Skip to Content

Day 46 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మత్సరపడకుము (కీర్తన 37:1).


ఊరికే తాపత్రయపడిపోతూ ఆవేశపడిపోకు. వేడెక్కాల్సిన సమయమంటూ ఏదైనా ఉంటే అది ఈ కీర్తనలో మనకి కనిపించే సమయమే. దుర్మార్గులు ప్రశస్త వస్త్రాలు కట్టుకుని దినదినాభివృద్ధి చెందుతున్నారు. దుష్కార్యాలు చేసేవాళ్ళు పరిపాలకులౌతున్నారు. తమ తోటి వాళ్ళని నిరంకుశంగా అణగ దొక్కుతున్నారు. పాపులైన స్త్రీ పురుషులు దేశమంతటా విచ్చలవిడిగా గర్వంగా తిరుగుతూ సకల సంపదల్నీ అనుభవిస్తున్నారు. సాధుజనులేమో ఇదంతా చూసి సహించలేక ఆందోళన పాలౌతున్నారు.


"దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సరపడకుము" ఆవేశపడవద్దు, తాపీగా ఉండు. న్యాయం నీ వైపున ఉన్నా కూడా ఆవేశానికి పోతే అనర్థాలే.

మత్సరపడడం వలన మెదడును వేడెక్కిస్తుంది గాని బండి కదలడానికి అవసరమయ్యే శక్తిని మాత్రం పుట్టించదు.


రైలుబండి ఇరుసు వేడెక్కిపోతే లాభమేముంది? ఇరుసుకు ఘర్షణ తగిలినప్పుడే అది వేడెక్కుతుంది. వేడి దానికి హానికరమే. రెండు పొడి వస్తువులు రాసుకుంటుంటే ఘర్షణ పుడుతుంది. వాటి మధ్య మెత్తగా తిరగడానికి సహాయపడే చమురు ఏదైనా వెయ్యాలి.


"మత్సరపడడం" అనే మాటకి "మరణం" అనే మాటకీ సంబంధం ఉండడం భావగర్భితంగా లేదూ? మత్సరపడే వాళ్ళలో దేవుని కృప అనే చమురు లేదని ఇది సూచిస్తున్నది కదా.


మనం మత్సరపడుతున్నప్పుడు సాఫీగా సాగిపోతున్న జీవన యంత్రం రాపిడితో తిరుగుతుంది. ఘర్షణవల్ల ఇరుసులు అరిగిపోతాయి. వేడి పుడుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఊహించడమే కష్టం.


నీ జీవనయంత్రపు చక్రాన్ని వేడెక్కనియ్యకు. దేవుని కృప అనే చమురు నిన్ను సాఫీగా ఉంచుతుంది. వేడెక్కి ఆవేశం చూపించావంటే మనుషులు నిన్ను కూడా దుష్టుడిగా జమకడతారేమో.


విశ్రాంతి లేని హృదయమా ఊరుకో

ఆవేశపడకు ఆయాసపడకు

ప్రేమ చూపించడానికి దేవునికి

వేవేల మార్గాలున్నాయి

కేవలం నమ్మకం మాత్రముంచు

ఆయన చిత్తమేమిటో తెలిసేదాకా


హాహాకారాలు మాని నిబ్బరంగా ఉండు

వణికించే చలిగాలుల్లో కూడా

ఓ ప్రయోజనాన్ని దాచి ఉంచాడాయన

ధైర్యం సమకూడే దాకా

కేవలం ఆశతో కనిపెడుతూ ఉండు


శాంతి అంటే దేవుని చల్లని చిరునవ్వే

ఆయన ప్రేమే నువ్వు పోగొట్టుకున్నవన్నీ

తిరిగి నీకు సమకూర్చి పెడుతుంది

కొంతసేపు ఓపికపట్టు

యన్ని ప్రేమించి, ప్రేమిస్తూనే ఉండు


ఆయన ఎదపై హాయిగా నిదురపో

ఆయన కృపే నీకు బలం, జీవం

ఆయన ప్రేమే విరిసే పూల హారం

ఆయన శక్తి నిన్ను కమ్ముకోగా

కేవలం విశ్రమించు చల్లగా


విడిపించుకోవాలని పెనుగులాడకు

నీ బ్రతుకులో దేవుని జీవం ఉంది

యన్నుండి నువ్వు తొలగిపోకు

విశ్వాసం బలపడేదాకా

కేవలం ప్రార్థించు, ప్రార్థిస్తూనే ఉండు.


Share this post