- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
అప్పుడు యాకోబు - నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా - నీ దేశమునకు, నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా . . . దయచేసి నన్ను తప్పించుము (ఆది 32:9,11).
ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి. మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలిమిలో కరిగించి ఇలాటి ప్రార్ధన మూసలో పోయాలి.
యాకోబు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఉదహరించడంతో మొదలుపెట్టాడు ప్రార్థనని.నువ్వు మాట ఇచ్చావుకదా అని రెండుసార్లు ఈ ప్రార్ధనలో అన్నాడు. ఇలా అనడంలో దేవుణ్ణి బుట్టలో వేసుకున్నట్టే అయింది. తన వాగ్దానాల ద్వారా దేవుడు మన అందుబాటులో ఉంటాడు. "దేవా నువ్వే అన్నావు కదా" అని మనం ప్రార్థిస్తే ఆయన కాదనలేడు. తాను మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చవలసిందే. హేరోదు రాజే తాను ఇచ్చిన మాటకి కట్టుబడి యోహాను తల నరికించాడు కదా. ఇక దేవుడు మాట తప్పడం ఎలా సాధ్యం? మనకి ఒక నిర్దిష్టమైన వాగ్దానం దొరికేలా ప్రార్థించాలి. ఇంక దాన్ని చేతబట్టుకుని పరలోకద్వారాలను కూడా బద్దలుకొట్టే శక్తి సంపాదించుకోవచ్చు.
మన విజ్ఞాపనలు సూటిగా ఖచ్చితంగా ఉండాలి. ప్రత్యేకమైన విషయాల గురించి మనం ప్రార్థించాలని దేవుని అభీష్టం. శ్రమల భారాన్ని మోసుకుంటూ ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన ప్రశ్నిస్తాడు. "నేను నీకొరకు ఏమి చెయ్యాలనుకుంటున్నావు?" దేవుని నుండి ఖచ్చితమైన జవాబు రావాలని నువ్వు కోరుకుంటే నీ ప్రార్థనకూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థనలకు జవాబు రావడం లేదని దిగులు పడుతుంటాము. మన ప్రార్థనలు డొంక తిరుగుడుగా ఉండడమే దీనికి కారణం. నీక్కావలసిందేమిటో స్పష్టంగా అడగాలి. ఖాళీ బ్యాంకు చెక్కు నీ దగ్గర ఉంది. నీకు కావలసిన మొత్తం దాన్లో నింపి, పూర్తి చేసి, యేసు పేరిట దాన్ని పరలోకంలో ఇచ్చి నీకు కావలసినంత మొత్తాన్ని పొందు. దేవునితో వ్యవహరించడం నేర్చుకో.
మిస్ హోవర్గల్ అనే భక్తురాలు ఇలా అంది - "నా జీవితకాలంలోని సంవత్సరాలన్నింటిలో, ప్రతి దినమూ ఒక విషయం మరీమరీ తేటతెల్లం అవుతుంది. అదేమిటంటే దేవుని మాటను గురించి శంకలు లేకపోవడమూ, ఆయన అన్న మాటలను తప్పక నెరవేరుస్తాడని నమ్మడం, తన నీతిని, కృపను కనపరిచే ఆయన పలుకులను స్వీకరించడం, ఆయన వాగ్దానాలను ప్రతి అక్షరమూ యథాతథంగా నమ్మి నిరీక్షించడం. ఇవే క్రైస్తవ జీవితంలో గోచరమయ్యే శక్తి ఉత్సాహాల వెనుక ఉన్న రహస్యాలు.
క్రీస్తు మీకిచ్చిన మాట, వాగ్దానం, ఆయన మీకోసం చేసిన త్యాగం, ఆయన రక్తం, వీటన్నిటినీ వెంట తీసుకువెళ్ళండి, పరలోకపు ఆశీర్వాదాలు మీకు దక్కకుండా ఎవరు కాదంటారో చూద్దాం!