- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
నీవు క్రిందికి చూచెదవు (పరమ 4:8)
కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి.ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు కాని ఇది ధన్యకరమైన సత్యం. దావీదు తన కష్టసమయంలో ఆక్రోశించాడు. "ఆహా! గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెన్ముదిగా నుందునే!" (కీర్తన 55:6). కానీ ఈ ధ్యానాన్ని అతడు ముగించకముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు. "నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును" అంటున్నాడు.
"భారము" అనే మాటకి ఒక బైబిల్లో "యెహోవా నీకు ఇచ్చినది" అనే అర్థం కనిపిస్తుంది. పరిశుద్దుల భారాలు దేవుడిచ్చినవే. యెహోవా మీద ఆనుకోవడానికి వాళ్ళనవి ప్రేరేపిస్తాయి. ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పుచెంది రెక్కలుగా మారిపోతుంది. రెక్కలొచ్చి పరిశుద్ధులు పక్షిరాజుల్లాగా ఎగిరిపోతారు.
ఒక రోజున నాకు దాపురించిన కష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళ్తున్నాను. కారుమేఘాల్లోంచి వర్షం చిందినట్టుగా నా మీదికి దూకబోయే బాధల్ని తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేసింది. "అయ్యో పాపం! నీ మీద ఎన్ని బరువు బాధ్యతలు! నీ జీవితం బాధల మయం. ఈ భారం నిన్నెప్పుడో నేలకి అణచివేయ గలదు." నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది. సూర్యుడు మలమలా మాడ్చేస్తున్నాడు. వేగంగా వెళ్తున్న కార్లు రేపే దుమ్ము, అవి చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని మరింత చిరాకు పెట్టాయి. మనసంతా అలసటగా, అశాంతిగా ఉంది.
"అవును, ఈ భారం నన్నెప్పుడో హఠాత్తుగా మింగేస్తుంది. నాలాటి బలహీనుడికి ఇంత పెద్ద బరువులుండడం అన్యాయం" అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా ఎక్కడినుంచో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది "ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందేగాని అణగదొక్కదు." వెంటనే నా పొరపాటు నాకు అర్థమైంది. నా స్థానం ఎప్పుడూ ఈ భారానికి పైనే ఉంటుంది. నేను దాన్ని మొయ్యడం దేవుని ఉద్దేశం కాదు. అదే నన్ను మొయ్యాలి. ఆయన సంకల్పిస్తూ ఉన్నప్పుడే నా శక్తి సామర్ధ్యాలు ఆయనకి తెలుసు. చిన్న మొలక పెరగాలంటే, నీరు, వెలుతురు అవసరం. తన పిల్లలికి కూడా తన కృప, శక్తి అవసరం అని ఆయనకి తెలుసు. ఆ మొలకని తానే అక్కడ నాటాడు. మీద పడిన భారం కింద నలిగి నేల వాలితే చనిపోయినట్టే. కాని ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవం, శక్తి లభ్యమవుతాయి. మన భారాలే మన రెక్కలు. వాటితో మనం కృపా లోకాల అంచులకి ఎగిరిపోతాం. అవి లేకపోతే ప్రారంభ దశలోని విశ్వాసంతోనే ప్రాకులాడుతూ తడుములాడుతూ ఉంటాము.
పరలోకపు విధానాలు ఎంత విచిత్రమైనవి! మనల్ని అణగదొక్కుడానికి వచ్చాయనుకున్న భారాలు మనల్ని లేవనెత్తడానికేనట. కాబట్టి నా ఆత్మ ఎప్పటికీ కృంగిపోదు. కాని ఏ శక్తితో మనమీ ఔన్నత్యాన్ని చేరుకోగలం? ఆయన వాక్యంలోనే చిక్కుముడి విప్పే జవాబు ఉంది. క్రీస్తుతో ఏకాంతంగా మన భారాలపై ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి.