Skip to Content

Day 348 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను. అందుకాయన - మీరు ప్రార్ధన చేయునప్పుడు . . . నీ రాజ్యము వచ్చును గాక . . . అని పలుకుడని వారితో చెప్పెను (లూకా 11:1,2).


మాకు ప్రార్ధన చెయ్యడం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు తన కళ్ళెత్తి దేవుని మహిమనొక్కసారి అవలోకించాడు. నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒక్కసారి తలుచుకున్నాడు. దేవుడు మానవ జీవితంలో చేయ సంకల్పించిన దాని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడ్చి "ఇలా ప్రార్థించండి" అంటూ ఆదేశించాడు. మనకు సాధారణంగా వినబడే ప్రార్థనకీ దీనికీ ఎంత వ్యత్యాసమో చూడండి. మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఇలా ఉంటుంది మన ప్రార్థన "దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్నీ, నా సంఘాన్నీ, మా ఊరినీ, మా దేశాన్నీ దీవించు" ఎక్కడో ఓ మూలను ఆయన రాజ్యం గురించి ఒకమాట అంటామేమో.


ప్రభువైతే మనం ఎక్కడైతే వదిలేశామో అక్కడ ప్రారంభించాడు. లోకం గురించి ముందు, మన వ్యక్తిగత అవసరాలు తరువాత అడగాలి. నా ప్రార్థన ఖండాంతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుపుకుని, ప్రపంచమంతటి కొరకు దేవుని సంకల్పం గురించీ, ప్రతి వ్యక్తి గురించీ, ప్రతి జాతి గురించీ ప్రార్ధించిన తరువాత నా కోసం చిన్న రొట్టెముక్క నిమ్మని అడగమంటున్నాడు.


తనకున్నదంతా ఇచ్చేసి, తనకుతానే మనకోసం సిలువపై త్యాగం చేసేసిన తరువాత ఆయన మనల్ని ఏదైనా అడగడానికి యోగ్యుడే కదా. దేవుని రాజ్యం ముందు అందరు స్త్రీ పురుషులూ అల్పులే. ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవరూ తాకలేరు. క్రీస్తుకి సంబంధించిన వ్యవహారాలే మన జీవితాల్లో ప్రధానాంశాలనీ, మన వ్యక్తిగత అవసరాలు, మనకెంత ముఖ్యమైనవైనా, ప్రియమైనవైనా అవి క్రీస్తు పని తరువాతేనని మనం నేర్చుకునేదాకా ఇంతే.


ఆఫ్రికా ఖండపు మిషనరీ రాబర్ట్ మోఫతిని ఒక పాప తన ఆల్బమ్ లో ఏదైనా రాయమంది. ఆయన రాసిన మాటలివి,


నా హృదయమే నా ఆల్బమ్

తుపానుకమ్మ చీకటిమూసి

కాంతి విహీనమైన ఆల్బమ్

యేసు పేరు దానిపై రాయాలి

ఆ హృదయం ఆయన ముందు మోకరిల్లాలి

సౌందర్య లోకాల్ని వీక్షించాలి

ఇదే నా ప్రియమైన కోరిక.


"ఆయన రాజ్యము అంతము లేనిదైయుండును" (లూకా 1:33).


మీషనరీ పని చెయ్యడమన్నది ఈనాటి సంఘాలు తరువాత ఆలోచించి తెలుసుకున్నది కాదు. క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది.

Share this post