- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
సహాయం చేయుటకు నీకన్న ఎవరు లేరు (2 దిన14: 11).
దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకి గుర్తు చెయ్యండి. నువ్వు తప్ప సహాయం చేసే వాళ్ళు మరెవరూ లేరు. వెయ్యీ వేలమంది ఆయుధాలు ధరించిన సైనికులు, మూడువందల రథాలు అతనికి (ఆసాకు) ఎదురై నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదుట తనకై తానూ నిలవడం అసాధ్యం. అతనికి సహాయంగా ఇతర సైన్యాలేవీ రాలేదు. అందువల్ల అతనికున్న ఒకే ఒక నిరీక్షణ దేవుడే. మీ జీవితంలో కష్టాలన్ని ఒక్కపెట్టున కలిసికట్టుగా వచ్చిపడితే, చిన్నచిన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి ఇతరుల సహాయం తీసుకున్నట్టు ఇప్పుడు కుదరదు, సర్వశక్తిమంతుడైన ఆ పరమ స్నేహితుడే మనకి ఆ సమయంలో దిక్కు.
నీకు, నీ శత్రువుకు మధ్య దేవుణ్ణి పెట్టు. ఆసా విశ్వాసం ఎలాంటిదంటే జెరహుకూ (కోషు దేశపు రాజు), తనకు మధ్యలో దేవుడు నిలబడినట్టుగా అతనికి అనిపించింది. ఇది యదార్థమే. కుషీయులు "యెహోవా భయముచేతను, ఆయన సైన్యపు భయముచేతను పారిపోయారు" అని రాసి ఉంది. ఇజ్రాయేలువారి పక్షంగా పరలోకపు సైన్యాలు వాళ్ళ శత్రువుల మీద విరుచుకుపడి అంత గొప్ప సైన్యాన్ని ఊచకోత కోశారేమో అన్నట్టుగా ఉంది. ఇశ్రాయేలీయులు కేవలం వాళ్ళని తరిమి దోచుకోవడం మాత్రమే చేశారు. మన దేవుడు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా, ఊహించలేని రీతిగా ఏ సమయంలోనైనా తన ప్రజలను ఆదుకోవడానికి వస్తాడు. నీకు, నీకు వచ్చిన కష్టానికి మద్యన ఆయన ఉన్నాడని నమ్ము. నిన్ను కంగారుపెట్టే ఆ కష్టం గాలికి మేఘాలు కదిరిపోయినట్టు ఆయన ఎదుట నుండి పారిపోతుంది.
దేనికైనా ఆనుకునే ఆధారం కరువైతే
కోటలు బద్దలై కూలిపోతే
దేవుడున్నాడన్న ఆలంబన తప్ప
మిగిలినదంతా అయోమయమైపోతే,
నమ్మకం నిలబడే తరుణమిదే
వీక్షించే బాటకన్న విశ్వాసపు చూపు మిన్న
కనిపించని పెను చీకటిలో
నమ్మకమే విశ్వాసపు వేకువ వెలుగు
అబ్రాహాము దేవుని నమ్మాడు. కంటికి కనిపించే దానిని పక్కకు పెట్టాడు. ప్రకృతి ధర్మాలను "మీరు గొడవ చేయకండి" అంటూ ఆదేశించాడు. అనుమానాల హృదయాన్ని "నోర్మూయీ" శోధన పిశాచి" అని గద్దించాడు. అబ్రాహాము దేవుని నమ్మాడు.