Skip to Content

Day 73 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మోషేదేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా . . . (నిర్గమ 20:21).


జ్ఞానులనుండి, తెలివితేటలు గలవాళ్ళనుండి దాచిపెట్టిన రహస్యాలెన్నో దేవుని దగ్గర ఉన్నాయి. వాటి గురించి భయం అవసరం లేదు. నీకర్థంకాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు. సహనంతో కనిపెట్టు. తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లిమెల్లిగా బోధపరుస్తాడాయన. ఆ రహస్యాల్లోని మహిమైశ్వర్యాలను కనపరుస్తాడు. రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డుతెర.


నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు. ఎందుకంటే దాన్లో దేవుడున్నాడు. ఆ మేఘం అవతలివైపంతా ప్రకాశమానమైన తేజస్సు.


"మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహా శ్రమలను గూర్చి మీకేదో యొక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై యున్నంతగా సంతోషించుడి."


మబ్బు మీపై కమ్ముతూ ఉందా

మెరుపులతో భయపెడుతూ నల్లగా

పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా

ఆకాశాన్ని చీకటి చేసే నీడగా

ఉన్నకొద్దీ చిమ్మచీకటి కమ్ముతూ

నీ గుండెల్లో గుబులు పుట్టిస్తూ

నీపై చిక్కని కారు చీకటి నీడ పరుస్తూ

వచ్చేస్తుందా మేఘం?

దేవుడొస్తున్నాడు దాన్లో!


మబ్బు నీపై కమ్ముతూ ఉందా

యెహోవా విజయరథం అది

అగాధాల మీదుగా నీకోసం పరుగులెత్తుతోంది.

ఆయన చుట్టూ కప్పుకున్న నీలి శాలువా అది

మెరుపులు ఆయన నడికట్టులే

ఆయన తేజస్సుకి ముసుగే అది

జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని

దేవుడొస్తున్నాడు దాన్లో!


మేఘం నీపై కమ్ముతూ ఉందా

నిన్ను కృంగదీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా

చీకటి శోధన చరచర దూసుకువస్తూ ఉందా

తెలియని మసక మబ్బు తేలివస్తూ ఉందా

అర్థం గాని అవాంతరం అలలా పడుతూ ఉందా

సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం

దేవుడొస్తున్నాడు దాన్లో!


మబ్బు నీపై కమ్ముతూ ఉందా?

రోగం, నీరసం, ముసలితనం, మరణం

నీ తుది ఊపిరినాడు చెదిరిపోతాయన్న

దారిని పొగమంచు మూసి

తీరం తెలియకుండా చేసే కారుమబ్బు

అనతికాలంలోనే స్వర్ణకాంతితో అలరారుతుంది

దేవుడొస్తున్నాడు దాన్లో!


ఒక భక్తుడు రాకీ పర్వత శిఖరంపై నిల్చుని క్రింద లోయలో చెలరేగుతున్న తుపానుని చూస్తున్నప్పుడు ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకుని పైకి వచ్చింది. సూర్యుని దిశగా పైపైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్షబిందువులు వజ్రాల్లాగా మెరిసాయి. ఆ తుపాను రాకపోయినట్టయితే ఆ డేగ లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది. జీవితంలో మనకెదురయ్యే బాధలే మనం దేవుని వైపుకి ఎక్కిపోవడానికి కారణాలవుతాయి.


Share this post