Skip to Content

Day 42 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్ళను ముట్టగానే యొర్దాను నీళ్ళు, అనగా ఎగువనుండి పారు నీళ్ళు ఆపబడి యేకరాశిగా నిలుచును (యెహోషువ 3:13).


దారి సుగనమయ్యేదాకా ఆయన ప్రజలు పాళెంలో ఉండకూడదు. విశ్వాసంతో నడిచిపోవాలి. తమ గుడారాలను విప్పుకుని, సామాన్లు సర్దుకుని వరసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి. అప్పుడు నది దారి ఇస్తుంది.


వాళ్ళు నది అంచుకి వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్టయితే వాళ్లకి ఎదురయ్యేది నిరాశే. వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేసాకే ఈ కార్యం జరుగుతుంది.


దేవుడన్న మాటను మనం ఉన్నదున్నట్టుగా తీసుకోవాలి. మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకి సాగాలి. ముందుకి వెళ్ళడానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి.కనిపించే అవరోధాలు మనం వాటిని దాటడానికి ప్రయత్నం చెయ్యకముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాము.

అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది.


కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు!


ఆజోర్స ద్వీపాలు దాటాడు

కనుచూపుమేరలో ఎక్కడా తీరంలేదు

అంతంలేని నీలసాగరం

నావికుడు అడిగాడు ఏం చేద్దాం

దారి చూపే తారలుకూడా కానరాకుండా పోయాయి


ధీర కొలంబస్ ది ఒకటే జవాబు

చేసేదేముంది? ముందుకి వెళ్ళడమే!


నావ సాగింది నిర్విరామంగా

నావికుడు వచ్చాడు "ఈ రాత్రి

సముద్రం మనల్ని కబళించజూస్తోంది

ఒక్క మాట చెప్పు, ఆశలన్నీ

అడుగంటాక ఏం చేద్దాం మనం?"


ధీర కొలంబస్ నోటినుండి ఒకటే మాట

ముందుకి సాగుదాం! ముందుకి సాగుదాం!


నావికుల్లో తిరుగుబాటు ధోరణులు

అందరి కళ్ళల్లో నిరాశ చీకటులు

ధైర్యశాలులకి గుండెల్లో ఇంటి బెంగ

నాయకుడు అడిగాడు "ఏం చేద్దాం,

రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే?"


ధీర కొలంబస్ ది ఒకటే జవాబు.

ఉదయమైనప్పుడు ముందుకి వెళ్ళడమే


బలహీనుడైపోయి పాలిపోయి

రేబవళ్ళూ పచార్లు చేసేవాడు

చీకటిరాత్రి దూరాన తళుక్కుమని ఓ వెలుగు

వెలుగు! వెలుగు! వెలుగు!

చూస్తుండగానే దగ్గరైంది


తెల్లవారింది, జాతీయ జెండాఎగిరింది

ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది


అది నేర్పిన పాఠం "సాగిపో సాగిపో!"


Share this post