Skip to Content

Day 48 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి (యెహోషువ 1:2).


దేవుడిక్కడ వర్తమాన కాలంలోనే మాట్లాడుతున్నాడు. తాను "చెయ్యబోయే పని" అనడం లేదు. కాని ఇప్పుడే ఈ క్షణమే "ఇస్తున్న దేశం" అంటున్నాడు. విశ్వాసం కూడా ఇలానే మాట్లాడుతుంది. దేవుడు ఇలానే ఎప్పుడూ ఇస్తుంటాడు. కాబట్టి ఈ రోజున ఇప్పుడే దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు. ఇది నీ విశ్వాసానికి పరీక్ష. "విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది." నమ్మకమున్న ప్రార్థన చేసేవారికి ఆజ్ఞ వర్తమాన కాలంలో ఉంది. మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా అడిగిన వాటిని పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి మీకు అనుగ్రహింపబడును. అలాటి స్థితికి వచ్చామా? నిత్యవర్తమాన కాలంలో దేవుని ఎదుర్కొన్నామా?


నిజమైన విశ్వాసం దేవుని మీద ఆధారపడి చూడకముందే నమ్ముతుంది.సహజంగా మనమడిగింది మనకి లభించిందనడానికి ఏదో ఒక సూచక కనిపించాలి అనుకుంటాము. అయితే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని మాట తప్ప మరే సూచనా మనకి అవసరం లేదు. ఆయన మాట ఇచ్చాడు. ఇక మన నమ్మిక చొప్పున మనకి జరుగుతుంది. మనం నమ్మాము కాబట్టి చూస్తాము. ఈ విశ్వాసమే ఇబ్బందుల్లో మనకి ఆదరణగా ఉంటుంది. పరిస్థితులన్నీ దేవుడిచ్చిన మాటకి వ్యతిరేకంగా ఉన్నపుడు మనల్ని నిలబెడుతుంది. కీర్తనకారుడు అంటున్నాడు - "సజీపుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? తన ప్రార్థనలకి జవాబును ఇంకా చూడలేదు కాని చూస్తానని నమ్మకముంచాడు. ఆ నమ్మకమే అతన్ని సొమ్మసిల్లిపోకుండా చేసింది.


చూస్తామన్న నమ్మిక ఉంటే అది మనల్ని నిరుత్సాహానికి గురికాకుండా చేస్తుంది. అసంభవాలను కున్నవాటిని చూసి నవ్వుతాము. ఇబ్బందినుండి మానవపరంగా విడుదల లేదనుకున్న సమయంలో ఎర్రసముద్రాన్ని దేవుడు పాయలు చేసే దృశ్యాన్ని ఆనందంతో వీక్షిస్తాము. సరిగ్గా ఇలాటి తీవ్రమైన కష్టసమయాల్లోనే మన విశ్వాసం అభివృద్ధిచెంది బలపడుతుంటుంది.


ఆందోళన చెందియున్న ఆత్మలారా, సుదీర్ఘమైన రాత్రులలోనూ, విసుగు చెందించే పగటి వేళల్లోనూ ఆయన మిమ్ములను మర్చిపోయాడేమోనని భయపడుతున్నారా? ఆత్రుతగా ఆయన కోసం ఎదురుచూస్తున్నారా? మీ తలలెత్తండి. మీ దగ్గరికి వస్తూ ఉన్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ని స్తుతించండి.


Share this post