Skip to Content

Day 39 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

24 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను (మత్తయి 28:20).


జీవితంలో సంభవించే మార్పులు, సంఘటనల గురించి భయం భయంగా కనిపెట్టకు. నువ్వు దేవునికి చెందినవాడివి గనుక ఆయన వాటన్నిటినుండి నిన్ను విమోచిస్తాడన్న నిరీక్షణతో ఎదురుచూడు. ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు. ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఉండు. అన్ని ఆపదలలోనూ క్షేమంగా నడిపిస్తాడు. నువ్వు నిల్చోడానికి కూడా శక్తి లేకుండా ఉన్నప్పుడు తన చేతుల్లోకి నిన్ను ఎత్తుకుంటాడు.


రేపేం జరుగుతుందో అని దిగులుపడకు. నిన్ను ఈ రోజంతా కాపాడిన నీ నిత్యుడైన తండ్రి రేపు, రాబోయే అన్ని రోజుల్లోనూ నిన్ను కాపాడతాడు. నిన్ను శ్రమనుండి తప్పిస్తాడు. లేక శ్రమను భరించే శక్తినిస్తాడు. నిబ్బరంగా ఉండు. ఆందోళనకరమైన ఆలోచనల్ని ఊహల్ని కట్టి పెట్టు.


యెహోవా నా కాపరి


"ఒకప్పుడు నా కాపరి" కాదు, "మరెప్పుడో నా కాపరి" కాదు,

"ఇప్పుడు" యెహోవా నా కాపరి. ఆదివారం, సోమవారం అన్ని రోజుల్లో ఆయన నా కాపరి. జనవరి నుండి డిసెంబరు దాకా, ఇక్కడైనా, చైనాలోనైనా, శాంతికాలంలోనైనా, యుద్ధంలోనైనా, సమృద్ధిలోనైనా, కరువులోనైనా యెహోవా నా కాపరి.


నీకోసం మౌనంగా ఏర్పాట్లు ఆయనే చేస్తాడు

పొంచి ఉన్న వలలో నువ్వు పడకుండా

నీ మార్గదర్శి ఆయనే

ఆయన సంరక్షణలో ఉన్నావు నీవు


నీకోసం ఏర్పాట్లు తప్పకుండా చేస్తాడు

నిన్ను విస్మరించడు

దేవుని విశ్వాస్యతలో నిశ్చింతగా ఉండు

ఆయనలో నీవు వర్ధిల్లుతావు


నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు

అవి ఆశ్చర్యకారకాలైన అనురాగ బహుమతులు

కనీవినీ ఎరుగని అద్భుతాలు

నీ కోసమే వాటిని చేసాడు


నీ కోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు

తండ్రి సంరక్షణలో కేరింతలు కొట్టే పాప

ఆయన ప్రేమలో మరెవరికీ వంతులేదు

నువ్వే ఆయనకి ఇష్టుడివి


నీ విశ్వాసం దేవుని గురించి ఎలా అర్థం చేసుకుంటే ఆయన అలాగే ఉంటాడు.


Share this post