Skip to Content

Day 43 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మీ పరలోకపు తండ్రికి తెలియును (మత్తయి 6:32).


మూగ చెవిటి పిల్లల ఆశ్రమంలో ఒకాయన ఆ పిల్లల వినోదం కోసం కొన్ని ప్రశ్నల్ని బోర్డు మీద వ్రాస్తున్నాడు. పిల్లలు హుషారుగా వాటికి జవాబులు రాస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రశ్న రాశాడు. "దేవుడు నాకు వినడానికి, మాట్లాడడానికి శక్తినిచ్చి మీకు ఎందుకివ్వలేదు?"


ఈ భయంకరమైన ప్రశ్న చెంపదెబ్బ లాగ వాళ్ల ముఖాలకి తగిలింది. "ఎందుకు?" అనే ప్రశ్న వాళ్ళని ప్రతిమల్లాగా చేసేసింది. అంతలో ఒక చిన్న పాప లేచింది.


ఆమె చిన్న పెదాలు వణుకుతున్నాయి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. నేరుగా బోర్డు దగ్గరికి నడిచి చాక్ పీస్ ని అందుకుంది. స్థిరమైన చేతితో ఈ జవాబును రాసింది. "తండ్రీ, ఇది నీ దృష్టికి సరైనది గనుక ఇది ఇలానే ఉండనియ్యి."


ఎంత ధన్యకరమైన జవాబు! ఇది నిత్య సత్యం.తల నెరసిపోయిన విశ్వాసి దగ్గర్నుండి దేవునిలో అప్పుడే పుట్టిన చంటి పిల్లల దాకా దీని మీద ఆధారపడవచ్చు. దేవుడు మన తండ్రి అనేదే సత్యం.


నిజంగా దీన్ని నమ్ముతున్నావా?నువ్వు నిజంగా ఈ సత్యాన్ని నమ్మితే నీ విశ్వాస విహంగం అశాంతిగా అటూ ఇటూ ఎగిరిపోక తన నిత్య విశ్రాంతి స్థానంలో గూడుకట్టుకుని ఉంటుంది. దేవుడు నీ తండ్రి.


అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మనకి అర్థమయ్యే రోజు వస్తుందనుకుంటాను.


కారణం లేకుండా రాలేదు నాకీ కష్టాలు

ఉంది దీని వెనుక దేవుని హస్తం

నేను చూడలేనిది ఆయనకవగతమే

ప్రతి నొప్పి వెనుకా ఉందొక ప్రయోజనం

ఈ లోకంలో నష్టం, పై లోకంలో లాభం

అల్లిక వెనుక వైపంతా దారాలు

అల్లిబిల్లిగా ముందువైపు అంతా

అందంగా కళాకారుని కలలు పండిన కళ

ప్రభూ, నువ్వు చిత్రకారుడివి

నీ ఆకారం ముద్రించు

నీ మహిమార్థం నామీద


Share this post