Skip to Content

Day 359 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు... ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము (మత్తయి 1:22,23).

. . . సమాధానకర్తయగు అధిపతి (యెషయా 9:6).


గాలిలో పాట మ్రోగింది

నింగిలో తార వెలసింది

తల్లి ప్రార్థనలో పసికందు రోదన కనిపించింది.

తార వెలుగులు చిమ్మింది

వెలుగు జీవులు గళమెత్తారు

బేత్హేములో పశులపాక రాజాధిరాజు రాక.


కొన్నేళ్ళక్రితం ఒక క్రిస్మసు కార్డు చూశాను. దానిమీద "క్రీస్తు పుట్టకపోయి నట్టయితే" అని రాసి ఉంది. క్రీస్తు పలికిన మాటలే దాని ఆధారం. "నేను రాకయున్నచో" ఆ కార్డుమీద ఒక పాస్టరుగారు క్రిస్మస్ రోజున చిన్న కునుకుతీస్తూ క్రీస్తు రాకకి నోచుకోని ఈ లోకం గురించి కలగంటూ కనిపిస్తాడు.


ఆ కలలో అతడు తన ఇంట్లోనుంచి చూస్తుంటే క్రిస్మస్ అలంకారాలేమీ లేవు. రక్షించడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి క్రీస్తు లేడు. అతడు బయటికి వెళ్తే వీధిలో తల ఎత్తుకుని నిలబడి ఉన్న చర్చి గోపురం లేదు. అతడు తిరిగివచ్చి తన గదిలో చూస్తే రక్షకుని గురించిన ప్రతి పుస్తకమూ మాయమైంది.


తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీశాడు. ఒక పిల్లవాడు తన తల్లి మరణశయ్య మీద ఉందని, వచ్చి చూడమని అన్నాడు. ఏడుస్తున్న ఆ పిల్లవాడితో త్వరత్వరగా పాస్టరుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని "ఇదిగో నిన్ను ఓదార్చేందుకుగాను కొన్ని మాటలు చెప్తాను" అంటూ బైబిలు తెరిచాడు. వాగ్దానాలేమన్నా ఉన్నాయేమోనని చూస్తే బైబిల్లో మలాకీయే ఆఖరు పుస్తకం. సువార్తలు లేవు. రక్షణ లేదు. నిరీక్షణ లేదు. అతడు కూడా తన తలవంచి ఏడుస్తున్న వాళ్ళతో కలసి ఏడవవలసివచ్చింది.


ఆ తల్లి మరణించాక భూస్థాపన కార్యక్రమం కోసం వెళ్ళాడు పాస్టరుగారు. ఆదరణ వాక్యమేమీ దొరకలేదు చెప్పడానికి. మహిమలోకి పునరుత్థానం లేదు. తెరిచి ఉన్న ఆకాశం లేదు. మన్ను మంటిలో, బూడిద బూడిదలో కలిసిపోవడమే. అదే ఆఖరి చూపు. శాశ్వతమైన ఎడబాటు, క్రీస్తు ఎన్నడూ రాలేదని గ్రహించి ఆ నిద్రలోనే ఏడుస్తూ ఉంటాడు.


హఠాత్తుగా అతడికి మెలకువ వచ్చింది. ఒక్కసారి అతని నోటిలోనుండి స్తుతులూ, సంతోషగానాలూ వెలువడినాయి. ఎందుకంటే నిద్ర మేలుకొనగానే బయటనున్న చర్చిలో నుండి క్రిస్మస్ పాటలు వినిపించాయి.


ఓ సద్భక్తులారా! లోకరక్షకుండు

బెత్లెహేమందు నేడు జన్మించెన్

రాజాధిరాజు ప్రభువైన క్రీస్తు,

నమస్కరింప రండి నమస్కరింప రండి.


ఆయన వచ్చాడు కాబట్టి ఈరోజున మనమంతా సంతోషంతో గంతులు వేద్దాం. దూత చేసిన ప్రకటన గుర్తుచేసుకుందాం. "ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు" (లూకా 2:10,11).


అన్యజనుల వైపుకి మన హృదయాలను మళ్ళించుదాము. క్రిస్మస్ రోజు లేని ప్రదేశాలను గుర్తుచేసుకుందాం. "పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏవియు సిద్దము చేసికొననివారికి వంతులు పంపించుడి" (నెహెమ్యా 8:10).

Share this post