ప్రభువు అంతరంగంలో చిమ్మచీకటి. విధేయత అంటే ఏమిటో తెలుసా? రక్తం కారేంత వరకు శ్రమ. పాతాళకూపంలో దీగినంత చీకటి ఎదురైనా, "ప్రభువా నా ఇష్టప్రకారము కాదు, నీ చిత్తమే కానిమ్ము" అనగలగడం. కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాసగీతాన్ని ఆలపించండి.



చెరసాల గోడల్లాగా

ఆపదలు, ఆటంకాలూ అడ్డు పడితే

చేయగలిగినంత చేసి నేను

చేతకానిది నీకు వదిలేను


అవరోధం పెరిగి అవకాశం తరిగి

ఆవేదన వలలో నేనల్లాడుతుంటే

అసహాయతలో ఓ చిన్ని ఆశాదీపం

అనుగ్రహింప వస్తావని చూస్తోంది నీకోసం


Share this post