- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును (లూకా 21:13).
జీవితం ఏటవాలు బాట. ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతులూపుతూ ఉంటే బావుంటుంది. మనందరం ఎక్కిపోయే వాళ్ళమే. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కొండలెక్కడమన్నది కష్టతరమైనదే గానీ మహిమాన్వితమైనది. శిఖరాన్ని చేరాలంటే శక్తి, స్థిరమైన నడక అవసరం. ఎత్తుకు వెళ్తున్నకొద్దీ దృష్టి విశాలమౌతూ ఉంటుంది. మనలో ఎవరికైనా ఏదన్నా విలువైనది కనిపిస్తే వెనక ఉన్నవాళ్ళని పిలిచి చెబుతూ ఉండాలి.
నాకంటే నువ్వు ముందుకి వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నన్నూ పిలువు. ఈ రాళ్ళ దారిలో నీ పిలుపు నా హృదయాన్ని సంతోషపెట్టి నా కాళ్ళను బలపరుస్తుంది. ఒకవేళ విశ్వాస నేత్రం మసకబారితే, దీపంలో నూనె అడుగంటితే నా ఒంటరి ప్రయాణంలో నీ కేక నాకు మార్గదర్శకమౌతుంది. కేకవేసి చెప్పు, తుపాను సమయాల్లో దేవుడు నీతో ఉన్న విషయం, అరణ్య వృక్షాలు సమూలంగా కూలిపోతున్నవేళ నీకు తోడై ఉన్న విషయం ఆకాశాలు గర్జించి భూకంపం పర్వతాలని కదిలించినవేళ, ప్రశాంత వాతావరణంలోకి నిన్ను తీసుకుపోయిన విషయం.
నేస్తం, వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు. నీ జాడ నా కనుమరుగైంది. పందెంలో పాల్గొంటున్నవాడి ముఖం వెలిగిపోతూ ఉంటుందంటారు. కానీ నీకూ, నాకూ మధ్య పొగమంచు పట్టింది. నా కన్ను మసకబారింది. దేవుని మాటల కోసం కనిపెట్టినప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నాను. కానీ నీ ప్రార్థనను దేవుడు విన్నాడని చెప్తే, పాపపు అంధకారంలోగుండా నిన్ను నడిపించాడని నువ్వు చెప్తే నా మనసు తేలికౌతుంది. ఈ రాళ్ళదారిలో నా కాళ్ళకి బలం చేకూరుతుంది.
నేస్తం నువ్వు కాస్తంత ముందున్నావు; నువ్వు వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు.