Skip to Content

Day 81 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను . . . ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను (అపొ.కా 7:30,34)


నలభై సంవత్సరాలు! మోషేకి అప్పగించబడిన పని అంత కష్టతరమైనది గనుకనే అన్ని దీర్ఘ సంవత్సరాలు వేచియుండవలసివచ్చింది. *దేవుడు ఆలస్యం చేస్తున్నాడనుకుంటాం గాని మన విషయంలో ఆయన సోమరిగా ఉండలేడు. తన పనిముట్టులను పదును పెడుతున్నాడు. మన శక్తిని పరిపక్వం చేస్తున్నాడు. సమయం ఆసన్నమయ్యే సరికి మనకప్పగింపబడినదాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకి వస్తుంది. నజరేయుడైన యేసు సైతం ముప్పై యేళ్ళు చేతులు ముడుచుకుని కూర్చున్నాడు. తన పనిని ప్రారంభించబోయే ముందు జ్ఞానంలో ఎదుగుతూ.


దేవుడు హడావుడీ పడడు. తాను బలంగా వాడుకోదలచినవాళ్ళని సంవత్సరాల తరబడి అలా ఉంచుతాడు. ఆయన దృష్టిలో ఈ కాలం చవి,సారం లేనిది కాదు.


బహుశా మనకి సంభవించే శ్రమల్లో అతి భయంకరమైన భాగం కాలమేనేమో. అనుకోకుండా ఒక్కసారి సంభవించి చల్లబడిపోయే బాధని భరించడం తేలికే.

కానీ సంవత్సరాల తరబడి భారంగా ఒక దిగులు మనసుని అలుముకుని కొనసాగితే, ప్రతి నిత్యమూ అదే ఆవేదన, అదే గుండెల్ని పిండిచేసే గుబులు, వదలకుండా పీడిస్తే అంతకన్న నరకం మరోటి లేదు. హుషారు చచ్చిపోతుంది. దేవుని కృప తోడుగా లేకపోతే నిరాశ నిస్పృహల అధఃపాతాళానికి కృంగిపోతాము. యోసేపు, ఈ దీర్ఘమైన శ్రమకి లోనయ్యాడు. ఎర్రగా కాలిన ఇనుముతో చర్మంపై వాత పెట్టినట్టు ఒక్కోసారి దేవుడు తన శిక్షను ఇలా సుదీర్ఘమైన బాధ ద్వారా మన అంతరాళాల్లో ముద్రిస్తాడు. వెండి పరిశుభ్రపరిచేవాడిలా, పుటం వేసేవాడిలా ఆయన పనిచేస్తాడు. కరిగిన బంగారంలో తన ప్రతిబింబాన్ని చూడగానే కంసాలి మంటని ఎలా ఆర్పివేస్తాడో, అలానే దేవుడు మనలో తన పోలిక కనిపించగానే మన కష్టాలకు స్వస్తి చెప్తాడు. తన గుప్పిటలో ఆయన దాచి ఉంచిన దివ్య సంకల్ప ఫలాలను మనం ఇప్పుడే చూడలేకపోవచ్చు. ఇంకా కొంతకాలం మనకవి అర్థం కాకపోవచ్చు. కాని ఆయన సింహాసనాసీనుడై తగిన కాలం కోసం ఎదురుచూస్తున్నాడు. "అంతా మన మేలుకే జరిగింది" అంటూ ఆనందంతో మనం కేరింతలు కొట్టే ఘడియ వస్తుంది. ఈ బాధనుండి విముక్తి ఎప్పటికి అని ఎదురు తెన్నులు చూడక, యోసేపులాగా దుఃఖపు బడిలో పాఠాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రతి పాఠాన్ని విధిగా కంఠస్థం చెయ్యాల్సి ఉంది. మనం పూర్తిగా సిద్దపడినప్పుడు విముక్తి తప్పకుండా వస్తుంది. కాని ఆ తరువాత ఉన్నతమైన స్థానంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కష్టకాలంలో మనం నేర్చుకున్నవన్నీ ఎంత ఉపయోగిస్తామో తెలిసి వస్తుంది. భవిష్యత్తులో ఇంకా మహత్తరమైన బాధ్యతలు, ఉత్కృష్టమైన దీవెనలు మనకివ్వడం కోసం దేవుడు మనకి శిక్షణనిస్తున్నాడు. సింహాసనానికి తగిన లక్షణాలు మనలో ఉన్నట్టయితే దేవుడు నిర్దేశించిన సమయం వచ్చినప్పుడు మనల్నేదీ అడ్డగించ లేదు. కాలాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. మీకు తన చిత్తాన్ని తెలియజేసేంతవరకూ ఓపికగా కని పెట్టండి. అవసరమైన దానికంటే ఎక్కువ ఆలస్యం చెయ్యడాయన. ఎదురుచూడడం నేర్చుకోండి.


చెయ్యడు దేవుడు జాగు

తెలుసాయనకు మన బాగు

ప్రభువాగమనం కోసం

వ్యర్థంగా చూపకు ఉక్రోషం


ఎదురుచూడు!

విసుగులేకుండా

కడుపులో చల్ల కదలకుండా


దేవునికంటే ముందు పరుగెత్తాలని ఆత్రుత పడకండి. దేవుని గడియారంలో గంటలముల్లు, నిమిషాల ముల్లు కూడా సరైన కాలం చూపించేదాకా వేచి యుండడం నేర్చుకోండి.


Share this post