Skip to Content

Day 72 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి (ప్రకటన 15:3-4).


ఇరవై ఐదేళ్ళకి పైగా బాధలననుభవించిన శ్రీమతి చార్లస్ స్పర్జన్ గారు ఈ విషయాన్ని చెప్పింది.


ఒక రోజంతా సూర్యుడు కనబడకుండా మసక చీకటిలోనే గడిచిపోయింది. రాత్రి అయింది. నేను విశ్రాంతిగా పడుకొని ఉన్నాను. వెచ్చని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ బయటున్న చీకటి కొంత నా ఆత్మలోకి ప్రవేశించి దాని దృష్టి మందగించినట్టు అనిపించింది. నా చేతిని నిరంతరమూ పట్టుకుని ఉంటుందనుకున్న చేయి కోసం వ్యర్థంగా తడుములాడాను. పొగమంచు కప్పిన బాధల బురద బాటలో నన్ను నడిపించే తోడు కోసం వెదికి అది దొరకక నా హృదయం మూలిగింది.


తన సంతానంతో దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు? అప్పుడప్పుడూ నా చెంతకి ఈ పదునైన చేదు బాధను ఎందుకు పంపిస్తున్నాడు? ఆయన బిడ్డలకు నా చేతనైనంత సేవ చెయ్యాలని తహతహలాడే నాలో ఈ బలహీనతలను దీర్ఘకాలం ఎందుకు ఉండనిస్తున్నాడు.


ఈ చిరాకైన ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరికింది. ఆ భాష చాలా కొత్తగా ఉంది. కాని నా గుండెల్లో వినిపించే గుసగుసలకు ఏ అనువాదకుడూ అక్కర్లేదు.


చాలాసేపు నా గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఉన్నట్టుండి ఒక మెల్లని తియ్యని మృదుస్వరం, చిన్న పక్షి మంద్రస్వరంతో పాడుతున్నట్టు వినిపించింది.


ఏమై ఉంటుంది? ఏదో పక్షి నా కిటికీమీద వాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను.


మళ్ళీ ఆ కోమల సంగీతం వినవచ్చింది. వీనుల విందుగా ఆహ్లాదపరుస్తూ, మనసుకి అర్థం కాకుండా.


అది ఆ ప్రక్కనే మండుతున్న కట్టెల్లోనుండి వస్తోంది! ఎండిన కట్టెల్లో ఎన్నోఏళ్లుగా బందీగా ఉన్న స్వరాలను మంటలో పుట్టిన వేడిమి బయటికి తెస్తున్నది.


ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దాచి పెట్టుకుందేమో.కొమ్మల మీద పక్షులు కిలకిలలాడినప్పుడు, ఆకుల్ని బంగారు రవి కిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దాన్లో నిండిందేమో. ఇప్పుడా కట్టె ముసలిదైపోయింది. లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ళ పెరుగుదల వలయాలు వలయాలుగా పెరిగి మూసేసిందేమో. ఆ రాగాలన్నీ లోపలెక్కడో పూడుకు పోయాయేమో. కాని అగ్ని తన నాలుకలు చాచి దాని కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లోనుండి ఆ పాట చీల్చుకుని బయటికి వచ్చింది.

త్యాగ గీతికగా వినిపించింది. నేననుకున్నాను. "శ్రమల అగ్ని జ్వాలలు మనలోని స్తుతి పాటల్ని వెలువరించినప్పుడు నిజంగా మనం శుద్ధులమవుతాము. మన దేవుడు మహిమ పొందుతాడు".


మనలో చాలామంది ఈ కట్టెలాంటి వాళ్ళమే. కఠినంగా, ఏ అనుభూతి లేక బండబారి ఉన్నామేమో. మనలోనుంచి వీనులవిందైన సంగీతం వినిపించాలి. మనచుట్టూ రగిలే ఈ మంటలే మనలో మోగే విధేయత పాటల్ని వినిపించేలా చేసేవి.


నేనిలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది. నా ఎదుట జరిగిన ఆ ఉపమానం నన్నెంతో ఊరటపరిచింది.


అగ్ని జ్వాలల్లో గీతాలాపన. అవును దేవుడు సహాయపడుతున్నాడు. మొద్దుబారి పోయిన గుండెల్లోంచి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గమయితే ఈ అగ్ని గుండం ఇంకా వేడిగా చెయ్యనియ్యండి.


Share this post