Skip to Content

Day 47 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను (నహూము 1:12).


బాధకి అంతు ఉంది. దేవుడు బాధపెడతాడు. దేవుడే తీసేస్తాడు.

"ఈ బాధకి అంతమెప్పుడు?" అంటూ నిట్టూరుస్తావా? ఆయన వచ్చేదాకా ఆయన సంకల్పాన్ని శిరసావహిస్తూ నిబ్బరంగా సహనంతో ఎదురు చూద్దాం. శిక్ష పొందడం వల్ల మనకి కలగవలసిన ప్రయోజనమంతా కలిగిన తరువాత దేవుడే ఆ శిక్షను తొలగిస్తాడు.


శ్రమ ఏదైనా మనల్ని పరీక్షించడానికి వస్తే, మనం ఆయన్ని స్తుతించి, ఆయన గురించి సాక్ష్యమిచ్చి, ఆయన్ని మహిమ పర్చిన తరువాత అది అంతమవుతుంది.


మనం దేవునికి ఆపాదించవలసిన ఘనత అంతా పూర్తిగా ఆపాదించకుండా ఒక శ్రమ మన నుండి తొలగిపోవాలి అని కోరుకోకూడదు. ఈ రోజున భయంకరంగా ఆకాశాన్నంటే కెరటాలు ఎప్పుడు చప్పబడిపోతాయో ఎవరికి తెలుసు? సముద్రం గాజులాగా నిర్మలంగా అయితే సముద్ర పక్షులు అలలతో ఎంత త్వరగా ఆటలు ఆడతాయో మనకేమి తెలుసు?శ్రమకాలం గతించాక, పనలను దుళ్ళగొట్టి తూర్పారబట్టడం అయిపోయాక, గాదెల్లో ధాన్యం నిండుతుంది.

ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నామో కొద్ది గంటలు గడిచాక అంత సంతోషభరితులమవుతాము.


రాత్రిని పగలుగా మార్చడం ప్రభువుకి కష్టమేమీ కాదు. మేఘాల్ని పంపినవాడు వాటిని వెళ్ళగొట్టగలడు కూడా. దిగులు మాని ఉత్సాహంగా ఉందాం. ముందు కాలం మంచిది. దానికోసం ఎదురుచూస్తూ స్తుతులు పాడుదాం.


మన పరమ రైతు అస్తమానమూ నలగగొడుతూనే ఉండడు. ఇది ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే. వర్షాలు త్వరలోనే వెలిసిపోతాయి. ఏడుపు కొద్దిగంటలే ఉంటుంది. తెల్లవారితే ఇక శోకం ఉండదు. మన శ్రమ క్షణికమే. శ్రమకి ఓ ప్రయోజనం ఉంది.


మనకి శ్రమ వచ్చిందన్న విషయమే మనలో దేవుడికి కావలసిన అతి ప్రశస్తమైనదేదో ఉన్నదన్న విషయానికి నిరూపణ. లేకపోతే అంత సమయం వృధా చేసి అంత శ్రద్ద మన మీద ఎందుకు చూపిస్తాడాయన? మట్టి, ఖనిజం కలిసిపోయి ఉన్నట్టు మన సహజ ప్రవృత్తిలో విశ్వాసమనే విలువగల ఖనిజం కలిసిపోయి ఉంది. కాబట్టే క్రీస్తు మనల్ని ఈ పరీక్షలకి గురిచేస్తున్నాడు.

ఈ నైర్మల్యాన్నీ, పరిశుద్ధతనూ వెలికి తేవాలనే ఆయన మనల్ని కొలిమిలో వేసి కాలుస్తున్నాడు.


పీడితుల్లారా, ఓపికపట్టండి. ఆ కష్టాలు మనలను నిత్యమహిమ వారసుల్ని చేసినట్టు మనం చూస్తాం. ఆ ఫలితం ఇప్పటి కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది. దేవుడు మనల్ని మెచ్చుకుంటూ అనే ఒక్క మాట, దేవదూతల ఎదుట మనకి జరిగే సన్మానం, క్రీస్తులో మనం పొందే మహిమ, వీటన్నిటి ముందు ఈ బాధలు లెక్కలోనివా?


గోడ గడియారానికి బరువుగా వ్రేలాడే లోలకం, ఓడని స్థిరపరచడానికి వేసే బరువులు అవి సరిగా పనిచెయ్యడానికి అవసరం. మన ఆత్మీయ జీవితంలో శ్రమలు కూడా అంతే. అంతులేని వత్తిడిని ఉపయోగిస్తేనే పరిమళాలు తయారవుతాయి. ఉన్నత శిఖరాల్లో మంచు కురిసేచోట్ల కళ్ళు మిరుమిట్లు గొలిపే పూలు పూస్తాయి. కంసాలి చేతుల్లో ఎక్కువ దెబ్బలు తిన్నదే ఎక్కువ విలువగల వజ్రం. శిల్పాలు ఎంత అందంగా తయారవ్వాలంటే శిల్పిచేతిలో అన్ని ఎక్కువ ఉలి దెబ్బలు తినాలి. ఇవన్నీ నియమాలే. ఇవన్నీ అతి జాగ్రత్తగా అంచనా వేసి ముందు చూపుతో చేసేవే.


Share this post