Skip to Content

Day 58 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యాకోబు ఒక్కడు మిగిలిపోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను (ఆది 32:24)


ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి! కొందరికి ఒంటరితనం, చింత గుర్తొస్తాయి. కొందరికి ప్రశాంతత, విశ్రాంతి స్ఫురిస్తాయి. దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి! కాని దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారు పేరు. దేవునికి చెందినవాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే, గతంలో లాగా ఈ కాలంలో కూడా ఆత్మలో వీరులైనవారు మనకి ఉంటారు.


మన ప్రభువే మనకి మాదిరి. దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి. "మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించండి" అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనముంది.


ఏలీయాఎలీషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి. యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడయ్యాడు. మనం కూడా కాగలం. దేవుడతణ్ణి దర్శించినప్పుడు యెహోషువ ఒంటరిగా ఉన్నాడు (యెహోషువ 1:1). గిద్యోనుయెఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇశ్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది (న్యాయాధి 6:11; 11:29). అరణ్యంలో మండే పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు (నిర్గమ 3:1-5). దేవదూత కొర్నేలి దగ్గరకి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు (అపొ.కా. 10:2). పేతురు అన్యుల దగ్గరకి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దెమీద అతనితో ఎవరూ లేరు. బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు (లూకా 1:8). ప్రియ శిష్యుడైన యోహాను పత్మసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు (ప్రకటన 1:9).


దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి. మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకి ఆశీర్వాదకారణంగా ఉంటాము. ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరచుకోవడం కాకుండా ఇతరులకి దీవెనలందకుండా చేసిన వాళ్ళమవుతాము. ఒంటరి ప్రార్థనలవల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు. అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది. ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు.


ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు.


మౌనంగా ప్రభు సన్నిధిని

ఎన్నికైన భక్తులు ఏకాంతాన

ధ్యానించక పోతే

ఎంత చేసినా సఫలం కావు

ఎంచదగ్గ దైవకార్యాలు


Share this post