Skip to Content

Day 360 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడి (మత్తయి 26:36).


పరిస్థితులు బాగా లేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే మనకి అది ఏమాత్రం నచ్చదు. గెత్సెమనే తోటలో పదకొండుమందిలో ఎనిమిదిమందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభువు. ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్ధించడానికి. పేతురు యాకోబు యోహానులకు మధ్యలో ఉండి కనిపెట్టమని చెప్పాడు. మిగతా వాళ్ళంతా దూరంగా ఒకచోట కూర్చున్నారు. ఆ ఎనిమిదిమంది చాలా సణుగుకుని ఉంటారను కుంటాను. వాళ్ళు తోటలో ఉన్నారన్న పేరు మాత్రం ఉంది. అంతే దాన్లోని పూలు పూయించే విషయంలో వాళ్ళ పాత్ర ఏమాత్రం లేదు. అది అత్యవసర పరిస్థితి. అందరూ అనేక రకాలైన వత్తిడులకి లోనై ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి యేసు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే "ఏమీ చెయ్యకుండా అక్కడ కూర్చోండి." ఇలాటి అనుభవమే చాలాసార్లు నీకూ నాకూ వచ్చింది కదా. ఆ నైరాశ్యతను మనం చవిచూశాం. సేవ చెయ్యడానికి ఎన్నో అవకాశాలు మనకి కనబడినాయి. మన తోటివాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్ళారు. మరికొందరు మధ్యను ఉన్నారు. మనం మాత్రం వెనకాల పండుకుని ఉండవలసివచ్చింది. అస్వస్థతో, పేదరికమో, లేక మరో విధంగా పరిస్థితులు తలక్రిందులు కావడమే జరిగి మనం వెనకాల ఉండవలసివచ్చింది. మనం చిన్నబుచ్చుకున్నాం. క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్డంకులేమిటో మనకి అర్థం కాదు. తోటలోకి మనం ప్రవేశించిన తరువాత కూడా చెయ్యడానికి ఏ పనీ లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది.


"హృదయమా మేదలకుండా ఉండు. నీకర్థమయ్యేదే ఎప్పుడూ వాస్తవం అనుకోకు. క్రైస్తవ జీవితంలో పాలుపంపులు నీకు తప్పకుండా ఉన్నాయి. దేవుని తోటలో నడిచేవాళ్ళే, నిలబడేవాళ్ళే నిజమైన సేవకులు అనుకోకు. నువ్వు కూర్చుని ఉండవలసివచ్చిన స్థలం కూడా పరిశుద్దమైనదే.” క్రీస్తులో జీవించి ఉండడంలో మూడు రకాలున్నాయి. ముందుకి వెళ్ళి పనిచేస్తూ కనిపెడుతూ తెల్లవారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని. మరికొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్నవాటిని ఇతరులకు తెలియజేస్తుంటాయి. ఇవి రెండూ కాక మూడో రకం పోరాడలేనివి, పోరాటాన్ని చూడలేనివి ఉంటాయి. ఆ ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ "ఇక్కడే కూర్చుని ఉండండి."


నీకిలాటి అనుభవం తటస్థించినప్పుడు దేవుడు నిన్ను కించపరుస్తున్నాడనుకో వద్దు. "ఇక్కడ కూర్చోండి" అని యేసు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి. తోటలో నువ్వు కూర్చుని ఉన్న స్థలం కూడా పరిశుద్దమైనదే. దాని పేరు "వేచియుండే చోటు" కొన్ని ఆత్మలు గొప్ప పనులు చెయ్యడానికి గాని, గొప్ప భారాలు వహించడానికి గాని ఈ లోకానికి రావు. అవి కేవలం అలా ఉండడం కోసమే నియమించబడినాయి. అవి మనుషులు ఎప్పుడూ ఉపగించని పూలు. వాటిని ఎవరూ దండగా గుచ్చలేదు. ఏ బల్లమీదా అవి అలంకారం ఉండలేవు. పరిశీలకుల దృష్టిలోకి ఎప్పుడూ అవి రాలేదు. కాని క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టినాయి. వాటి పరిమ వల్ల, వాటి అందం పట్ల అవి క్రీస్తుకి ప్రియమైనవైనాయి. తన అందాన్ని చూసేవాళ్ళెవరు లేకపోయినా అవి అందాన్ని నింపుకుస్నందువల్ల దేవుడు చూసి సంతోషిస్తున్నాడు. నువ్వు ఇలాటి పువ్వువైతే సణుక్కోవద్దు.

Share this post