Skip to Content

Day 4 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

24 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యేసు - నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయేను (యోహాను 4: 50).


ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుతున్నవాటినెల్లను పొందియున్నామని నమ్ముడి (మార్కు 11: 24).


ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు, దేవుడి మీద నమ్మకం కుదిరేదాకా ప్రార్థించాలి. జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకు ప్రార్థించాలి. జవాబు ఇంకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం నీలో ఉన్నట్టుగా ప్రార్థించకూడదు (ఇది జరిగేలా లేదు, జరిగేలా చెయ్యి ప్రభువా అని ప్రార్థించకూడదన్నమాట). అలాంటి ప్రార్థన ఏమి సహాయం చెయ్యదు సరికదా, అడ్డుబండ అయి కూర్చుంటుంది. ఇలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు ఉన్న కాస్తో కూస్తో విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలాంటి ప్రార్థన చేయాలి అనే ప్రేరేపణ ఖచ్చితంగా సైతాను నుండి వచ్చినదే. అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చేయడంలో తప్పులేదు. అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి. విశ్వాసం ఆవిరైపోయేదాకా ప్రార్థించవద్దు. "జవాబు కోసం కనిపెడుతున్నాను. నీ మీద నమ్మకంతో ఉన్నాను. నీ నుండి రాబోతున్న ఆ జవాబు కొరకు వందనాలు" అంటూ ప్రార్థించాలి. జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించడం కన్న గట్టి విశ్వాసం వేరే లేదు. విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్థనలు దేవుని వాగ్దానాలను తృణీకరించడమే కాక మన హృదయాలలో "అవును" అంటూ మెల్లగా వినిపించే ఆయన స్వరాన్ని కూడా నొక్కేస్థాయి.


ఇలాంటి ప్రార్థనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలియజేస్తాయి. అల్లకల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే. "విశ్వాసులమైన మనము (విశ్వాసం ఉన్న మనము) ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము" (హెబ్రీ 4: 3). విశ్వాసాన్ని ఇంకేపోచేసే ప్రార్ధన ఎలా వస్తుందంటే దేవుని వాగ్దానం గురించి పట్టించుకోకుండా మనం అడిగిన విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దానిమీద మనసు లగ్నంచేసినప్పుడు వస్తుంది. అబ్రహాము "తన శరీరము మృతతుల్యమైనట్టును... (భావించెను గాని) అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక" (రోమా 4:19,20). విశ్వాసాన్ని వాడిపోయేలా చేసే ప్రార్థనలు మనం చేయకుండా ఉండేలా జాగ్రత్త పడదాము.


విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు. ఒక దృశ్యం కాదు. ఒక వివేచన కాదు. దేవుడి మాటను ఉన్నదున్నట్టుగా నమ్మడమే.


ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది. నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకి స్వస్తి.


అన్నీ చక్కగా అమరుతూఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడు నేర్చుకోలేవు. నిశ్శబ్దమైనవేళల్లో దేవుడు తన వాగ్దానాలను మనకిస్తాడు. గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు. ఇక వెనక్కి తగ్గి ఆ మాటల్లో ఎంత వరకు మనకు నమ్మకం ఉన్నది కనిపెడతాడు, ఆ తరువాత శోదకుడిని మన దగ్గరికి వచ్చేందుకు అనుమతిస్తాడు. మనకి సంభవించేవన్ని దేవుని మాటలకి వ్యతిరేకంగానే జరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఈ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది. నమ్మకం గెలుస్తుంది.


ఇప్పుడైతే మనం చెలరేగే తుఫానులో మన సాటివాళ్లంతా భయంతో వణికిపోతున్న వేళ జయోత్సాహంతో కేక పెట్టాలి - "దేవుడు చెప్పినట్టే చివరికి జరుగుతుంది. నేను ఆయన్ని నమ్ముతున్నాను!"


దినకరుడు జీవించునంత కాలం

నక్షత్రాలు ప్రకాశించినంతకాలం

మరణంలోను మనుగడలోను విశ్వసించండి


ఆయన జ్ఞాన హస్తాలేమనల్ని నడిపిస్తాయీ

చీకటి దారైనదివ్య సంకల్పపు

దివ్వెలు వేలుగుతుంటాయీ


Share this post