Skip to Content

Day 350 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అన్న అను ఒక ప్రవక్రియుండెను . . . దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవచేయుచుండెను (లూకా 2:36,37).


ప్రార్థించడంవల్ల నేర్చుకొంటామనడంలో సందేహం లేదు. ఎంత తరుచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్ధించడం వస్తుంది. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం, శక్తివంతం అయిన ప్రార్థనను ఎప్పటికీ నేర్చుకోలేడు.


ప్రార్థన ద్వారా మన దేవుని గొప్పశక్తి మన అందుబాటులోనే ఉంది. కాని దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి. అబ్రాహాము తన జీవితకాలమంతా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సొదొమ కోసం అంతలా దేవునితో వాదించగలిగేవాడా?


పెనూయేలు దగ్గర రాత్రంతా యాకోబు దేవునితో పోరాడినది అతని జీవితంలో మొదటి సందర్భమనుకుంటున్నారా? మన ప్రభువు గెత్సెమనేకి వెళ్ళకముందు శిష్యులతో చేసిన ఆ మహత్తరమైన ప్రార్ధన కూడా అంతకుముందు ఎన్నెన్ని రాత్రి సమయాల్లోనూ, పెందలకడనే లేచి చేసిన ప్రార్ధనల ఫలితమే కదా.


తనఇష్టప్రకారం ప్రార్ధనా వీరుడినవ్వాలని ఎవరన్నా అనుకుంటే, అతని ప్రయాస అంతా వ్యర్థమే. ఆకాశపు వాకిళ్ళను మూసి, తరువాత వాటిని తెరచి వానలు కురిపించిన ఏలీయా ప్రార్ధన కూడా అంతకుముందు చేసిన ఎన్నో ప్రార్ధనల అలవాటు మూలంగానే. క్రైస్తవులు ఇది గుర్తుంచుకోవాలి. ప్రార్థన ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి.


హతసాక్షులు మొదలైనవాళ్ళ పేర్లు తెలిసినంతగా గొప్పగొప్ప ప్రార్ధనాపరుల పేర్లు బయటికి తెలియవు. అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసినవారే. కృపాసింహాసనం దగ్గర వదలకుండా ప్రాకులాడినందువల్లనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులైనారు. ప్రార్థన కోసం ప్రార్థించాలి. మన ప్రార్ధనలు కొనసాగడం కోసం ప్రార్థించాలి.

Share this post