- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను (యోహాను 16:32).
నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయ్యవలసి ఉంటుంది. ఎన్నో తడబాట్లకి గురై ఎన్నోవాటిని దూరం చేసుకుని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్నీ, ఒంటరితనాన్నీ వహించవలసి ఉంటుంది. పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు, దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్మని ఆకాశం నిరంతరం నిలిచి ఉండేచోట ఉండదలుచుకున్నవాడు, కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే.
పక్షిరాజుకన్న ఒంటరి పక్షి లేదు. ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడూ ఎగరవు. ఒకటి, లేకపోతే రెండు అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి. దేవునితో జీవితం గడిపేవాళ్ళకి ఇది అనుభవమౌతుంది.
ఇలాటి వాళ్ళే దేవుడికి కావాలి. దేవునికి సమీపంగా వెళ్ళి అవతలివైపున ఆయనతో ఒంటరిగా నడవనివాళ్ళు ఆయనకి చెందిన శ్రేష్ఠమయిన విషయాల్లో పాలుపొందలేరు. హోరేబు పర్వతంమీద అబ్రాహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు. కాని సొదొమలో నివసించే లోతుకు ఆ అనుభవం లేదు. ఐగుప్తు జ్ఞానమంతటిలో విద్వాంసుడైన మోషే నలభై సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు. పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంటబట్టించుకుని గమలీయేలు దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారుల్లోకి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు. దేవుడు నిన్ను ఒంటరివాణ్ణిగా చెయ్యనియ్యి. అంటే సన్యాసిగా మారి అరణ్యంలో నివసించమని కాదు నేననేది. ఇలాటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఇక ఆపైన మనచుట్టూ ఉన్న మనుషుల సహాయం, ప్రార్ధన, విశ్వాసం, ఆదరణలు అవసరం ఉండవు. ఇతరుల నుండి ఇలాటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసానికీ, క్షేమానికీ అవి అడ్డుబండలౌతాయి. మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు. మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు. అది గడిచిపోయిన తరువాత మనం అంతవరకూ ఎవరిమీద ఆధారపడి ఉన్నామో వాళ్ళమీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళమీద ఆధారపడడం మాత్రం మానేస్తాము. ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాడని అర్థమౌతుంది.
ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి. షిలోహు రహస్యాలను దేవుని దూత యాకోబు చెవిలో ఊదాలంటే అతను ఒంటరివాడవ్వాలి. పరలోక దర్శనాలను చూడాలంటే దానియేలు ఏకాంతంగా ఉండాలి. భవిషద్దర్శనాలను చూడాలంటే యోహాను పత్మసు లంకకి వెళ్ళాలి.
ఆయన ఒంటరిగా ద్రాక్షగానుగలో పనిచేశాడు. ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా?